చైనాలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి దంపతులు రెండో బిడ్డను కనేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే.. ఇందుకు ఓ కండిషన్ ఉందండోయ్!!
చైనాలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అక్కడి దంపతులు రెండో బిడ్డను కనేందుకు ప్రభుత్వం అనుమతించింది. అయితే.. ఇందుకు ఓ కండిషన్ ఉందండోయ్!! తల్లిదండ్రులిద్దరిలో ఎవరో ఒకరు వారి తల్లిదండ్రులకు ఒకరే బిడ్డ అయి ఉండాలి. చైనాలో వృద్ధుల సంఖ్య బాగా పెరిగిపోవడం, యువతీ యువకుల సంఖ్య గణనీయంగా పడిపోతుండటంతో ఆలస్యంగానైనా మేల్కొన్న అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ (ఎన్పీసీ) స్థాయీ సంఘం ఓ తీర్మానాన్ని ఆమోదించింది.
ఈ స్థాయీ సంఘం తీర్మానానికి చైనాలో చట్టబద్ధత ఉంటుంది. దీనికి అనుగుణంగా అక్కడి రాష్ట్రాలు కూడా తమ కుటుంబ నియంత్రణ విధానాలను మార్చుకోవాలని, లేదా అవసరమైతే ప్రత్యేక చట్టాలు కూడా చేయాలని తెలిపారు. ఇప్పటివరకు చైనాలో అమలులో ఉన్న 'ఒకే సంతానం' నిబంధనను సడలించాలని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) నిర్ణయించింది. రాజ్యాంగంలో కూడా కుటుంబ నియంత్రణను అత్యవసర విషయంగా పేర్కొనడంతో, ఇప్పుడు దాన్ని సవరించడానికి అత్యున్నత శాసన వ్యవస్థ కలగజేసుకోవాల్సి వచ్చింది.