సీబీఐ చరిత్రలోనే తొలిసారి..? | CBI may get first woman chief | Sakshi
Sakshi News home page

సీబీఐ చరిత్రలోనే తొలిసారి..?

Published Mon, Jan 16 2017 5:45 PM | Last Updated on Fri, Oct 5 2018 8:54 PM

సీబీఐ చరిత్రలోనే తొలిసారి..? - Sakshi

సీబీఐ చరిత్రలోనే తొలిసారి..?

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ) చరిత్రలో నూతన అధ్యాయం చోటుచేసుకోనుందా? ప్రతిష్టాత్మక సంస్థకు చీఫ్‌గా తొలిసారి మహిళా అధికారిని నియమించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు సోమవారం  ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న త్రిసభ్య భేటీలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి అర్చనా రామసుందరంను సీబీఐ చీఫ్‌గా నియమిస్తారని ఢిల్లీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఏ.కె. సిన్హా రిటైర్మెంట్‌తో డిసెంబర్‌ 2న ఖాళీఅయిన సీబీఐ డైరెక్టర్‌ పదవిని కేంద్రం ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. డిసెంబర్‌2నే గుజరాత్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ఆర్‌.కె.ఆస్తానాను ఇన్‌చార్జి డైరెక్టర్‌గా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆ నియామకంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగడమేకాక, పార్లమెంట్‌లోనూ చర్చనీయాంశమైంది. ఆస్తానా నియామకాన్ని సవాలుచేస్తూ ప్రముఖ న్యయవాది ప్రశాంత్‌భూషన్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో అస్తానాను ఇన్‌చార్జిగానో లేక పూర్తిస్థాయి డైరెక్టర్‌గానో కొనసాగించలేని పరిస్థితి నెలకొంది.

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ జె.ఎస్‌. ఖేహర్‌, లోక్‌సభలో రెండో అతిపెద్ద పార్టీ(కాంగ్రెస్‌) నేత మల్లిఖార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ మరికొద్ది గంటల్లోనే తన నిర్ణయాన్ని వెల్లడించనుంది. తమిళనాడు కేడర్‌ ఐపీఎస్‌ అధికారిణి అర్చనా రామసుందరం ప్రస్తుతం సశస్త్రసీమాబల్‌(ఎస్‌ఎస్‌బీ) కు చీఫ్‌గా కొనసాగుతున్నారు. సీబీఐ డైరెక్టర్‌ పదవికి కేంద్రం దాదాపు 45 మంది సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల పేర్లను పరిశీలించినట్లు సమాచారం. వీరిలో అర్చనా రామసుందరం, కృష్ణచౌదరీ,ఎస్సీ మాథూర్‌లతో పాటు తెలంగాణలో పనిచేస్తోన్న అరుణ బహుగుణలు బలమైన పోటీదారులుగా భావిస్తున్నారు. వీరందరిలోకీ అర్చనకే ఎక్కువ అవకాశాలున్నాయని, ఆమే తుదుపరి సీబీఐ డెరెక్టర్‌ అవుతారని సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement