సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. పటియాలా కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు నిందితులకు శిక్ష విధించడంలో న్యాయవ్యవస్థ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ రెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు.
ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్‌ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది.
సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్‌కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. పదేళ్ల క్రితం నాటి 2జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment