
నేడు చంద్రబాబు డిశ్చార్జి
ఆరోగ్యం మెరుగుపడిందన్న వైద్యులు
రామోజీరావు పరామర్శ.. గంటకుపైగా ఏకాంతంగా మంతనాలు
సాక్షి, హైదరాబాద్: ఇక్కడి ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదే శం అధ్యక్షుడు చంద్రబాబునాయుడును వైద్యులు బుధవారం డిశ్చార్జి చేయనున్నారు. ఆయనకు బుధవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం లేదా సాయంత్రం డిశ్చార్జి చేస్తామని మంగళవారం రాత్రి చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్ విడుదల చేసిన వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని, కామెర్లు 80 శాతం తగ్గాయని ప్రకటించారు.
అలాగే కాలేయం పనితీరు కూడా మెరుగైందని తెలిపారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యాక చంద్రబాబు రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పార్టీవర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబును రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మంగళవారం పరామర్శించారు. ఆయనతో ఏకాంతంగా గంటసేపు మాట్లాడారు. సినీ నటుడు బాలకృష్ణ కూడా చంద్రబాబును పరామర్శించారు. టీడీపీ అధినేత ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని కోరుతూ పార్టీ హైదరాబాద్ నగర నేతలు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రి వద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. పార్టీ నేతలు పలువురు కూడా చంద్రబాబును పరామర్శించారు. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సోమవారం చంద్రబాబును కలిశారు. సీపీఐ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నారాయణ ఆ పార్టీ నేత చాడ వెంకట్‌రెడ్డి కూడా బాబును పరామర్శించారు.