
టీడీపీని ఇబ్బందిపెట్టేందుకే.. : చంద్రబాబు
సాక్షి, గుంటూరు/విజయవాడ: తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకే కేంద్ర హోంశాఖ బుధవారం ఓ లేఖ పంపిందని, 11 అంశాలపై సమాచారం ఇవ్వాలని కోరిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చెప్పారు. ఆయన గురువారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు, బాపట్ల నియోజకవర్గాల్లో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగాను, అంతకుముందు విజయవాడలో విలేకరులతోను ఆయన మాట్లాడారు. అఖిలపక్ష పార్టీల నుంచి విభజనపై సమాచారం తెలుసుకునేందుకే కేంద్రప్రభుత్వం డ్రామాలాడుతోందని విమర్శించారు. గతంలో వేసిన ప్రణబ్, రోశయ్య, శ్రీకృష్ణ, ఆంటోనీ కమిటీలు ఏం తేల్చాయో ముందు తమకు చెప్పాలని డిమాండ్ చేశారు. 2008లో తానిచ్చిన లేఖైపై రాద్దాంతం చేస్తున్నారని, తెలుగువారికి సమన్యాయం చేయాలని, రెండుప్రాంతాలవారిని కూర్చోబెట్టి విభజించాలని తాను లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. తాను కేంద్రానికి రాసిన వందల లెటర్లకు స్పందించలేదని, విభజనపై రాసిన లేఖకు మాత్రం నానా యాగీ చేస్తున్నారని పేర్కొన్నారు.
అఖిలపక్ష సమావేశానికి మీరు వెళతారా, ఎవరినైనా పంపుతారా, ఎంతమందిని పంపుతారు, ఇప్పటికీ విభజనను సమర్థిస్తారా.. అంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇది చాలా సున్నితమైన అంశమని, దీనిపై మీకు కూడా బాధ్యత ఉందని, మీరు అర్థం చేసుకోకపోతే ఏ ఉద్దేశంతో అగుతున్నారో సందేహించాల్సి వస్తుందంటూ ఎదురుదాడికి దిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటిలేటర్లపై ఉన్నాయని, వాటిని తీసేస్తే ఫినిష్ అయిపోవచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని రైతులు అత్మహత్య చేసుకోకుండా కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఆరునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితమవుతుందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరదబాధితులకు న్యాయం చేస్తానని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తాము ఏపార్టీతో పొత్తు పెట్టుకునేది ఇప్పుడే చెప్పలేమన్నారు. విభజన బిల్లు అస్లెంబ్లీలో చర్చకు వస్తే సీమాంధ్ర ప్రాంతవాసిగా మీరు దేనికి మద్దతు ఇస్తారని ప్రశ్నించగా విలేకర్లపై అసహనం ప్రదర్శిస్తూ సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. పెదనందిపాడులో పాఠశాల విద్యార్థులు జై సమైక్యాంధ్ర అని నినదించినప్పుడు.. మీరంతా టీవీలు చూసి సమైక్యమని అరుస్తున్నారా అని ప్రశ్నించారు.