
కేసీఆర్.. మోదీ ఏజెంట్: జీవన్ రెడ్డి
పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఏజెంట్‌లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్ రెడ్డి విమర్శించారు.
మోదీని కలిసిన తర్వాత స్వరం ఎందుకు మారిందో చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: పెద్దనోట్ల రద్దు విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి ఏజెంట్‌లాగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతున్నారని సీఎల్పీ ఉపనాయకుడు జీవన్ రెడ్డి విమర్శించారు. పెద్దనోట్ల రద్దుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని ఏజెంట్‌గా కాకుండా ప్రజల ఏజెంట్‌గా మాట్లాడాలని సూచిం చారు. నగదురహితంగా మారుస్తామంటున్న కేసీఆర్ కు ప్రజల బాధలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 10 శాతం జనాభా బ్యాంకులు, ఏటీఎంల ముందు గడుపుతున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. నోట్ల రద్దుపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఢిల్లీ వెళ్లి మోదీని కలిసిన వెంటనే స్వరం మార్చారన్నారు. దీనికి గల కారణాలు, ఏమిటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. నోట్లకోసం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద చనిపోయినవారికి నివాళులు అర్పించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన విమర్శించారు.