రాజా, కనిమొళి,అమ్మాళ్‌పై అభియోగాలు
న్యూఢిల్లీ: 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో టెలికం మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి, డీఎంకే చీఫ్ కరుణానిధి భార్య దయా ళు అమ్మాళ్‌తో పాటు 16 మందిపై ఢిల్లీ ప్రత్యేక కోర్టు అభియోగాలను ఖరారు చేసింది. నవంబర్ 10 నుంచి వీరిపై విచారణను ప్రారంభించనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. ఈ కేసులో అభియోగాలు రుజువైతే రాజా, కనిమొళి ఇతర నిందితులకు గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు సంబంధించి ఇది రెండో కేసు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక కోర్టు పది మంది వ్యక్తులు, తొమ్మిది కంపెనీలపై మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు ఖరారు చేసింది. ఈ కుంభకోణంలో రాజా, కనిమొళితోపాటు స్వాన్ టెలికాం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బాల్వా, వినోద్ గోయంకాల పాత్రపై కోర్టు విచారణ జరపనుంది.
ఏప్రిల్ 25న ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులందరిపైనా అభియోగాలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఓపీ సైనీ స్పష్టం చేశారు. 208 పేజీల ఉత్తర్వుల్లో రాజా, కనిమొళి, అమ్మాళ్ , శరద్‌కుమార్ రూ. 200 కోట్లు అక్రమంగా చేతులు మారడానికి సహకరించారని, షాహిద్ బాల్వా, వినోద్ గోయెంకా ఈ మొత్తాన్ని కలైంగర్ టీవీలోకి అక్రమంగా తరలించారని పేర్కొన్నారు.