జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్
12 మంది నక్సల్స్ హతం
మేదినీనగర్: జార్ఖండ్‌లోని పలామూ జిల్లాలో సోమవారం అర్ధరాత్రి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల జోనల్ కమాండర్ ఆర్కే అలియాస్ అనురాగ్ సహా 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరిని మావోయిస్టుల సబ్‌జోనల్ కమిటీ సభ్యులుగా భావిస్తున్నారు. జార్ఖండ్ రాజధాని రాంచీకి 140 కిలోమీటర్ల దూరంలోని బబోరియా గ్రామ శివార్లలో సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పాలము జిల్లా ఎస్సీ మయూర్ పటేల్ వెల్లడించారు. ఆ
ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయని చెప్పారు. రెండు వాహనాల్లో వెళుతున్న మావోయిస్టులు పోలీసు బలగాలను చూసి, కాల్పులు ప్రారంభించారని... ప్రతిగా పోలీసులు, సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మరణించారని తెలిపారు. పది అత్యాధునిక తుపాకులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో వాహనంలో ఉన్న కొందరు నక్సల్స్ పారిపోయారని సీఆర్‌పీఎఫ్ డీజీ ప్రకాశ్ మిశ్రా చెప్పారు.