ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. భారతీయుడి అరెస్ట్‌పై కోర్టు సీరియస్‌ | US Judge Blocks Indian Researcher Badar Khan Suri Deportation | Sakshi
Sakshi News home page

Badar Khan Suri: ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. భారతీయుడి అరెస్ట్‌పై కోర్టు సీరియస్‌

Published Fri, Mar 21 2025 8:09 AM | Last Updated on Fri, Mar 21 2025 12:41 PM

US Judge Blocks Indian Researcher Badar Khan Suri Deportation

వాషింగ్టన్‌: అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారతీయ రీసెర్చర్‌ బాదర్‌ ఖాన్‌ సూరిని అమెరికా నుంచి బహిష్కరించ వద్దని అక్కడి న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు స్పష్టం చేసింది. ఇక, బాదర్‌ ఖాన్‌ సూరికి హమాస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై ట్రంప్‌.. అతడిని అరెస్టు చేసి, బహిష్కరించడానికి ప్రయత్నం చేసింది.

ఇక.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తనదైన మార్క్‌ పాలనతో ముందుకు సాగుతున్నారు. తాను చేసింది రాజ్యాంగం అనే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ట్రంప్‌కు కోర్టులు మొట్టికాయలు వేస్తున్నాయి. అయితే, హమాస్‌ సంస్థతో లింకులు ఉన్నాయన్న అభియోగాలతో భారతీయ రీసెర్చర్‌ బాదర్‌ ఖాన్‌ సూరిని అక్కడి భద్రతా అధికారులు అరెస్ట్‌ చేశారు. త్వరలో ఆయన్ని భారత్‌కు తిరిగి పంపించేందుకు ప్రయత్నిస్తున్నామని అక్కడి అధికారులు ప్రకటించారు.

అయితే, ఈ చర్యలను సవాల్‌ చేస్తూ ఆయన కోర్టుకు ఎక్కారు. తన భార్య పాలస్తీనా మూలాలు ఉండడంతోనే ప్రభుత్వం ఈ చర్యలకు ఉపక్రమించిందని, తనకు ఎలాంటి నేర చరిత లేదని తన పిటిషన్‌లో సూరి పేర్కొన్నారు. ఈనేపథ్యంలో బాదర్‌ ఖాన్‌ సూరిని అమెరికా నుంచి బహిష్కరించ వద్దని తాజాగా వర్జీనియా కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది. ఇమ్మిగ్రేషన్ హోదాను తొలగించడం మరియు రాజకీయ దృక్పథం ఆధారంగా వారిని నిర్బంధించడం సరైంది కాదని పేర్కొంది. అనంతరం, తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు బహిష్కరణకు వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

బాదర్‌ నేపథ్యం ఇదే..
భారత్‌కు చెందిన బాదర్‌ ఖాన్‌ సూరి.. స్వస్థలం ఎక్కడ అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఆయన విద్యాభ్యాసం అంతా భారత్‌లోనే గడిచినట్లు తెలుస్తోంది. న్యూఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో పీస్‌ అండ్‌ కాన్‌ఫ్లిక్ట్‌ స్డడీస్‌పైన పీహెచ్‌డీ చేసిన ఆయన.. ఆపై ఇరాక్‌, అఫ్గనిస్థాన్‌లో శాంతిస్థాపనకు సంబంధించిన అంశాలపై పరిశోధనలూ చేశారు. అమెరికాకు వలస వెళ్లిన బాదర్‌.. మఫెజ్‌ అహమద్‌ యూసఫ్‌ సలేహ్‌ అనే పాలస్తీనా మూలాల ఉన్న అమెరికన్‌ పౌరురాలిని వివాహం చేసుకున్నారు. ఆమె తండ్రి హమాస్‌లో కీలక నేత అయిన అహ్మద్‌ యూసెఫ్‌గా డీహెచ్‌ఎస్‌ ప్రకటించింది. బాదర్‌ ఖాన్‌ సూరి అరెస్ట్‌ కావడంతో.. జాతీయ భద్రతా, వ్యక్తిగత హక్కులు, విద్యాలయాలపై రాజకీయాల ప్రభావం.. లాంటి అంశాలు చర్చకు వచ్చాయి.

అమెరికా ఫారిన్‌ పాలసీ ప్రకారం.. ఆ దేశానికి ముప్పుగా పరిగణించే నాన్ సిటిజన్స్‌‌ను అక్కడి నుంచి తరలించే ఇమ్మిగ్రేషన్‌ చట్టాన్ని సూరిపై ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఇదే చట్టాన్ని ఉపయోగించి కిందటి ఏడాది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి, గ్రీన్‌కార్డ్‌ హోల్డర్‌ అయిన మహమ్మూద్‌ ఖలీల్‌ను అక్కడి నుంచి సొంత దేశానికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement