ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో కీలక నిర్ణయాలు | Decisions taken at the RBI board meeting | Sakshi
Sakshi News home page

కేంద్రం, ఆర్‌బీఐ మధ్య సయోధ్య!

Published Tue, Nov 20 2018 12:41 AM | Last Updated on Sat, Apr 6 2019 9:38 PM

Decisions taken at the RBI board meeting - Sakshi

ముంబై: కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య దాదాపు కీలక అంశాలన్నిటి మధ్యా సయోధ్య కుదిరింది. సున్నితమైన పలు అంశాలకు సంబంధించి  ప్రభుత్వం, ఆర్‌బీఐ మధ్య భిన్నాభిప్రాయాలు నెలకొనడంతో... సోమవారం ఆర్‌బీఐ బోర్డు సమావేశం తొమ్మిది గంటలకు పైగా వీటన్నింటిపై చర్చించింది. ‘‘సుహృద్భావ పూర్వక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. చాలా అంశాలు స్నేహపూర్వక రీతిలో పరిష్కారం అయ్యాయి’’ అని బోర్డు సభ్యుడొకరు తెలిపారు. తదుపరి ఆర్‌బీఐ బోర్డు సమావేశం డిసెంబర్‌ 14న జరుగుతుందని బోర్డు సభ్యుడు సచిన్‌ చతుర్వేది తెలియజేశారు. వివిధ అంశాలకు సంబంధించి ఏం నిర్ణయం తీసుకున్నారంటే...

1. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ రంగానికి) ఇచ్చిన రుణాల్లో, మొండి బకాయిలుగా మారిన వాటిని పునరుద్ధరించాలని కేంద్రం కోరుతోంది.  
ఇందుకోసం ఓ పథకాన్ని పరిశీలించే బాధ్యతను నిపుణుల కమిటీకి ఆర్‌బీఐ బోర్డు అప్పగించింది.  
2. ఆర్‌బీఐ వద్ద భారీగా ఉన్న రూ.9.69 లక్షల కోట్ల నగదు నిల్వల నుంచి కొంత భాగాన్ని బదలాయించాలని కేంద్ర ప్రభుత్వం కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది.  
దీనిపై అసలు ఆర్‌బీఐ వద్ద వాస్తవంగా ఎంత మేర మిగులు నిల్వలు ఉండాలి? మిగులు నిల్వలను కేంద్ర ప్రభుత్వానికి బదలాయించడానికి సంబంధించిన ‘ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌’ ఎలా ఉండాలి? అనేది నిర్ణయించేందుకు ఓ ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఆర్‌బీఐ బోర్డు నిర్ణయించింది.  
3. ప్రభుత్వరంగంలోని 21 బ్యాంకులకు గాను 11 బ్యాంకులను ఆర్‌బీఐ నిక్కచ్చయిన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) పరిధిలోకి తీసుకొచ్చి, వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. దీంతో ఇవి కొత్త రుణాలివ్వడానికి అవకాశం లేక సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వీటి విషయంలో నిబంధనలను సరళించాలని కేంద్రం డిమాండ్‌ చేస్తోంది.  
ఈ నేపథ్యంలో ఆర్‌బీఐకి చెందిన ఆర్థిక పర్యవేక్షక బోర్డు పీసీఏ పరిధిలోకి వచ్చిన బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించాలన్న నిర్ణయానికి ఆర్‌బీఐ బోర్డు వచ్చింది.   

ఇదీ... ఆర్‌బీఐ ప్రకటన
‘‘ఎకనమిక్‌ క్యాపిటల్‌ ఫ్రేమ్‌వర్క్‌ను పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఇందులో సభ్యులు, నిబంధనలను ప్రభుత్వం, ఆర్‌బీఐ ఉమ్మడిగా నిర్ణయిస్తాయి. ఇక రూ.25 కోట్ల వరకు ఎంఎస్‌ఎంఈల మొండి బకాయిలను పునరుద్ధరించే పథకాన్ని పరిశీలించాలని కూడా నిర్ణయించడం జరిగింది’’ అని ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలియజేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం ఈ తరహా చర్యలు అవసరమని పేర్కొంది.

ప్రభుత్వ నామినీ డైరెక్టర్లు అయిన ఆర్థిక వ్యహారాల కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌తోపాటు స్వతంత్ర డైరెక్టర్‌ ఎస్‌ గురుమూర్తి ఆర్‌బీఐ క్యాపిటల్‌ బేస్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తక్కువ ఉండాలని వాదించారు. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్, ఆర్‌బీఐ నుంచి ఇతర సభ్యులతో ప్రభుత్వ నామినీలు, గురుమూర్తి ముఖాముఖిగా అంశాలపై చర్చించారు. ఆర్‌బీఐ బోర్డులో 10 మంది ఇండిపెండెంట్‌ డైరెక్టర్లలో టాటాసన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ సహా ఎక్కువ మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు.  

ఘర్షణ లేదు...
ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య ఎటువంటి ఘర్షణ లేదని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ రాహుల్‌గాంధీ, మీడియానే దీన్ని చిత్రీకరిస్తున్నాయన్నారు. ఎంతో ముఖ్య సంస్థ అయిన సెంట్రల్‌ బ్యాంక్‌కు దేశం పట్ల ఉన్న బాధ్యతలపై ఆర్‌బీఐ బోర్డు సభ్యుల మధ్య చర్చ జరగడం అభ్యంతరకరమేమీ కాదన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ నుంచి ప్రభుత్వం రూపాయి కూడా ఆశించడం లేదని ఇప్పటికే స్పష్టం చేసినట్టు ఆయన గుర్తు చేశారు.

ఆర్‌బీఐ స్వతంత్రతను కేంద్రం గుర్తించింది: చిదంబరం
ఆర్‌బీఐ స్వతంత్రతను కేంద్రం అసమ్మతంగా అయినా ఒప్పుకుందంటూ, దీని పట్ల కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఓ అడుగు వెనక్కు తగ్గడాన్ని ఆహ్వానించారు. ‘‘కేంద్రం ప్రమాదకరమైన ధోరణితో ఉందన్న విషయాన్ని స్వతంత్ర డైరెక్టర్లు అర్థం చేసుకుని ఉంటారు. అందుకే ఆర్‌బీఐకి సూచన ఇవ్వడానికి మించి ముందుకు వెళ్లలేదు’’అని చిదంబరం పేర్కొన్నారు. సాంకేతిక కమిటీ మిగులు నిల్వలను పరిశీలించడం వల్ల వచ్చిన నష్టమేమీ లేదన్నారు. దీనివల్ల ఆర్‌బీఐ మిగులు నిల్వలు కనీసం 2019 వరకు అయినా సురక్షితంగా ఉంటాయంటూ, పరోక్షంగా మరో ఆరు నెలల్లో సాధారణ ఎన్నికలను గుర్తు చేశారు.  


ఆర్‌బీఐ నుంచి వ్యవస్థలోకి మరో రూ.8,000 కోట్లు
22న ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలు
ముంబై: వ్యవస్థలో నగదు లభ్యతను పెంచే చర్యలో భాగంగా ఈ నెల 22న ఆర్‌బీఐ ప్రభుత్వ సెక్యూరిటీలను కొనుగోలు చేయనుంది. తద్వారా రూ.8,000 కోట్లను అందుబాటులోకి తీసుకురానుంది. నగదు లభ్యత పరిస్థితులను సమీక్షించిన అనంతరం ఓపెన్‌ మార్కెట్‌ ఆపరేషన్స్‌ (ఓఎంవో) ద్వారా ఈ నెల 22న రూ.8,000 కోట్ల మేర ప్రభుత్వ సెక్యూరిటీల కొనుగోలుకు నిర్ణయించినట్టు ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది.

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తర్వాత లిక్విడిటీ సమస్య నెలకొన్న విషయం తెలిసిందే. దీన్ని సులభతరం చేసేందుకు ఆర్బీఐ ఓఎంవో మార్గాన్ని ఆశ్రయించింది. ఒకవేళ వ్యవస్థలో నగదు లభ్యత అధికమైన సమయాల్లో ఆర్‌బీఐ తిరిగి ఇవే సెక్యూరిటీలను విక్రయించడం ద్వారా తగ్గిస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement