కన్నీటి కడలి | Chennai floods latest updates: Relief, rescue operation underway, IMD predicts more rains | Sakshi
Sakshi News home page

కన్నీటి కడలి

Published Fri, Dec 4 2015 2:29 AM | Last Updated on Tue, Oct 16 2018 4:56 PM

కన్నీటి కడలి - Sakshi

కన్నీటి కడలి

* చెన్నైలో బాధితుల ఆకలి కేకలు..
* రాష్ట్రంలో 269కి పెరిగిన మృతుల సంఖ్య.. శనివారం వరకు రైళ్లు రద్దు
 
తమిళనాడు త్వరగా కోలుకోవాలి: ప్రణబ్ ముఖర్జీ
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాపం తెలిపారు. తమిళనాడు ప్రజలు ధైర్యంగా ఈ పరిస్థితిని అధిగమిస్తారనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం తమిళనాడు గవర్నర్ ఎన్.రోశయ్యకు ఆయన లేఖ రాశారు. ఈ కష్టసమయం నుంచి తమిళనాడు ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
 
సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నైలో వర్షం కాస్త తె రపినిచ్చింది. గురువారం చిరుజల్లులు మాత్రమే కురిశాయి.  గత మూడురోజులుగా ముఖం చాటేసిన సూర్యుడు కూడా ప్రజలను పలుకరించాడు. కానీ నగరంలోని అనేక ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో విలవిల్లాడుతూనే ఉన్నాయి. జనజీవనం స్తంభించింది.

ముంపు బారినపడిన కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల ప్రజలు, ముఖ్యంగా చెన్నైవాసులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి నెలకొంది. పలుచోట్ల దుకాణాలు తెర వకపోవడం, తెరిచిన చోట నిత్యావసర వస్తువుల ధరలు ఐదారు రె ట్లు పెరిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయలు, పాలు, తాగునీటికి తీవ్రమైన కొరత ఏర్పడింది. పాల ప్యాకెట్లు లభించక చిన్న పిల్లల తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది.

మరోవైపు ఇళ్ల ముందు నీరు ఏరులై పారుతున్నా తాగేందుకు చుక్కనీరు కూడా లేని దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇళ్లలోంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో బాధితులు మేడలు, అపార్ట్‌మెంట్లపై నిలబడి సాయం కోసం ఎదురుచూడటం కన్పించింది. మరోవైపు అంటువ్యాధుల భయం ప్రజలను వెంటాడుతోంది. మరో రెండురోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ దాదాపుగా 80 శాతం నగరానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ జరగలేదు.

దీంతో సమాచార వ్యవస్థకు అంతరాయం కొనసాగింది. ఏటీఎంలు పనిచేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అంతకుముందు ముఖ్యమంత్రి జయలలిత వేర్వేరుగా చెన్నై సహా తమిళనాడులోని వర్ష ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తమిళనాడుకు ప్రధాని రూ.1,000 కోట్ల సహాయం ప్రకటించారు. సైన్యం, ఎన్డీఆర్‌ఎఫ్ దళాలు పడవలతో సహాయ చర్యల్లో ముమ్మరంగా పాల్గొంటున్నా..హెలికాప్టర్లలో ఆహార పొట్లాలు జారవిడుస్తున్నా.. సాయం అరకొరగానే అందుతోంది.

కొన్ని ప్రాంతాలకు సహాయ బృందాలు చేరుకోలేని పరిస్థితి కూడా ఉంది. అయితే మొత్తం 14 లక్షల ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు గురువారం నాటికి చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు తదితర జిల్లాల్లో వర్షాలు, వరదలతో మరణించిన వారి సంఖ్య 269కి చేరింది.

కాంచీపురం. తిరువళ్లూరు, కడలూరు జిల్లాల్లో గత 20 రోజులుగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. చెన్నైలో రైళ్లు, విమానాల రాకపోకలు నిలిచిపోయిన విషయమూ విదితమే. శనివారం వరకు తమ రైళ్ల సర్వీసులన్నీ నిలిపివేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్‌కు కూడా తీవ్రమైన కొరత ఏర్పడింది. తెరిచి ఉన్న కొన్ని పెట్రోల్ బంకుల ముందు పెద్దసంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.
 
ఇంకా జలదిగ్బంధంలోనే..
చెన్నై శివార్లలోని తాంబరం, ముడిచ్చూర్, వేలచేరి పరిసర వాసుల వెతలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలతో పాటు సైదాపేట, జప్ఫర్‌ఖాన్‌పేట, అన్నానగర్, వలసరపాకం, కోయంబేడు, వడపళని, వెస్ట్ మాంబళం, విలివాకం, విన్నివాక్కం, ఊరపాక్కం, అంబత్తూరు, గూడువాంజేరి, నందనం, కొట్టూర్‌పురం, అమిందాకరై, నుంగంబాక్కం, ఈకాడు తాంగెల్, అన్నాసలై తదితర ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.

కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఆరేడు అడుగుల వరకు ఎత్తులో వరద నీరు నిలిచింది. గురువారం వర్షం కురవనప్పటికీ.. చెంబరామ్‌బాక్కమ్ మంచినీటి రిజర్వాయర్ నుంచి బుధవారం రాత్రి విడుదలైన 30 వేల క్యూసెక్కుల నీటి కారణంగా గురువారం నగరంలో కొత్తగా కోడంబాక్కం, అశోక్‌నగర్, టీ నగర్ ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరింది. నగరంలోని పలు ప్రాంతాలగుండా వెళ్లే అడయార్ నది ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తోంది. కాంచీపురం జిల్లాలో అనేకచోట్ల గండ్లు ఏర్పడటంతో చెన్నైని మధురై, ఆపై ప్రాంతాలకు కలిపే గ్రాండ్ సదరన్ ట్రంక్‌రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి.
 
మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు...
తమిళనాడులో జలవిలయానికి కారణమవుతున్న అల్పపీడనం శ్రీలంక, తమిళనాడు తీరాలకు ఆనుకొని స్థిరంగా కొనసాగుతోంది. దీంతో రానున్న తొలి మూడు రోజులపాటు భారీనుంచి అతిభారీ వర్షాలు, ఆ తర్వాత మూడు రోజులు ఓ మోస్తరు జల్లులు కురిసే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది.
 
డిసెంబర్ 4: తమిళనాడు తీరప్రాంతాల తోపాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయి. ఏపీలో దక్షిణ కోస్తా తీరప్రాంతాల్లో ఓ మోస్తరు జల్లులు పడతాయి.
 
డిసెంబర్ 5: తమిళనాడు వ్యాప్తంగా వర్షం జోరు పెరుగుతుంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదయ్యే అవకాశముంది. ఏపీలోని తీరప్రాంతాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి.
 
డిసెంబర్ 6: తమిళనాడులో కొంతమేర తగ్గుముఖంపట్టినా భారీ వర్షాలే కురుస్తాయి. కేరళలో అతిభారీ వర్షాలు నమోదవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి జల్లులు పడతాయి.
 
డిసెంబర్ 7: కేరళలో వర్షం జోరు పెరుగుతుంది. భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయి. దక్షిణ కర్ణాటక, లక్షద్వీప్‌లలో మోస్తరు జల్లులు పడతాయి.
 
డిసెంబర్ 8, 9: తమిళనాడుతోసహా కేరళ, ఏపీల్లో వర్షాలు తగ్గుముఖంపడతాయి. అయినా దక్షిణ భారతమంతా అల్పపీడన ప్రభావం కొనసాగుతుంది.
 
జాలర్లు సముద్రంలో చేపలవేటకు వె ళ్లకూడదని చెన్నై తుపాను హెచ్చరికల కేంద్రం డెరైక్టర్ ఎస్.ఆర్.రామనన్ చెప్పారు. కోస్తా తమిళనాడు, పుదుచ్చేరిల్లో రానున్న 24 గంటల్లో మరింత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
 
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి బలపడి గురువారం అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ప్రస్తుతం అల్పపీడనం తమిళనాడు తీరానికి ఆనుకుని బలంగా ఉంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో.. కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది.

అదే సమయంలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని వివరించింది. దక్షిణ కోస్తాంధ్రలో తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది.
 
ముమ్మరంగా సహాయక చర్యలు
చెన్నై: చెన్నైలో గురువారం వర్షం కాస్త తెరిపినివ్వడంతో రెస్క్యూ ఆపరేషన్లు ఊపందుకున్నాయి. జాతీయ విపత్తు నిర్వహణ బృందాల(ఎన్‌డీఆర్‌ఎఫ్)తో పాటు సైన్యం, వైమానిక దళం ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు, వరదలో చిక్కుకుపోయిన వారికి ఆహార పదార్థాలను అందించేందుకు నిరంతరాయంగా శ్రమిస్తున్నారు. సుమారు ఐదు వేల మందిని ఎన్‌డీఆర్‌ఎఫ్, సైన్యం, వైమానిక దళాలు రక్షించినట్టు తెలుస్తోంది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో రెండో అంతస్తు వరకూ నీరు చేరిందని, ఈ పరిస్థితులను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎయిర్ కమాండర్ రిప్పన్ గుప్తా తాంబరం ఎయిర్‌బేస్‌లో తెలిపారు.

గురువారం ఉదయం 120 మందిని తరలించామని, ప్రత్యేక విమానంలో వీరిని ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేశామని చెప్పారు. వీరిలో ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీకి చెందిన 50 మంది విద్యార్థులు కూడా ఉన్నట్టు తెలిపారు. మరో 20 మందిని అరక్కోణం చేర్చినట్టు వెల్లడించారు. సాధ్యమైనంత మంది బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకుగానూ మీనంబాక్కమ్, అరక్కొణం మధ్య ఎయిర్ బ్రిడ్జ్‌ను ఏర్పాటు చేసినట్టు గుప్తా చెప్పారు. తాంబరం, అరక్కొణం మధ్య రెండో ఎయిర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు.
 
రెండో అంతస్తు వరకు మునిగిన ఇళ్లు..
చెన్నైలో వరద ప్రభావానికి ఎక్కువగా గురైన మెడుంబాక్కమ్‌లో ఏడు నెలల గర్భిణి సుకన్య(29)తో పాటు మూడు సంవత్సరాల చిన్నారిని హెలికాఫ్టర్ ద్వారా రక్షించారు. మొదటి, రెండో అంతస్తులోకి నీరు చేరడంతో తాము నాలుగో అంతస్తులోనే తలదాచుకున్నామని, రెండు రోజులుగా విద్యుత్ సరఫరా లేదని, ప్రాణాలపై ఆశలు వదిలేసుకున్న సమయంలో తమను రక్షించారని సుకన్య తెలిపారు.
 
ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు రెట్టింపు
ఎన్‌డీఆర్‌ఎఫ్‌కు చెందిన 1200 మంది వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు 5 వేల మందిని ఈ బృందాలు రక్షించాయి. చెన్నైలో 21 బృందాలు, తిరువల్లుర్‌లో 1, కాంచీపురంలో 4, పుదుచ్చేరిలో 2, వెల్లూర్, కడలూర్‌లో ఒక్కొక్కటి చొప్పున బృందాలను పంపినట్టు అధికారులు తెలిపారు.
 
ఆపరేషన్ ‘మదద్’
సాక్షి, విశాఖపట్నం/హైదరాబాద్: తమిళనాడులో ఆపరేషన్ ‘మదద్’ పేరుతో నిర్వహిస్తున్న సహాయక చర్యల్లో ఆర్మీ, నేవీ బలగాలు పాల్గొంటున్నాయి. ఈస్ట్రన్ నేవల్ కమాండ్ గురువారం విశాఖ నుంచి ఐఎన్‌ఎస్ శక్తిని చెన్నై పంపించింది. ఇందులో ఓ హెలికాప్టర్, బాధితులకు అవసరమైన దుస్తులు, వైద్య పరికరాలు, 30 టన్నుల ఆహార పదార్థాలు, 18 జెమినీ బోట్లు, 200 టెంట్లు, దుప్పట్లు, 8 జనరేటర్లు, 5 వేల లీటర్ల తాగునీరు, 3 వేల లీటర్ల పాలు, 2 వేల లీటర్ల పాలపొడి, 30 సింటెక్స్ ట్యాంకులు పంపించారు.

 కాగా, ఈ నెల 2న విశాఖ నుంచి వెళ్లిన ఐఎన్‌ఎస్ ఐరావత్ గురువారం చెన్నై చేరుకుంది. తూర్పు నావికాదళ ప్రధానాధికారి, వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ మాట్లాడుతూ.. సహాయక చర్యల్లో మొత్తం 225 మంది సిబ్బంది పాల్గొంటున్నట్లు తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి 300 మంది సిబ్బందితో కూడిన ఆర్మీ బలగాల బృందం అరక్కోణం వెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement