
సానియా వ్యవహారంపై తేలని వివాదం
హైదరాబాద్ : దారుణంగా హత్యకు గురైన తల్లి... ఓవైపు జైల్లో తండ్రి.. ఇంకోవైపు తమకు అప్పగించాలంటూ తల్లి తరఫు బంధువులు, మరోవైపు సానియా తమతోనే ఉంటుందని తండ్రి కుటుంబసభ్యలు డిమాండ్తో చిన్నారి సానియా పరిస్థితి అయోమయంగా మారింది. ఈ నేపథ్యంలో వారి కూతురు సానియా ఎక్కడ ఉండాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
అయిదు రోజుల క్రితం కాంగో దేశస్తురాలు అయిన సింథియాను అతి కిరాతకంగా హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికి మృతదేహాన్ని దహనం చేసిన రూపేశ్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆమె సోదరుడు డానీస్‌తోపాటు అతడి బంధువులు రెండురోజులుగా పోలీస్‌స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు సానియాను పోలీసులు గురువారం రాజేంద్ర నగర్ కోర్టులో హాజరుపరిచారు. అయితే కేసు తమ పరిధిలోకి రాదని, రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. దీంతో పోలీసులు రంగారెడ్డి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించనున్నారు. కాగా తల్లి హత్య అనంతరం సానియా తన నాయనమ్మ లీలావతి వద్ద ఉండగా, ఆ చిన్నారిని పోలీసులు గురువారం నాడు రెస్క్యూ హోంకు తరలించారు. ఆ ప్రదేశాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.