ధూం ధాంగా స్వాగతం
సాక్షి, హైదరాబాద్: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని బుధవారం హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందనున్న ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మెదక్, నల్లగొండ జిల్లాల నుంచి టీఆర్‌ఎస్ కార్యకర్తలు, రైతులు తరలివచ్చారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ స్వాగత కార్యక్రమానికి భారీగా ఏర్పాట్లు చేసింది. బేగంపేట ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గంలో పెద్దఎత్తున బ్యానర్లు ఏర్పాట్లు చేశారు. సీఎం ముంబై నుంచి మధ్యాహ్నం రెండు గంటల కు చేరుకుంటారని, ఒంటి గంటకల్లా సభా స్థలికి చేరుకోవాలని శ్రేణులకు సూచించారు.
కానీ సీఎం సాయంత్రం నాలుగు గంటల తర్వాతే బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రులు హరీశ్, నాయిని, తలసాని, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి తదితరులు సీఎంను స్వాగతించి ఓపెన్ టాప్ బస్సులో తీసుకువచ్చారు. పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంతోపాటు బస్సుపై నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. సీఎం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై నుంచి కాక బస్సుపై నుంచే ప్రసంగించారు. అదే బస్సుపైనే ప్రజలకు అభివాదం చేస్తూ తన అధికారిక నివాసానికి వెళ్లిపోయారు.
కేసీఆర్ రాక సుమారు రెండు గంటల పాటు ఆలస్యం కావడంతో ప్రభుత్వ సాంస్కృతిక సారథి విభాగానికి చెందిన కళాకారులు ఆటపాటలతో అలరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు ఆట పాటలతో ఆకట్టుకున్నారు. సీఎంకు స్వాగతం పలికేందుకు చేసిన ఏర్పాట్లను మంత్రి తలసాని పర్యవే క్షించగా, టీఎస్‌ఎండీసీ చైర్మన్ ఎస్.సుభాష్‌రెడ్డి అధికారులను, వివిధ శాఖలను సమన్వయం చేశారు. చరిత్రాత్మక ఒప్పందం చేసుకుని నగరానికి చేరుకున్న సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు అధికార టీఆర్‌ఎస్ రెండు రోజులుగా ఏర్పాట్లు చేసుకుని అనుకున్న స్థాయిలో జనాలను సమీకరించిందని పార్టీ నేత ఒకరు చెప్పారు.