దయాళ్ అమ్మాళ్ ను విచారించిన సీబీఐ
Published Mon, Oct 28 2013 11:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
చెన్నై : 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి సతీమణి దయాళ్ అమ్మాళ్ను సోమవారం సీబీఐ విచారించింది. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు నమోదు చేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం నియమితులైన సీఎంఎం గోపాలన్ ఈరోజు ఉదయం 9.40 గంటలకు దయాళ్ అమ్మాళ్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. 2జీ కేసులో భాగంగా అమ్మాళ్ను విచారించినట్లు సీబీఐ తెలిపింది. మాజీ టెలికాం మంత్రి, కరుణానిధి బంధువు దయానిధి మారన్... అమ్మాళ్ నివాసాన్ని సందర్శించారు.
2జీ కేసు ఛార్జిషీటులో దయాళ్ అమ్మాళ్ పేరు కూడా సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. దయాళ్ అమ్మాళ్, ఆమె కుమార్తె కనిమొళి డీఎంకే అధికారిక ఛానల్ కలైంజ్ఞర్ టీవీకి మేనేజింగ్ డైరక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే స్పెక్ట్రమ్ సొమ్ములో రూ.200 కోట్లను మాజీ టెలికాం మంత్రి ఎ.రాజా అక్రమంగా ఈ ఛానల్కు దారి మళ్లించారు. ఈ నిధులను ఏ విధంగా మళ్లించారనే విషయంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాగా ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు... దయాళ్ అమ్మాళ్కు కోర్టుకు హాజరయ్యే విషయంలో మినహాయింపు ఇచ్చింది. అయితే ఆరోగ్య కారణాల రీత్యా ఆమెను నివాసం వద్దే విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దాంతో సీబీఐ అధికారులు ఈరోజు ఉదయం దయాళ్ అమ్మాళ్ను విచారించారు.
Advertisement
Advertisement