వీసీల నియామకంపై వైఖరేంటి?
యూజీసీకి సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలోని 3 విశ్వవిద్యాల యాల్లో ఉప కులపతుల నియామకానికి అను మతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ సుప్రీంకోర్టు యూజీసీకి నోటీసులు ఇచ్చింది. ఈ అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని యూజీసీతోపాటు పిటిషనర్ ప్రొఫెసర్ మనోహర్‌రావును కూడా ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వీసీల నియామకాలను ప్రొఫెసర్ మనోహర్‌రావు సవాల్ చేయగా.. అప్పటికే చేపట్టిన నియామకాలను కొనసాగించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చీఫ్ జస్టిస్ టి.ఎస్.ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి విచారణను శుక్రవారం చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున భారత అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ తెలంగాణలోని 3 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి నియామకానికి అనుమతివ్వాలని కోరారు. దీనిపై పిటిషనర్ తరఫు న్యాయవాదులు సుబోధ్ మార్కండేయ, ఆదినారాయణరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం వీసీల నియామక ప్రక్రియ తీరును చెప్పాలని సూచించగా వివరాలను అఫిడవిట్ రూపంలో ఇస్తామని రోహత్గీ పేర్కొన్నారు. కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.