మన టెలికాం పరిశ్రమ 5జీ స్పెక్ట్రమ్‌కు చేరుకుంటున్న తరుణంలో దాదాపు దశాబ్దకాలం నాటి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో పటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు, కేంద్ర టెలి కాం శాఖ మాజీ మంత్రి అండిముత్తు రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు మరో 15మంది నిందితులు కూడా నిర్దోషులని ప్రకటించింది. వీరిలో టెలికాం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆరోపణలొచ్చిన టెలికాం సంస్థలు సైతం కేసు నుంచి విముక్తమయ్యాయి. సీబీఐ కేసుల ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట రేట్(ఈడీ) దాఖలుచేసిన మనీలాండరింగ్ ఆరోపణల కేసు కూడా వీగిపోయింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఏడేళ్లపాటు కొనసాగిన ఈ కేసు మన దేశంలో కేసుల తీరు, దర్యాప్తు ప్రక్రియ ఎలా ఉంటాయో నిరూపించింది. కుంభకోణం పర్యవసానంగా ప్రభుత్వ ఖజానా రూ. 1,76,000 కోట్ల మేర నష్టపోయిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మదింపు వేసిన కేసు ఫలితమే ఇలా ఉన్నదంటే అది సీబీఐ పనితీరుకు అద్దం పడుతుంది. ప్రత్యేక న్యాయస్థానం ఇప్పుడిచ్చిన తీర్పు తుది తీర్పేమీ కాదు. దీనిపై తాము అప్పీల్‌కు వెళ్తామని సీబీఐ ప్రకటించింది. ఆ సంగతలా ఉంచి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ తీర్పు వెలువరిస్తూ చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. ‘ఈ ఏడేళ్లూ నేను అన్ని పని దినాల్లోనూ న్యాయస్థానా నికి హాజరయ్యాను. ఆఖరికి వేసవి సెలవులను కూడా వదులుకున్నాను. ఈ రోజు లన్నిటా ఉదయం 10 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకూ న్యాయస్థానంలో కేసును విచారించాను. కానీ పరిగణనలోకి తీసుకోదగిన ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా సీబీఐ ప్రవేశపెట్టలేకపోయింది’ అని చెప్పారు.
తీర్పు వెలువడ్డాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘మా ప్రభుత్వానికి వ్యతి రేకంగా తీవ్ర స్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తేలిపోయింది’ అన్నారు. అయితే ఈ వ్యవహారం ఇంతవరకూ రావడానికి ఆయన నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం ధోరణి కూడా కారణమని చెప్పకతప్పదు. 2007లో 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్‌లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమై 2008 జనవరి 10న అప్పటి టెలికాం మంత్రి రాజా 122 లైసెన్స్‌లు జారీ చేసిన కొన్ని నెలలకే ఆ విషయంలో ఫిర్యాదులు రావడం మొదలైంది. మొదట్లో వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇదొక పెద్ద కుంభకోణమని, దర్యాప్తు చేయడం అవసరమని టెలికాం వ్యవహారాలపై నిఘా ఉంచే ఓ స్వచ్ఛంద సంస్థ 2009 మే 4న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కి ఫిర్యాదు చేసింది. ఈలోగా ఎస్–టెల్ సంస్థ లైసెన్స్‌ల కేటాయింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
2010 నవంబర్‌లో కాగ్ నివేదిక 2జీ స్పెక్ట్రమ్ కేటా యింపుల్లో భారీయెత్తున నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ పరిణామాలు వెల్లడైన ప్పుడు వెనువెంటనే రంగంలోకి దిగాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. మొత్తం వ్యవహారంలో ఏమైందో తెలుసుకుని దాన్ని ప్రజల ముందుంచడం, లోపా లను సరిచేయడం... ఏమీ లేదనుకుంటే ఆ సంగతే తేటతెల్లం చేయడం జరగాలి. కానీ విపక్షాల ఒత్తిడి తర్వాత రాజాతో మంత్రి పదవికి రాజీనామా చేయించడం మినహా ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. ఈ తీరు అనేక అనుమానాలకు ఆస్కారమిచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించి, తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పింది. ఈ 122 లైసెన్స్‌లనూ రద్దు చేసింది. మరోపక్క కాగ్ నివేదిక వెలువడ్డాక దానిపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ సంఘం(జేపీసీ) నియమించాలని ఆనాడు విపక్షంలో ఉన్న బీజేపీ, మరికొన్ని పార్టీలు పట్టుబడితే పెడచెవిన పెట్టింది.
బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలోని ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నది గనుక కొత్తగా జేపీసీ అవసరం లేదన్న తర్కానికి దిగింది. ఈ వివాదం పర్య వసానంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకు పోయాయి. కానీ బడ్జెట్ సమావేశాల నాటికల్లా ప్రభుత్వం దిగొచ్చింది. జేపీసీ నియామకానికి అంగీ కరించింది. ఈసారి మరో కొత్త తర్కాన్ని తెరమీదకు తెచ్చింది. పీఏసీ నివేదిక రాబోతున్న తరుణంలో... జేపీసీ పరిశీలిస్తుంది గనుక ఇక పీఏసీ అవసరం లేదని వాదించింది. ఇలా మర్కట తర్కాన్ని మరపిస్తూ చేసిన వాదనలన్నీ ప్రభుత్వం ‘ఏదో’ దాచడానికి ప్రయత్నిస్తున్నదన్న అభిప్రాయాన్ని కలగజేశాయి. అటు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడలేదు. ట్రాయ్ చైర్మన్‌గా పనిచేసిన ప్రదీప్ బైజాల్ 2జీ స్పెక్ట్రమ్ స్కాంపై 2015లో పుస్తకం వెలువరించినప్పుడు మాత్రం ‘నేను గానీ, నా కుటుంబం లేదా మిత్రులుగానీ ప్రధాని పదవిని అడ్డుపెట్టుకుని సంపద పోగేయాలనుకోలేద’ని ఆయన చెప్పారు.
ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీటు... లిఖితపూర్వకంగా, మౌఖికంగా ప్రాసిక్యూషన్ తన ముందుంచిన వాదనలు, ప్రాసిక్యూటర్ల వ్యవహారశైలి వగైరా లపై తన 1,552 పేజీల తీర్పులో న్యాయమూర్తి చేసిన తీవ్ర వ్యాఖ్యలు తీవ్రమైనవి. టెలికమ్యూనికేషన్ల విభాగం తీసుకున్న, తీసుకోని చర్యలు సృష్టించిన అయో మయం క్రమేపీ పెరిగి పెద్దదై ఏమీ లేనిచోట ఏదో పెద్ద కుంభకోణం జరిగిందన్న అభిప్రాయం ప్రతివారిలోనూ ఏర్పడేలా చేసిందని తీర్పు అభిప్రాయపడింది. నింది తులు పాల్పడ్డారంటున్న చర్యల్లోని అపరాధాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలు ఈ కేసులో లేవని తేల్చింది. కోర్టుకు దాఖలు చేసిన పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా ముందుకురాని ప్రాసిక్యూటర్ల తీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎవరెన్ని చెప్పినా, ఆరోపణలు చేసినా న్యాయస్థానాలకు అంతిమంగా కావలసింది సంశయాతీతమైన సాక్ష్యాధారాలు. ఇంత సుదీర్ఘ సమయం తీసుకుని కూడా వాటిని అందజేయలేక సీబీఐ చతికిలబడింది. ఖజానాకు భారీ నష్టం వాటి ల్లిందని ఆరోపణలొచ్చిన ఈ కేసులో తన వ్యవహారశైలిపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు ఆ సంస్థ సంజాయిషీ ఇచ్చుకోకతప్పదు.
Comments
Please login to add a commentAdd a comment