
మహిళా బోగీల్లో కెమెరాలు
న్యూఢిల్లీ: మహిళా బోగీల్లో సీసీ టీవీ కెమెరాలు, అత్యవసర అలారమ్ బెల్స్ ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ కమిటీ రైల్వే శాఖకు సిఫార్సు చేసింది. మహిళా రక్షణకు తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఈ సిఫార్సులు చేసింది. సీసీటీవీ కెమెరాల వల్ల ప్రయాణికుల ఏకాంతానికి భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని, అలారమ్ బెల్స్‌ను లోకో పైలట్, గార్డ్ క్యాబిన్‌కు అనుసంధానం చేయాలని సూచించింది. రైల్వేపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం పలు కీలక సిఫార్సులు చేసింది. 31 మంది సభ్యులున్న ఈ కమిటీకి డీఎంకే ఎంపీ టీఆర్ బాలు నేతృత్వం వహించారు. కమిటీ సూచనల్లో మరికొన్ని ముఖ్యాంశాలు...
- మహిళల బోగీలకు ప్రత్యేకమైన రంగును కేటాయించాలి. దీనివల్ల మహిళా బోగీలను గుర్తించడానికి వీలు కలుగుతుంది. చదువురాని ప్రయాణికులకు ఇది సులువుగా అర్థమవుతుంది.
- మహిళా బోగీల్లోకి అనధికార వ్యాపారులను, యాచకులను అనుమతించరాదు.
- అన్ని రైళ్లలోని మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేయాలి. జోన్ల వారీగా హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్నందున ప్రయాణికులు గందరగోళానికి గురవుతున్నందున ఒకే నంబర్ ఏర్పాటు చేయాలి.
- రైల్వే స్టేషన్లలో తగినంత మంది భద్రతా సిబ్బందిని ఉంచడం ద్వారా మహిళల్లో విశ్వాసం పెంపొందించవచ్చు. రాత్రి వేళల్లోనూ భద్రతా సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలి.
- ఆర్‌పీఎఫ్‌లో మహిళా క్యాడెట్ల సంఖ్యను పెంచాలి.
- రైళ్లలో ప్రయాణించే వారికి కనీస వసతులు కల్పించడంపై దృష్టిసారించాలి. తాగునీరు అందుబాటులో ఉండేలా చూడాలి. స్టేషన్ పరిసరాలు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా, తగినంత వెలుతురు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రతి స్టేషన్‌లో ఎలక్ట్రానిక్ ఇండికేటర్ బోర్డులు ఏర్పాటు చేయాలి.