మళ్లీ అదే తీరు... అదే రచ్చ రచ్చ
న్యూఢిల్లీ : మళ్లీ అదే తీరు. అదే రచ్చ రచ్చ. తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాల హోరు. సభలు ప్రారంభమవడమే ఆలస్యం వెంటనే వాయిదా. పార్లమెంట్ ఉభయ సభల్లో రెండో రోజు నెలకొన్న పరిణామాలివే. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లుపై సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల పోటా పోటీ నినాదాలతో ఉభయ సభలు అట్టుడికాయి. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ రెండంటే రెండే నిమిషాల్లో వాయిదా పడింది. సభ ప్రారంభమైన వెంటనే సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ సమైక్య నినాదాలు చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినప్పటికీ ఎంపీలు వెనక్కు తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయ సభలు మళ్లీ ప్రారంభమైన తర్వాతా పరిస్థితుల్లో మార్పు రాలేదు. సీమాంధ్ర, తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. గందరగోళం మధ్యే సీమాంధ్ర ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలపై స్పీకర్ ప్రకటన చేశారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు స్పీకర్ వెల్ లోనికి దూసుకు పోయి నినాదాలు చేశారు. సభ్యులు ఎంతకూ వెనక్కు తగ్గక పోవడంతో స్పీకర్ మీరాకుమార్ సభను శుక్రవారానికి వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సీమాంధ్ర ఎంపీలు ప్లకార్డులతో ఆందోళనకు దిగారు. వెంటనే ఛైర్మన్ సభను గంట పాటు వాయిదా వేశారు. 12 గంటలకు సభ మళ్లీ మొదలైన తర్వాత కూడా సీమాంధ్ర ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినదించారు. ఈ స్థితిలో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.