సీఎం తలుచుకుంటే.. మీరు ప్రాణాలతో మిగలరు!
శిరోమణి అకాలీ దళ్ నాయకురాలు, కేంద్రమంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి బుధవారం ఘాటుగా హెచ్చరికలు చేశారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ప్రకాశ్ సంగ్ బాదల్ హింసాత్మక దాడులకు దిగాలని అకాలీ శ్రేణులకు పిలుపునిస్తే.. పంజాబ్ లో ఆప్ మద్దతుదారులు ఒక్కరూ కూడా ప్రాణాలతో మిగలబోరని ఆమె పేర్కొన్నారు.
సీఎం బాదల్ పై ఒక నిరసనకారుడు చెప్పు విసిరిన నేపథ్యంలో బఠిండా ఎంపీ అయిన ఆమె అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. బాదల్ కుటుంబం లక్ష్యంగా గత నాలుగురోజుల్లో రెండుసార్లు దాడులు జరిగాయి. కొన్నిరోజుల కిందట హర్సిమ్రత్ కౌర్ భర్త అయిన డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్ కాన్వాయ్ లక్ష్యంగా రాళ్ల దాడి జరిగింది. తాజాగా సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పై సిక్కు రాడికల్ యువకుడు ఒకడు చెప్పుతో దాడి చేశాడు. అయితే, ఈ దాడులు ఆప్ కావాలనే చేయిస్తున్నదని, తాము తిరగబడితే ఆప్ నామరూపాలు లేకుండా పోతుందని హర్సిమ్రత్ కౌర్ హెచ్చరించారు. హర్యానా మూలాలు ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు పంజాబ్ సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఆమె విమర్శించారు. అయితే, ఈ దాడులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని పంజాబ్ ఆప్ ఎంపీ భగవంత్ సింగ్ మాన్ అంటున్నారు.