'అభినందించాల్సింది సైన్యాన్ని.. మంత్రిని కాదు'
లక్నో: భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడుల ద్వారా బీజేపీ పొలిటికల్ మైలేజీ పొందాలనుకుంటోందని బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి అన్నారు. గౌరవం, సన్మానం దక్కాలంటే అది ఒక్క భారత జవాన్లకు మాత్రమే దక్కాలని రక్షణమంత్రికో ప్రధానికో కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సర్జికల్ దాడులు ఉపయోగించుకొని బీజేపీ రాజకీయంగా మరింత ఎదగాలని భావిస్తోందని చెప్పారు.
సర్జికల్ దాడులపై ఇష్టమొచ్చినట్లుగా ప్రకటనలు చేయొద్దని తమ పార్టీ నేతలకు, మంత్రులకు చెప్పినప్పటికీ చెవిటి వాళ్లలాగే అలాగే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. హోర్డింగులు పెట్టొద్దని, పోస్టర్లు వేయొద్దని, ఎలాంటి ప్రకటనలు చేయొద్దని బీజేపీ తమ వాళ్లకు చెప్పినా రాజకీయంగా లబ్ధిపొందేందుకు అదే దోరణితో వ్యహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణంగా మోదీ రెచ్చగొట్టే అంశాలను భాగా ప్రోత్సహిస్తారని, వాటి ద్వారా మేలు పొందాలని ఆయన ముందునుంచే ఆలోచించేవారని, తాజాగా పాక్-భారత్ మధ్య ఘర్షణను కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారని మరోసారి స్పష్టమైందంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.