పూర్తిస్థాయిలో విచారించాల్సిందే
ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు
- ఆరోపణలపై ఏపీ సీఎం వివరణ ఇవ్వాలన్న సర్వోన్నత న్యాయస్థానం
- తెలంగాణ ఏసీబీకి కూడా నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం
- చంద్రబాబు తప్పించుకోలేరు: న్యాయవాది పొన్నవోలు
- క్రిమినల్ చట్టంలో లోకస్‌స్టాండీ అనే పదం ఎక్కడా లేదు: ఆర్కే
సాక్షి, న్యూఢిల్లీ, హైదరాబాద్:
ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం చంద్రబాబును ఆదేశించింది. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఆయనతోపాటు తెలంగాణ ఏసీబీకి సైతం నోటీసులు ఇచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి వివరాలను కౌంటర్ల రూపంలో తమ ముందుంచాలని వారిని ఆదేశించింది.
ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్.ఎ.బాబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటుకు కోట్లు వ్యవహారానికి సంబంధించిన ఈ కేసులో పూర్తిస్థాయి విచారణ జరుపుతామని ఈ సందర్భంగా ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరిపించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (ఆర్కే) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.
విచారణ జరపాలన్న ఏసీబీ కోర్టు...
ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు సక్రమంగా సాగడం లేదని, ఏసీబీ అధికారులు చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఆగస్టు 8న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దీనిపై దర్యాప్తు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ గత ఏడాది ఆగస్టు 29న ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబునాయుడు సెప్టెంబర్ 1న హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు, ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల అమలును నిలిపేస్తూ సెప్టెంబర్ 2న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో తుది విచారణ జరపాలంటూ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.
మొదట్లో వేగంగా చేశారు.. తరువాత పక్కన పట్టేశారు...
ఈ నేపథ్యంలో చంద్రబాబు దాఖలు చేసిన వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి విచారణ జరిపారు. ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ దాఖలు చేసిన చార్జిషీట్లో 22 సార్లు చంద్రబాబునాయుడు ప్రస్తావన వచ్చిందని, అయితే ఆయన పాత్రపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేయడం లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టుకు నివేదించారు. ఈ కేసు మొదట్లో దర్యాప్తును వేగంగా ప్రారంభించిన ఏసీబీ అధికారులు తరువాత కీలక దర్యాప్తును పక్కనపెట్టేశారన్నారు. దీంతో తాము ఏసీబీ ప్రత్యేక కోర్టు వాస్తవాలను బహిర్గతం చేయాలన్న ఉద్దేశంతో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశామని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ప్రత్యేక కోర్టు తాము తమ ఫిర్యాదులో పేర్కొన్న అంశాల్లో వాస్తవం ఉందో లేదో దర్యాప్తు చేయాలని మాత్రమే ఏసీబీని ఆదేశించిందని వివరించారు. ఏసీబీ అధికారులు చంద్రబాబు స్వర నమూనాల జోలికి వెళ్లలేదని ఆయన తెలిపారు.
ఓటుకు డబ్బు అవినీతి కాదు...
ఎన్నికల్లో ఓటు వేసేందుకు డబ్బు ఇవ్వడం అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) పరిధిలోకి రాదని చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా తెలిపారు. ఓటు వేయడమన్నది ప్రజా విధుల్లో భాగం కాదని, అది కేవలం రాజ్యాంగపరమైన బాధ్యత మాత్రమేనని ఆయన తెలిపారు. అంతేకాక ఎన్నికైన వ్యక్తి ప్రజా సేవకుడిగా బాధ్యతలు నిర్వరిస్తున్న సందర్భంలో అవినీతికి పాల్పడితే అప్పుడు మాత్రమే పీసీ యాక్ట్ వర్తిస్తుందని ఆయన వివరించారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సునీల్ చౌదరి డిసెంబర్ 9న తీర్పు వెలువరించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ కేసులో జోక్యం చేసుకునే అర్హత అతనికి లేదని తేల్చి చెప్పింది. అంతేకాక చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆధారంగా అతన్ని ఈ కేసులో లాగేందుకు ఆ తరువాత నిర్ధిష్టమైన ఆరోపణలు చేశారన్న న్యాయమూర్తి.. అతను స్టీఫెన్సన్కు లంచం ఇవ్వజూపలేదని తేల్చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రామకృష్ణారెడ్డి తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
22 సార్లు బాబు పేరు చెప్పి.. ఆయన్ను మాత్రం విచారించలేదు...
హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. నేర విచారణ స్మృతి (సీఆర్పీసీ) సెక్షన్ 39, 190 ప్రకారం తనకు ఈ కేసులో జోక్యం చేసుకొనే అర్హత ఉందని రామకృష్ణారెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. నేరం ఎవరు చేసినా.. ఆ నేరాన్ని చూసిన వ్యక్తి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని చట్టం, సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను రూ. ఐదు కోట్లకు కొనాలని చూశారని, ఇది అవినీతి కిందికే వస్తుందన్నారు. స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు స్వయంగా ఫోన్లో మాట్లాడారని తెలిపారు. ఈ ఫోన్ సంభాషణలో ఉన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు గొంతేనని ఫోరెన్సిక్ ల్యాబ్ సైతం నిర్ధారించిందన్నారు. ఏసీబీ అధికారులు సైతం తాము దాఖలు చేసిన చార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లకు పైగా ప్రస్తావించారన్నారు. కానీ అదే ఏసీబీ చంద్రబాబును మాత్రం విచారించలేదన్నారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చే విషయంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని వివరించారు. ఈ విషయాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం...
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, తంగిరాల విజయభాస్కర్‌రెడ్డిలు హాజరయ్యారు. కేసు విచారణకు రాగానే చంద్రబాబు తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా స్పందిస్తూ... ఈ కేసులో జోక్యం చేసుకునే ఈ కేసులో పిటిషనర్‌కు జోక్యం చేసుకొనే అర్హత లేదని హైకోర్టు తీర్పు వెలువరించిందని తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ఇది వినవలసిన కేసు. పూర్తిస్థాయిలో విచారణ జరుపుతాం. కేసు త్వరిగతిన విచారణకు వచ్చేలా చూస్తాం’’అని తేల్చి చెప్పింది. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరిస్తున్నట్టు తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న చంద్రబాబు నాయుడితో పాటు తెలంగాణ ఏసీబీకి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్ చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది.
చంద్రబాబు తప్పించుకోలేరు..
ఎన్నో కేసుల్లో విచారణ జరక్కుండా స్టేలు తెచ్చుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసులో తప్పించుకోలేరని పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి చెప్పారు. కేసు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసులో తాము గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మన వాళ్లు బ్రీఫ్డ్మీ అన్న వాయిస్ చంద్రబాబుదే అని ఫోరెన్సిక్ వ్యాబ్ నిర్ధారించింది. అయితే తెలంగాణ ఏసీబీ ఈ కేసును పక్కన పెట్టేసింది. ప్రభుత్వం దాని పని మరిచినప్పుడు, నిందితులను కాపాడాలని ప్రయత్నిస్తున్నప్పుడు.. కేసుతో సంబంధం లేని మూడో వ్యక్తి ఈ విషయంలో జోక్యం చేసుకొని న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సమాజ్ పరివర్తన్ సముదాయన్– కర్ణాటక కేసులో (మైనింగ్ సంబంధిత) సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. నేరం అనేది ఎవరి దృష్టి కొచ్చినా.. సీఆర్పీసీ సెక్షన్ 39, 190 ప్రకారం సదరు వ్యక్తి కోర్టును ఆశ్రయించే హక్కు ఉందని ఏఅర్ ఆథూలే– ఆర్ఎస్ నాయక్, బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి– మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది’’ అని సుధాకర్‌రెడ్డి చెప్పారు.
సుప్రీంకోర్టు అండగా నిలిచింది: ఆర్కే
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్ర సొత్తు దోచుకుని, అక్రమంగా సంపాదించిన లంచాల సొమ్ముతో అవసరం లేకపోయినా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలనుకొంటూ ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుపై తాను మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నానని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) చెప్పారు. తనకు లోకస్ స్టాండీ (కేసు వేసేందుకు అర్హత లేదని) లేదని హైకోర్టు తీర్పు చెబితే సుప్రీంకోర్టు అండగా నిలిచి చంద్రబాబుకు నోటీసులు జారీ చేసిందన్నారు. ఆయన సోమవారం వెలగపూడిలోని అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుకు భయపడే ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదులుకున్నారని విమర్శించారు. గోదావరి, కృష్ణా నదులపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా కడుతున్న ఆనకట్టలపైనా నోరెత్తడం లేదని దుయ్యబట్టారు. అంతేకాకుండా పార్లమెంట్ హామీ, ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. క్రిమినల్ చట్టంలో లోకస్‌స్టాండీ అనే పదం ఎక్కడా లేదని చెప్పారు.