'కేసీఆర్ జగమొండి.. ప్రాణాలైనా బలిపెడతాడు'
హైదరాబాద్: 'కేసీఆర్ జగమొండి. అవసరమైతే ప్రాణాలు బలిపెడతాడు కానీ వెనక్కి వెళ్లడు. ఆరునూరైనా 2018లో కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి.. ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతా' అని సీఎం కే చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. గోదావరి జలాలపై మహారాష్ట్రతో చరిత్రాత్మక ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చిన ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తే.. వారిపై కేసులు పెట్టి జైలుకూడు తినిపిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో ఆకుపచ్చగా మారుతుంటే కాంగ్రెస్ నేతలు కళ్లలో నిప్పులో పోసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇంకా సీఎం కేసీఆర్ ఏమన్నారంటే..
టాప్ కామెంట్స్..
- గోదావరి జలాలపై మహారాష్ట్రతో ఒప్పందాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గవి.
- కాళేశ్వరం, ఎల్లంపల్లి పూర్తయితే తెలంగాణ సస్యశామలం అవుతుంది
- ఏడాదిన్నర కష్టపడి మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నాం
- తెలంగాణ ప్రజల గోసకు, బాధలకు కాంగ్రెస్ పార్టీయే కారణం.
- తమ్మిడిహెట్టిపై ఒప్పందం జరిగి ఉంటే.. ఆరేళ్లయినా ఎందుకు తట్టెడు మట్టి తీయలేదు?
- మేం ప్రాజెక్టులు నిర్మిస్తామంటుంటే.. కాంగ్రెస్ నేతలు డ్రామాలు చేస్తున్నారు.
- కాంగ్రెస్, టీడీపీ రెండూ తెలంగాణకు అన్యాయం చేశాయి.
- గతంలోనే 98 లక్షల ఎకరాలకు నీరు అంది ఉంటే తెలంగాణ ఉద్యమం ఎందుకొచ్చేది
- రెండేళ్లలో మా అవినీతి రహిత పాలన చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతల ఆరోపణలు
- గోదావరి నికర జలాలు 1480 టీఎంసీలు ఉంటే.. అందులో తెలంగాణ వాటా 950 టీఎంసీలు
- మొత్తం నీటి లభ్యత మూడువేల టీఎంసీల్లో 1500 టీఎంసీల మిగులు జలాలున్నాయి
- అందులో మా వాటా తేల్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తాం
- తెలంగాణలోని కోటి ఎకరాలకు కృష్ణా, గోదావరి నీళ్లు తెచ్చితీరుతాం
-
ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు త్వరలో తెలంగాణ బస్సుయాత్ర నిర్వహిస్తా