హోటల్లో అగ్నిప్రమాదం: 10 మంది మృతి
ఆగ్నేయ చైనాలోని నాన్‌చాంగ్ నగరంలో గల నాలుగు అంతస్థుల హోటల్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కనీసం 10 మంది మరణించినట్లు సిన్హువా వార్తా సంస్థ తెలిపింది. హెచ్ఎన్ఏ ప్లాటినం మిక్స్ హోటల్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ హోటల్ చైనాలోని జియాంగ్జి రాష్ట్ర రాజధాని అయిన నాన్‌చాంగ్ నగరంలో ఉంది.
మంటల్లో కాలిపోయిన హోటల్ శిథిలాల్లో ఏడు మృతదేహాలను అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. తీవ్రంగా గాయపడిన 16 మందిని ఆస్పత్రికి తరలించగా, వాళ్లలో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. ఈ హోటల్ పక్కనే ఉన్న 24 అంతస్తుల అపార్టుమెంటులో 260 మందికి పైగా ఉంటారు. వాళ్లందరినీ వెంటనే ఖాళీ చేయించారు. ఈ హోటల్ యాజమాన్యానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.