మా పార్టీ పరువు తీయడానికే..
కేంద్రం అధికార దుర్వినియోగం చేస్తోంది: మాయావతి
లక్నో: తమ పార్టీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై బీఎస్‌పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బీఎస్‌పీ ఖాతాలో రూ. 104 కోట్ల డిపాజిట్లను ఈడీ కనుగొన్న తర్వాత ఆమె కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం, పార్టీ నియమాల ప్రకారం డిపాజిట్లు ఉన్నాయని, నోట్ల రద్దుకు ముందరే ఆ డబ్బు సేకరించామని తెలిపారు.
ఆ డబ్బును తామిప్పుడు విసిరివేయాలా అంటూ ప్రశ్నించారు. బీజేపీ దళిత వ్యతిరేకి అని, ఓ వర్గం మీడియాను ఉపయోగించుకుని యూపీ ఎన్నికల ముందు తమ పార్టీ పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆ డబ్బు దేశ వ్యాప్తంగా పార్టీ సభ్యత్వం తీసుకున్న వారి నుంచి సేకరించినదని, మారుమూల ప్రాంతాల నుంచి తరలించాడానికి, బ్యాంకులో జమచేయడానికి సులువుగా ఉంటుందని పెద్దనోట్లుగా మార్చడం జరిగిందని వివరించారు. బ్యాంకులో జమచేసిన ప్రతీ రూపాయికీ లెక్కుందన్నారు.