
కార్ల ధరలు పైపైకి...
న్యూఢిల్లీ: సాధారణంగా పండుగల సీజన్‌లో కార్ల కంపెనీలు డిస్కౌంట్ల ద్వారా వినియోగదారులను ఆకర్షించడం రివాజు. దీనికి భిన్నంగా ఈ ఏడాది కార్ల కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. అమ్మకాలు పడిపోవడం, రూపాయి అనూహ్య పతనం, ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో పలు కంపెనీలు ధరలను పెంచుతున్నాయి. తాజాగా హ్యుందాయ్, జనరల్ మోటార్స్ కంపెనీలు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. అన్ని మోడళ్ల ధరలను 1 నుంచి 1.5 శాతం వరకూ పెంచే విషయమై ఆలోచన చేస్తున్నామని టాటా మోటార్స్ పేర్కొంది.
హ్యుందాయ్ పెంపు రూ.20వేల వరకూ
అన్ని మోడళ్ల ధరలను రూ.4,000 నుంచి రూ.20,000 వరకూ పెంచుతున్నామని హ్యుందాయ్ కంపెనీ తెలిపింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేష్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. రూపాయి పతనం, ద్రవ్యోల్బణ పరిస్థితుల కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరిగాయని వివరించారు. వ్యయభారాన్ని చాలా వరకూ భరించగలిగామని, ఇక ధరలు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ కంపెనీ రూ.2.85 లక్షల ఖరీదుండే ఈఆన్ మోడల్ కారు నుంచి రూ.26.49 లక్షల ఖరీదుండే శాంటా ఫే మోడల్ కార్ల వరకూ విక్రయిస్తోంది. గ్రాండ్ ఐ10 కార్ల ధరలను మాత్రం పెంచడం లేదని రాకేష్ చెప్పారు.
జీఎం వడ్డింపు నాలుగోసారి
మరోవైపు జనరల్ మోటార్స్ కూడా కార్ల ధరలను రూ.10,000 వరకూ పెంచనున్నది. జనరల్ మోటార్స్ ధరలు పెంచడం ఈ ఏడాది ఇప్పటికిది నాలుగోసారి. ఈ కంపెనీ ఈ నెల మొదట్లో బీట్, సెయిల్, ఎంజాయ్ కార్ల ధరలను రూ.10 వేల వరకూ పెంచింది. మరో దఫా అన్ని మోడళ్ల ధరలను 1.5 శాతం పెంచాలని యోచిస్తోంది. మోడళ్లను బట్టి ధరల పెంపు రూ.2,000 నుంచి రూ.10,000 రేంజ్‌లో ఉంటుందని కంపెనీ వైస్ ప్రెసిడెంట్, పి. బాలేంద్రన్ చెప్పారు. ఈ కంపెనీ రూ.3.33 లక్షల ఖరీదుండే స్పార్క్ మోడల్ నుంచి రూ.16 లక్షల ఖరీదుండే క్రూజ్ మోడల్ వరకూ కార్లను విక్రయిస్తోంది.
త్వరలో మారుతీ నిర్ణయం
పరిస్థితులను గమనిస్తున్నామని, ధరల పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మార్కెట్ లీడర్ మారుతీ సుజుకి తెలిపింది. కాగా, హోండా కార్స్ ఇండియా మాత్రం కార్ల ధరలను పెంచబోవడం లేదని వివరించింది. ఈ నెల 21 నుంచే కార్ల ధరలను పెంచుతున్నట్లు టయోటా కంపెనీ ఇటీవలనే ప్రకటించింది. ఈ నెల ప్రారంభంలోనే కార్ల ధరలను 1-5 శాతం వరకూ పెంచుతున్నట్లు ఫోర్డ్ ఇండియా పేర్కొంది. మెర్సిడెస్ బెంజ్ 4.5 శాతం, బీఎండబ్ల్యూ 5 శాతం, ఆడి 4 శాతం వరకూ ధరలను పెంచాయి.