ఆర్థిక క్రమశిక్షణతో అగ్రపథం
- సకల వనరులున్న సుసంపన్న రాష్ట్రం తెలంగాణ
- రేపటి నుంచి ‘కేసీఆర్ కిట్లు’, ‘గర్భిణులకు నగదు’ అమలు
- వచ్చే యాసంగి నుంచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్
- రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ ఉద్ఘాటన
హైదరాబాద్: సకల వనరులతో సుసంపన్నంగా ఉన్న రాష్ట్రం తెలంగాణ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించడం వల్లే అభివృద్ధిపథంలో రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తొలుత గన్ పార్కు వద్ద అమరవీరులకు నివాళులర్పించిన ముఖ్యమంత్రి.. అక్కడి నుంచి నేరుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. జాతీయ జెండా ఎగరవేసిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రగతి నివేదికను చదివి వినిపించిన సీఎం.. ప్రభుత్వం అమలుచేస్తోన్న సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.
‘అట్టడుగు ఉద్యోగాలు చేస్తున్నవారి వేతనాలను పెంచాం. ఒంటరి మహిళలకు రూ.వెయ్యి జీవన భృతి కల్పిస్తున్నాం. పేద యువతుల పెళ్లిళ్లకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాం. రేపటి(జూన్ 3) నుంచి గర్భిణులకు(వైద్యపరీక్షల నిమిత్తం) రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని అందించనున్నాం. అదే సమయంలో బాలింతలకు రూ.15వేల విలువైన కేసీఆర్ కిట్లను పంపిణీ చేస్తాం. మిషన్ భగీరథతో భాగంగా ఈ ఏడాది చివరినాటికి ఇంటింటికీ మంచినీరు అందిస్తాం. వచ్చే యాసంగి నుంచి రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తాం’ అని సీఎం కేసీఆర్ వివరించారు.