ఆ నోట్లు ఎక్కడ?
- కొత్త రూ.500 నోట్ల పంపిణీపై ఐటీ శాఖ ఆరా
- పలు బ్యాంకుల లావాదేవీలను పరిశీలిస్తున్న అధికారులు
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని పలు బ్యాంకులకు కేటాయించిన కొత్త రూ.500 నోట్ల పంపిణీపై ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. పలు బ్యాంకుల లావాదేవీలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసినప్పటి నుంచి సామాన్య ప్రజలు కష్టాలు పడుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబరు 8వ తేదీ రాత్రి రూ.1000, రూ.500 నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అదే నెల 11 వతేదీ నుంచి గత నెల 30వ తేదీ వరకు బ్యాంకులలో పాత నోట్ల మార్పిడి జరిగింది. ఈ మార్పిడి నగదులోనే బ్యాంకు అధికారుల చేతివాటం ప్రదర్శించారని ఐటీ శాఖ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కొత్త రూ.500 నోట్ల పంపిణీపైనే అనుమానాలు
నోట్ల రద్దు చేసినప్పటి నుంచి జిల్లాకు కొత్త రూ.2000, రూ.500 నోట్లు ఎన్ని వచ్చాయి? ఏయే బ్యాంకులకు ఎంత నగదు ఇచ్చారు? కొత్త నోట్లలో రూ.500 నోట్లు ఎన్ని? రూ.2000 నోట్లు ఎన్ని? అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కొత్త రూ.500 నోట్లు నాలుగు రోజుల కిత్రం కూడా రూ.70 కోట్లు, అంతకు ముందు రూ.50 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రజలకు చేరింది మాత్రం ఈ కొత్త రూ.500 నోట్లు చాలా తక్కువగా అంటే దాదాపుగా రూ.2 కోట్లు కూడా చేరి ఉండవని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఎక్కడ చూసినా కొత్త రూ.2000 వేల నోటు తప్ప రూ.500 నోటు కనిపించిన దాఖలాలు తక్కువ. ఈ మొత్తం నోట్లు ఎవరి ఖాతాలోకి వెళ్లాయి? ఆ నల్లకుబేరులు ఎవరు? అంతే కాకుండా ఏ బ్యాంకుల నుంచి అధికంగా వెళ్లాయో పూర్తి సమాచారం రాబట్టే పనిలో ఐటీ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.
లావాదేవీలు ఇవ్వండి
జిల్లాలోని అన్ని బ్యాంకులలో గత ఏడాది నవంబరు 11 నుంచి డిసెంబరు 30వ తేదీ వరకు జరిగిన లావాదేవీల వివరాలు తమకు ఇవ్వాలని బ్యాంకు అధికారులను ఐటీ శాఖ అధికారులు అడిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా అనుమానం ఉన్న బ్యాంకులలోని ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్‌బీఐ ఆదేశాలతోనే?
బ్యాంకుల లావాదేవీల్లో వాస్తవ పరిస్థితిని తెలుసుకుని పూర్తి సమాచారంతో వివరాలు ఇవ్వాలని ఐటీ శాఖ అధికారులకు ఆర్‌బీఐ ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. రెండు మూడురోజులలో ఈ విచారణ పూర్తి చేసి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.