దేవుడి హుండీలపై ఐటీ శాఖ నజర్
- రద్దయిన నోట్లను ఆర్బీఐ కౌంటర్లలో డిపాజిట్ చేయొద్దని ఆదేశం
- వివరాలు రిజిస్టర్‌లో పొందుపరచాలి..
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాల్లో భాగంగా ఆదాయపన్ను (ఐటీ) శాఖ దేవాలయాల్లోని హుండీలపై దృష్టి సారించింది. రద్దయిన నోట్లను అజ్ఞాత భక్తులు పెద్దమొత్తంలో దేవుడి హుండీల్లో వేస్తున్నారన్న సమాచారంతో ఆదాయపన్ను శాఖ కదిలింది. రద్దయిన పెద్ద నోట్లు హుండీ లెక్కింపులో బయటపడితే వాటిని రిజర్వు బ్యాంకు కౌంటర్లలో జమ చేయటానికి వీలు లేదంటూ తాజాగా దేవాదాయశాఖకు తాఖీదు జారీ చేసింది. అక్కడి నుంచి అది అన్ని దేవాలయాలకు చేరింది. ఆదాయం ఎక్కువగా ఉండే దేవాలయాల్లో నెలకోసారి హుండీల లెక్కింపు జరుగుతుంది.
మిగతా చోట్ల రెండుమూడు నెలలకోసారి జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత నెలలో హుండీ లెక్కింపు సమయంలో రద్దయిన నోట్లు పెద్దమొత్తంలో బయటపడ్డాయి. ఆ నోట్లను బ్యాంకుల్లో మార్చుకునే వెసులుబాటు లేకపోవటం, బ్యాంకు ఖాతాల్లో జమచేసే వీలు లేకపోవటంతో కేవలం రిజర్వు బ్యాంకు కౌంటర్లలో మాత్రమే అందజేసి కొత్త నోట్లు పొందాల్సి ఉంటుంది. ఆ నోట్లకు సంబంధించిన పూర్తి వివరాలను అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పెద్దమొత్తంలో పాత నోట్లున్నవారు వాటిని ఆర్బీఐ కేంద్రాల్లో మార్చుకోవటానికి ముందుకు రావటంలేదు. వాటిని దేవుడి హుండీల్లో వేసేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన ఆదాయపన్ను శాఖ వాటిని మార్చుకునే వెసులుబాటు లేకుండా కట్టడి చేసింది.
హుండీ లెక్కింపు ప్రక్రియను వీడియో తీసి భద్రపరచాలని, లెక్కింపు సమయంలో దేవాలయంతో సంబంధంలేని ఇద్దరు వ్యక్తుల నుంచి సాక్షి సంతకాలు తీసుకోవాలని కూడా నిబంధన విధించింది. పాతనోట్లు కనిపిస్తే వాటి వివరాలను రిజిస్టర్‌లో నమోదుచేయాలని, తాము తనిఖీకి వస్తే ప్రతి వివరం అందజేయాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. అలాగే ప్రతి దేవాలయంలో పాత నోట్లు తీసుకోమని స్పష్టంగా తెలిపే నోటీసులను ప్రదర్శనకు ఉంచాలని కూడా ఆదేశించింది. కానుకల రూపంలో కూడా రద్దయిన నోట్లను తీసుకోకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఐటీ శాఖ హెచ్చరించటం విశేషం. హుండీల్లో బయటపడిన రద్దయిన నోట్ల విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఆ శాఖ పేర్కొంది.