ఆప్ కళ్లకు ఉల్లిమంట
న్యూఢిల్లీ: ఉల్లిగడ్డలు ఇప్పుడు వంటింట్లో మంటలు పుట్టించడమే కాదు.. రాజకీయ నేతల కుంపట్లో కూడో మంటలు రాజేస్తున్నాయి. చోటామోటా అని తేడా లేకుండా ఈ అంశాన్ని కూడా తమ ప్రధాన ఎజెండాగా తీసుకుంటూ అధికారంలో ఉన్న పార్టీని అధికారంలో లేని పార్టీలు విమర్శిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఉల్లిధరల సెగ తగిలింది. ఉల్లిగడ్డలు స్టాక్ ఉండి కూడా కృత్రిమ కొరత సృష్టించి ధరలు విపరీతంగా పెంచుతున్న వారిపై ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైందని కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ విమర్శించారు.
ఢిల్లీలో కేజీ ఉల్లిధర రూ.80కి పెరిగినా ఆప్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, అంటీఅంటనట్లు వ్యవహరిస్తోందని ఆరోపణలు చేశారు. వస్తు సేవల బిల్లు(జీఎస్టీ)ని ఆమోదించడం ద్వారా ఉల్లిగడ్డల ధరలకు కళ్లెం వేయొచ్చని అభిప్రాయపడ్డారు. వెంటనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తేరుకొని కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారవేత్తలందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాస్తవానికి దేశంలో ఉల్లి కొరత లేదని కావాలనే వ్యాపార వేత్తలు ఇలా చేస్తున్నారని స్పష్టం చేశారు.