గాలిలో సీఎం హెలికాప్టర్.. తీవ్ర ఉత్కంఠ!
భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దాదాపు 45 నిమిషాలపాటు గాలిలో ఊగిసలాడటం తీవ్ర ఉత్కంఠ రేపింది. గురువారం కోరాపుట్ జిల్లాలోని కోట్‌పాద్ వద్ద ల్యాండింగ్ అయ్యే సమయంలో సమన్వయం లోపించడంతో ఈ అవాంఛనీయ ఘటన జరిగింది.
పట్నాయక్ ప్రయాణిస్తున్న చాపర్ అనుకున్న సమయానికి కోట్‌పాద్ వద్దకు రాకపోయేసరికి ఆయన హెలికాప్టర్ గల్లంతయిందంటూ ఒక్కసారిగా వదంతులు గుప్పుమన్నాయి. కోట్‌పాద్ మావోయిస్ట్ ప్రభావితం కావడంతో సీఎం హెలికాప్టర్ అదృశ్యమైనట్టు వచ్చిన వందతులు తీవ్ర ఉత్కంఠ రేపాయి. దీంతో అధికారులు, ప్రజలు ఉత్కంఠగా గడిపారు.
పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేసేందుకు, పలు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందజేసేందుకు సీఎం పట్నాయక్ కోరాపుట్ జిల్లాకు వచ్చారు. మొదట జయ్‌పూర్‌లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం అనంతరం కోరాపాద్ బయలుదేరారు. ఆయన మధ్యాహ్నం 12.40 గంటలకు రావాల్సి ఉండగా.. మధ్యాహ్నం 1.30 గంటలకుగానీ సీఎం హెలికాప్టర్ రాలేదు. అధికారుల మధ్య తప్పుడు సమన్వయం వల్ల సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ ప్రదేశం కన్నా ముందుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత 45 నిమిషాలు గాలిలో ఊగిసలాడి.. చివరకు సురక్షితంగా కోరాపాద్ హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయింది. దీంతో ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.