కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత నిషేధిత జాబితా(బ్లాక్‌లిస్ట్)లో ఉన్న 44 డీమ్డ్ యూనివర్సిటీల భవితవ్యంపై బుధవారం సుప్రీంకోర్టు స్పందించింది.
న్యూఢిల్లీ: కేంద్రప్రభుత్వ ప్రతిపాదిత నిషేధిత జాబితా(బ్లాక్‌లిస్ట్)లో ఉన్న 44 డీమ్డ్ యూనివర్సిటీల భవితవ్యంపై బుధవారం సుప్రీంకోర్టు స్పందించింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) నుంచి సలహా తీసుకుని.. ఆ అంశంపై పునఃసమీక్ష జరపాలని ధర్మాసనం కేంద్రప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వర్సిటీల్లో ప్రభుత్వ మార్గదర్శకాల అమలులో జరిగిన వైఫల్యానికి సంబంధించిన నివేదికలని పరిశీలించి, రెండు నెలల్లోగా కేంద్రప్రభుత్వానికి సూచనలను ఇవ్వాలని యూజీసీని ధర్మాసనం ఆదేశించింది. వాటి ఆధారంగా కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. యూజీసీ సూచనలకు కచ్చితంగా తలొగ్గాల్సిన అవసరం కేంద్రప్రభుత్వానికి లేదని, అయితే, నిపుణులతో కూడిన చట్టబద్ధ సంస్థ అయిన యూజీసీ ఇచ్చే సూచనలకు తగిన విలువ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ 44 విశ్వవిద్యాలయాలను డీనోటిఫై చేయాలని సిఫారసు చేసిన మానవ వనరుల శాఖ.. ఆయా విద్యార్థుల భవితవ్యానికి నష్టం కలగకుండా చూస్తామని గతంలోనే సుప్రీంకోర్టుకు నివేదించింది.