అమెరికాలో మళ్లీ భగ్గుమన్న అహంకారం | clashes between White Nationalist and counterprotestors in Virginia | Sakshi
Sakshi News home page

అమెరికాలో మళ్లీ భగ్గుమన్న అహంకారం

Published Sun, Aug 13 2017 11:42 AM | Last Updated on Sun, Sep 17 2017 5:29 PM

అమెరికాలో మళ్లీ భగ్గుమన్న అహంకారం

అమెరికాలో మళ్లీ భగ్గుమన్న అహంకారం

- వర్జీనియాలో ఘర్షణలు.. ముగ్గురి మృతి
- రణరంగంలా చార్లెట్‌విల్‌ సిటీ.. ఎమర్జెన్సీ ప్రకటన
- అమెరికాను చేజిక్కించుకుందామంటూ అతివాదుల ర్యాలీ
- ప్రతిగా ‘అమెరికా ఒక్కటే’నంటూ మితవాదుల భారీ ప్రదర్శన
- శాంతి, సహనం పాటించాలని అధ్యక్షుడు ట్రంప్‌ పిలుపు
- ర్యాలీని పర్యవేక్షిస్తూ కూలిన పోలీస్‌ హెలికాపర్ట్‌


చార్లెట్‌విల్‌: అమెరికాలో మరోసారి అహంకార జ్వాలలు ఎగిసిపడ్డాయి. వర్జీనియా రాష్ట్రంలోని స్వతంత్ర నగరం చార్లెట్‌విల్‌లో.. అతివాద శ్వేతజాతీయులకు, మితవాదులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. దీంతో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ‘యురోపియన్‌ వలసవాదుల నుంచి అమెరికాను చేజిక్కించుకుందాం..’  అంటూ అతివాదులు నినాదాలు చేయగా, ‘అమెరికన్లంతా ఒక్కటే’నని మితవాదులు గర్జించారు. శుక్ర, శనివారాల్లో చార్లెంట్‌విల్‌ లోని పార్కులు, వీధులు అనుకూల, వ్యతిరేక నినాదాలతో మారుమోగిపోయాయి.

అసలేం జరిగింది?: దక్షిణాది జాతీయవాదానికి గుర్తుగా ఉన్న ‘కాన్ఫెడరేట్‌ పాస్ట్‌ స్మారకచిహ్నం(రాబర్ట్‌.ఈ.లీ విగ్రహం)ను యూనివర్సిటీ ఆఫ్‌ వర్జీనియా నుంచి తొలగించాలన్న స్థానిక కౌన్సిల్‌ నిర్ణయమే తాజా ఘర్షణలకు మూలకారణమని భావిస్తున్నారు. తాము గర్వకారణంగా భావించే స్మారకచిహ్నాన్ని తొలగించవద్దంటూ కరడుగట్టిన శ్వేతజాతీయులు కొందరు ఉద్యమం మొదలుపెట్టారు. ఇది క్రమంగా యూరోపియన్‌,ఆఫ్రికన్‌ వలసదారులపై విద్వేషంగా మారింది. ‘మొదటి నుంచి అమెరికాలో ఉంటున్న తమపై యూరప్‌ నుంచి వచ్చిన వలసదారులు పెత్తనం చెలాయిస్తున్నార’ని ఆందోళనకారులు ప్లకార్డులు ప్రదర్శించారు. ‘అమెరికాను తిరిగి చేజిక్కించుకుందాం’ అంటూ నినాదాలు చేశారు.

 ట్రంప్‌ను గెలిపించింది శ్వేతజాతీయులే : నిరసనకారులకు నేతృత్వం వహించిన వారిలో ప్రముఖుడైన డేవిడ్‌ డ్యూక్‌(వివాదాస్పద ‘కు క్లక్స్‌ క్లాన్‌’ మాజీ నాయకుడు) అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్‌.. ఒక్కసారి నీ ముఖం అద్దంలో చూసుకో. నువ్వు గెలిచింది మా(శ్వేతజాతీయుల) ఓట్లతోనేకానీ ఆ ర్యాడికల్‌ లెఫ్టిస్టుల ఓట్లతో కాదన్న విషయం గుర్తుంచుకో’ అని అన్నారు.

మితవాదుల ర్యాలీపై కారు దాడి: శ్వేతజాతి అతివాదులకు వ్యతిరేకంగా శనివారం మితవాదులు భారీ ర్యాలీని చేపట్టారు. వర్జీనియాలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చార్లెట్‌విల్‌లోని ఒక వీధిలో కిక్కిరిసిఉన్న మితవాదులపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చి, విచక్షణారహితంగా తొక్కేసి వెళ్లిపోయింది. ఈ ఘటనలో ఒక మహిళ చనిపోగా, 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. దాడికి పాల్పడిన అతివాద బృంద సభ్యుడిని పోలీసులు అరెస్ట్‌చేశారు.


ట్రంప్‌ విన్నపం: చార్లెట్‌విల్‌లో విద్వేషప్రదర్శనలు, హింస చోటుచేసుకోవడంపై అమెరికా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అధ్యక్షుడు ట్రంప్‌ శనివారం వైట్‌హౌస్‌లో మాట్లాడుతూ శాంతిని పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘విద్వేష దాడులు గర్హనీయం. మనమంతా ఒక్కటే. అమెరికన్లలో బేధాలు లేవు. సహనం పాటించండి. శాంతివహించండి..’ అని వ్యాఖ్యానించారు.

కూలిన హెలికాప్టర్‌.. పోలీసులపై విమర్శలు: చార్లెట్‌విల్‌లో ఆందోళనలను జరుగుతున్న ప్రాంతాలలో గగనతలం నుంచి గస్తీ కాస్తోన్న హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌తోపాటు ఒక అధికారి దుర్మరణం చెందారు. కాగా, ఆందోళనకారులను అదుపుచేయడంలో పోలీసులు నిర్లిప్తత ప్రదర్శించారని పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగుతున్నాయి. అతివాదులు, మితవాదులు పరస్పరం ఘర్షణపడకుండా పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనందునే పరిస్థితి విషమించిందనే వాదనలు వినిపిస్తున్నాయి.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement