విజయవాడ : సంక్షోభాలను తట్టుకుని ముందుకెళ్లాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలోని స్థానిక శేషసాయి కల్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులను ఉద్దేశించి చంద్రబాబునాయుడు మాట్లాడారు. రైతులకిచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులకు సూచించారు.
ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల మధ్య సమన్వయం ఇంకా మెరుగుపడాల్సిన అవశ్యకతను చంద్రబాబు నొక్కి చెప్పారు. పార్టీ నిర్మాణం, సంస్థాగత నిర్ణయాలు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలన్నారు. అలాగే పార్టీ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో ఓడిన నాయకులను భుజం తట్టి ప్రోత్సహించాలని నాయకులకు, కార్యకర్తలను కోరారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జడ్పీ ఛైర్మన్లు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లతోపాటు నారా లోకేశ్ హాజరయ్యారు. మహానాడు తర్వాత జరిగిన కీలక రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.