''బినామీ ఆస్తుల గుట్టుమట్లు విప్పుతాం. వీటిపై చర్యలుంటాయి. నల్లధనాన్ని, అవినీతిని రూపుమాపే దిశగా ఇదో గొప్ప ముందడుగు అవుతుంది. ఇతరులు, బినామీల పేరిట కొన్న ఆస్తులపై చట్టపరమైన చర్యలు చేపట్టనున్నాం. అది దేశ ప్రజల ఆస్తి''
-పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆదివారం గోవాలో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన మాటలివి.
ఇదేదో యాథాలాపంగా చేసిన ప్రకటన కాదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ఈనెల 8న రాత్రి ఆకస్మికంగా ప్రకటించడానికి చాలా ముందునుంచే నల్లధన కట్టడికి కేంద్రప్రభుత్వం పలురకాలుగా సన్నద్ధమవుతోంది. స్థిరాస్తి రంగం పెట్టుబడుల్లో నల్లధనం ఎక్కువే. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా తెచ్చిన చట్టమే 'బినామీ లావాదేవీల (నిషిద్ధ) సవరణ చట్టం-2016'. ఇది జులై 27న లోక్‌సభ, ఆగస్టు 2న రాజ్యసభ ఆమోదం పొంది తర్వాత చట్టరూపం దాల్చింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఈ చట్టం అమలులోకి వస్తుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నోటిఫై చేసింది. బినామీల పేరిట వ్యవహారాలు చక్కబెట్టేవారికి కఠినమైన శిక్షలు, జరిమానాలు పొందుపర్చారు. సవరించిన ఈ చట్టం ఆధారంగానే మోదీ సర్కారు బినామీ లావాదేవీలపై తదుపరి చర్యలకు దిగనున్న నేపథ్యంలో.. చట్టంలో ఏముంది? బినామీ లావాదేవీలను ఎలా గుర్తిస్తారు? ఎలా శిక్షలు, జరిమానాలుంటాయి? మినహాయింపులేమిటి? అనే వాటిని చూద్దాం.
'బినామీ' అంటే..
పన్ను కట్టని అక్రమ సంపాదన, అవినీతి డబ్బుతో ఇతరుల పేరిట ఆస్తులను కొనడం.
ఉదాహరణకు తన దగ్గర పనిచేసే ఉద్యోగి, డ్రైవర్ లేదా మిత్రుల పేరిట ఆస్తులు కొనుగోలు చేయడం. ఇక్కడ ఆస్తి పత్రాల్లో యజమానిగా ఒకరి పేరు ఉంటుంది కానీ వాస్తవంగా సదరు ఆస్తిని కొనడానికి ఇంకెవరో డబ్బు చెల్తిస్తారు. పేరుకే పత్రాల్లో యజమాని కానీ సదరు ఆస్తిపై హక్కులను జీపీఏ రూపంలో మరొకరు (వాస్తవంగా డబ్బు చెల్లించిన వ్యక్తి లేదా అసలు యజమాని) అనుభవిస్తుంటారు. జీపీఏ చేయించుకొని తమకు ఇష్టం ఉన్నపుడు అమ్ముకుంటారు. పత్రాల్లో పేరున్నతను మరెవరికో బినామీగా వ్యవహరిస్తాడన్న మాట.
1. ఆస్తి ఎవరి పేరిట ఉందో ఆ వ్యక్తి దానికి సంబంధించి తనకేమీ తెలియదని, అది తనది కాదని, తాను కొనలేదని ఖండిస్తే... సదరు ఆస్తిని బినామీ ఆస్తిగా పరిగణిస్తారు.
2. ఆస్తి అమ్మిన వ్యక్తి ఆచూకీ లభించనపుడు సైతం దానిని బినామీ ఆస్తిగా ప్రకటిస్తారు.
మినహాయింపులు...
1. జీవిత భాగస్వామి లేదా పిల్లల (కూతురు, కుమారుడు) పేరిట చట్టబద్ధంగా ప్రకటించిన ఆదాయంతో ఆస్తులు కొంటే బినామీ కిందకు రాదు.
2. చట్టబద్ధంగా ప్రకటించిన ఆదాయంతో అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, బంధువులతో కలిపి ఉమ్మడి ఆస్తి కొంటే కూడా బినామీ కాదు.
3. ఏదైనా ట్రస్టు తరఫున ట్రస్టీ హోదాలో ఆస్తులు కొంటే, కలిగివుంటే...
ఏవేవి బినామీ లావాదేవీల పరిధిలోకి వస్తాయి..
స్థిర, చరాస్తులు, ఏవేవీ హక్కులు (మేధో హక్కులు, కాపీరైట్ హక్కుల లాంటివి), బంగారు బాండ్లు, ఫైనాన్షియల్ సెక్యూరిటీలు... తదితరమైనవి ఇతరుల పేరిట కొంటే బినామీ లావాదేవీ కిందకు వస్తాయి.
ఎలా నిర్ధారిస్తారు..
ఆదాయపు పన్ను శాఖ అసిస్టెంట్ లేదా డిప్యూటీ కమిషనర్... ఇనీషియేటింట్ ఆఫీసర్ (చర్యకు ఉపక్రమించే అధికారి)గా ఉంటారు. ఏదేని ఆస్తి బినామీ పేరిట ఉందని తమకు అందిన సమాచారంతో లేదా ఏదైనా లావాదేవీపై అనుమానం వచ్చినపుడు పూర్వాపరాలను పరిశీలించుకొని... సదరు బినామీకి నోటీసు జారీచేస్తారు. నోటీసులో పేర్కొన్న ఆస్తి లేదా ఆస్తులు కొనడానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో వివరించాలని, ఆధారాలు చూపాలని కోరుతారు. పై అధికారి అనుమతితో సదరు ఆస్తిని స్తంభింపజేస్తారు (ఈ ఆస్తిపై తదుపరి లావాదేవీలకు వీలుండదు). విచారణలో అడ్జుకేటింగ్ అథారిటీ సదరు ఆస్తిని 'బినామీ'గా ప్రకటిస్తే అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించవచ్చు. ట్రిబ్యునల్ ఏడాదిలోపు విచారణ పూర్తిచేసి తీర్పునివ్వాలి. ట్రిబ్యునల్ తీర్పును కూడా సవాల్ చేయదలిస్తే హైకోర్టు గడప తొక్కవచ్చు.
శిక్షలు...
1. బినామీ పేరిట (మరొకరి పేరిట) ఆస్తులు కొన్నట్లు రుజువైతే ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది.
2. సదరు బినామీ ఆస్తి మార్కెట్ విలువలో 25 శాతం జరిమానాగా చెల్లించాలి.
3. ఇలాంటి బినామీ లావాదేవీ గురించి తెలిసీ ఇతరులకు తప్పుడు సమాచారమిచ్చిన వారికి ఆరు నెలల నుంచి ఐదేళ్ల వరకు కారాగార శిక్ష, ఆస్తి విలువలో పదిశాతం జరిమానా విధించే అవకాశాలున్నాయి.
4. బినామీ ఆస్తిని ఎలాంటి పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.
5. బినామీల పేరిట ఆస్తులు కొంటే... డబ్బు చెల్లించింది తానేనని, తన ఆస్తిని తనకు ఇప్పించండని కోరే హక్కు అసలు యజమానికి ఉండదు. అలా కోరడం నిషిద్ధం.
పర్యవసానాలు:
-
అక్రమ సంపాదన, అవినీతి సొమ్ముతో బినామీ ఆస్తులు కూడబెట్టిన వారికి ఇది మరో షాక్.
-
ఏదో రకంగా వీటిని అమ్ముకొని బయటపడదామని చూసినా... అది ఇప్పట్లో కుదరదు. కొనే వ్యక్తి కొత్తనోట్లతో భారీగా నగదును ముట్టచెప్పలేడు. చెక్కు ద్వారా చెల్లింపు జరపాలంటే... కొనే వ్యక్తి సంపాదన సక్రమమై ఉండాలి. దానికి ఆదాయపు పన్ను చెల్లించి ఉండాలి.
-
చట్టం పదునెక్కినందువల్ల బినామీ ఆస్తిని తనదిగా చెప్పుకోలేడు. పత్రాల్లో పేరున్న యజమాని అడ్డం తిరిగి వాస్తవం చెబితే జైలే గతి.
-
ఏడేళ్ల దాకా జైలు శిక్షపడే అవకాశమున్నందున తేలు కుట్టిన దొంగల్లా సదరు ఆస్తి గురించి (అది తమ బినామీ ఆస్తి అయినా సరే) తమకేమీ తెలియనట్లు ఉండిపోక తప్పదు.
-
శిక్షలకు భయపడి ఇలాంటి బినామీ ఆస్తులు వదులుకోవాల్సి రావొచ్చు.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్