నిధులు లాగేసుకోవడం చట్టవిరుద్ధం
♦ ఐటీశాఖ తీసుకున్న రూ.1,274 కోట్లు వెనక్కివ్వండి: కేటీఆర్
♦ ఏపీ బేవరేజెస్ పన్ను కట్టలేదని రాష్ట్ర ఖాతా నుంచి రూ.1,274 కోట్లు తీసుకున్నారు
♦ కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు
♦ ఆర్‌బీఐ ఆ నిధులను వెనక్కి ఇచ్చేలా ఆదేశించండి
♦ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీకి వినతి పత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఏపీ బేవరేజెస్ సంస్థ ఆదాయపు పన్ను కట్టలేదంటూ రిజర్వ్‌బ్యాంకు తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి రూ.1,274 కోట్లను చట్టవిరుద్ధంగా ఐటీ శాఖకు తరలించిందని మంత్రి కె.తారకరామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారంగానీ, నోటీసుగానీ ఇవ్వలేదని పేర్కొన్నారు. చట్టవిరుద్ధంగా తీసుకున్న ఈ నిధులను వాపసు ఇచ్చేలా ఆర్‌బీఐని ఆదేశించాలని కోరుతూ జైట్లీకి ఒక వినతిపత్రం అందజేశారు. శనివారం ఢిల్లీలో సీఎస్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి నర్సింగరావుతో కలిసి కేంద్ర మంత్రి జైట్లీతో కేటీఆర్ భేటీ అయ్యారు.
ఏపీ బేవరేజెస్ సంస్థ ఆస్తులు, అప్పుల విభజన ఇంకా జరగలేదని.. అయినా ఆ సంస్థ 2012-13కు ఐటీ కట్టలేదంటూ రూ.1,274 కోట్లను తెలంగాణ ప్రభుత్వ ఖాతా నుంచి తీసుకున్నారని జైట్లీకి కేటీఆర్ వివరించారు. చట్టానికి, కోర్టు తీర్పునకు విరుద్ధంగా, ముందస్తు నోటీసు కూడా ఇవ్వకుండా నిధులు తీసుకున్నారని చెప్పారు. ఆదాయ పన్ను రికవరీ చేయాల్సి వస్తే ఉమ్మడి రాష్ట్ర అప్పును 58:42 వాటాలో పంచిన విధంగా.. ఏపీ, తెలంగాణ నుంచి వసూలు చేయాలన్నారు.
అలా కాకుండా తెలంగాణ నుంచే రూ.1,274 కోట్లు ఆకస్మికంగా తరలించడం సరికాదని జైట్లీకి వివరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. కాగా రెవెన్యూ కార్యదర్శితో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని జైట్లీ హామీ ఇచ్చారని ఈ భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులకు తెలిపారు. తెలంగాణ కొత్త పారిశ్రామిక విధానంపై జైట్లీ ఆసక్తి కనబర్చారని చెప్పారు. ఆ విధి విధానాలను అందచేయాలని, బాగుంటే కేంద్ర విధానాల్లో పెడతామన్నారని తెలిపారు.
గలీజు పనిని ఏపీ ప్రజలపై రుద్దుతున్న బాబు: కేటీఆర్
‘ఓటుకు కోట్లు’తో చేసిన గలీజు పనిని సీఎం చంద్రబాబు ఏపీ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. సొంత సమస్యను రెండు రాష్ట్రాల సమస్యగా చూపే ప్రయత్నం బాబుకు మంచిది కాదన్నారు. శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రి జైట్లీతో భేటీ అనంతరం కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. ఏపీలో 5 కోట్ల ప్రజలకు ప్రతినిధినని చెప్పుకొంటున్న చంద్రబాబు.. ఆ రాష్ట్ర ప్రజలకోసం పనిచేయకుండా, రూ.5కోట్ల కుంభకోణం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్వప్రయోజనాలు పక్కన పెట్టి ఏపీ ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుందని బాబుకు హితవు పలికారు. సెక్షన్-8 అమలుకు జరుగుతున్న ఒత్తిళ్లను విలేకరులు ప్రస్తావించగా.. ‘‘రాజ్యాంగ సవరణ చేయకుండా ఎలాంటి పరిస్థితుల్లోనూ రాష్ట్రాల అంశమైన శాంతిభద్రతలను గవర్నర్‌కు దఖలు పర్చడం కుదరదని రాజ్యసభలో విపక్ష నేతగా ఉన్నప్పుడు జైట్లీయే కుండబద్దలు కొట్టారు. ఇప్పుడు సెక్షన్-8ను అమలుచేసి కేంద్రం న్యాయపరంగా చిక్కులు కొనితెచ్చుకుంటుందని నేను అనుకోవడం లేదు..’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.