తెలంగాణ హైకోర్టు
చందాదారుల వివరాల కోసం పత్రికల్లో నోటీసులివ్వాలి
దీనికి ఎంత ఖర్చవుతుందో రిజిస్ట్రీ మార్గదర్శికి చెబుతుంది
అప్పటి నుంచి వారంలోగా ఆ డబ్బు డిపాజిట్ చేయాలి
వెంటనే పత్రికల్లో నోటీసులిస్తూ విస్తృతంగా ప్రచారం చేయాలి
‘మార్గదర్శి’ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు విచారణ
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శి ఫైనాన్సియర్స్ యాజమాన్యం చందాదారులందరికీ డిపాజిట్ల తాలూకు నగదు తిరిగి చెల్లించిందా..? లేదా..? ఎవరికైనా ఎగవేసిందా..? అనే వివరాలు తెలుసుకునే చర్యలు చేపట్టాలని రిజిస్ట్రీకి చెబుతూ, దీనికయ్యే ఖర్చంతా ఆ సంస్థే భరించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తెలుగు, హిందీ, ఆంగ్ల పత్రికల్లో విస్తృత ప్రచారం జరిగేలా నోటీసులు జారీ చేయాలని.. దీనికి వ్యయం ఎంతవుతుందో మార్గదర్శికి చెప్పాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. ఖర్చు వివరాలు చెప్పిన వారంలోగా ఆ మొత్తాన్ని రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఫైనాన్సియర్స్‌కు తేల్చి చెప్పింది.
డిపాజిట్ అయిన వెంటనే పత్రికల్లో నోటీసులు జారీ చేయాలని జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం గురువారం ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 1కి వాయిదా వేస్తూ పత్రికల్లో వచ్చిన నోటీసుల కాపీలను ఆ రోజు తమ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
వాస్తవాలను నిగ్గు తేల్చాలి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు మార్గదర్శి, దాని కర్త రామోజీరావుపై డిపాజిటర్ల పరిరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదును కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు 2018 డిసెంబర్ 31 (హైకోర్టు విభజనకు ఒక రోజు ముందు)న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (వైఎస్ జగన్ హయాంలో), మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మార్గదర్శి, రామోజీరావు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2024 ఏప్రిల్ 9న హైకోర్టు తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును తప్పుబడుతూ.. డిపాజిట్ల సేకరణకు సంబంధించిన వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేసింది. ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని చెప్పింది.
ఈ నేపథ్యంలో జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం విచారణ ప్రారంభించింది. చందాదారుల వివరాల కోసం పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించడం కోసం నోటీసులు జారీ చేయాలని గత విచారణ సందర్భంగా రిజిస్ట్రీని ఆదేశించింది. అయితే దీనికయ్యే ఖర్చు ఎవరు భరించాలన్నది సందిగ్ధంగా మారడంతో రిజిస్ట్రీ ముందుకు వెళ్లలేకపోయింది. దీంతో ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టి పైన పేర్కొన్న ఆదేశాలు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment