patiala court
-
Air India pee-gate: ఇంతకు ఇంత అనుభవిస్తావు!
న్యూఢిల్లీ: న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీలోని పటియాలా కోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా నిందితుడిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని శంకర్ మిశ్రా ఆరోపించాడు. తనకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, సాక్ష్యులను ప్రభావితం చేసే స్థాయిలో లేనని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరాడు. అయితే.. కేసు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. పైగా ఓ మహిళ పట్ల నిందితుడు వ్యవహరించిన తీరు ఏమాత్రం సహించరానిదని తెలిపింది. అంతకు ముందు శంకర్ మిశ్రా తరపు న్యాయవాది వాదిస్తూ.. శంకర్ మిశ్రా లైంగిక కోరికలతోనో లేదంటే ఆమె పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాలనో అలా ప్రవర్తించలేదని వాదించాడు. అయితే.. బాధితురాలి తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్‌ను బెదిరించారనే విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడి తండ్రి.. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపించాడని, చేసినదానికి ఇంతకు ఇంత అనుభవిస్తావు అంటూ మెసేజ్‌లు పెట్టి డిలీట్ చేశాడని, పైగా నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించే యత్నం కూడా చేశారని తెలిపారు. దీంతో బెయిల్‌ను నిరాకరించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోమల్ గార్గ్.. శంకర్ మిశ్రాకు బెయిల్ నిరాకరించారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు పోలీసులు శంకర్ మిశ్రాను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించకుండా జ్యూడీషియల్ కస్టడీ విధించింది. -
Navjot Sidhu: పటియాలా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
ఛండీగఢ్: మాజీ క్రికెటర్, పంజాబ్ కాంగ్రెస్ నేతనవజ్యోత్ సింగ్ సిద్ధూ శుక్రవారం మధ్యాహ్నం పటియాల జిల్లా కోర్టు ముందు లొంగిపోయారు. 1988లో నమోదైన ఓ కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా తక్షణమే కోర్టు ముందు లొంగిపోవాలని కూడా సిద్ధూకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ నేపథ్యంలో కోర్టు ముందు లొంగిపోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన సిద్ధూ... అనారోగ్య కారణాల వల్ల తాను లొంగిపోయేందుకు కొంత సమయం ఇవ్వాలంటూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన బెంచ్.. ఈ కేసులో ప్రత్యేక బెంచ్ తీర్పు ఇచ్చినందున తాము జోక్యం చేసుకోలేమని తేల్చేసింది. సుప్రీంకోర్టు సీజే నేతృత్వంలోని బెంచ్ ను ఆశ్రయించాలని సూచించింది. సుప్రీంకోర్టు నుంచి ఈ మాట వినిపించినంతనే శుక్రవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన సిద్ధూ..పటియాల కోర్టు ముందు లొంగిపోయారు. Patiala, Punjab | He (Navjot Singh Sidhu) has surrendered himself before Chief Judicial Magistrate. He is under judicial custody. Medical examination and other legal procedures will be adopted: Surinder Dalla, media advisor to Congress leader Navjot Singh Sidhu pic.twitter.com/U13TDDOPju — ANI (@ANI) May 20, 2022 -
నిర్భయ నలుగురు దోషులను ఒకేసారి ఉరి
-
నిర్భయ దోషుల ఉరిశిక్ష తేదీ ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార, హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారైంది. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులు వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ సింగ్‌లను ఉరితీయాలని ఢిల్లీలోని పటియాల హౌస్ కోర్టు సోమవారం కొత్త డెత్‌వారెంట్లు జారీచేసింది. నలుగురు దోషులను ఒకేసారి ఉరితీయాలని జైలు అధికారులను ఆదేశించింది. ప్రస్తుతం వారున్న తీహార్ జైలులోనే వారిని ఉరితీయనున్నారు. కాగా జనవరి 22, ఫిబ్రవరి 1 దోషుల ఉరిశిక్ష అమలుకై రెండుసార్లు డెత్ వారెంట్లు జారీ అయినప్పటికీ.. వారు వరుసగా పిటిషన్లు దాఖలు చేస్తూ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. అయితే దోషులకు వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలంటూ కేంద్ర హోంశాఖ ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దోషుల తీరుపై న్యాయస్థానం కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పటియాల కోర్టు దోషులను ఉరితీయాలంటూ తాజాగా డెత్‌వారెంట్లు జారీచేసింది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో.. ఈసారైనా ఉరిశిక్ష అమలు అవుతుందా లేదా అనేది అసక్తికరంగా మారింది. -
చిదంబరానికి సీబీఐ షాక్
-
చిదంబరానికి సీబీఐ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ఎయిర్‌సెల్ మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరానికి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చినట్టు సీబీఐ సోమవారం పటియాలా హౌస్ కోర్టుకు తెలిపింది. ఎయిర్‌సెల్-మ్యాక్సిస్ కేసు విచారణను చేపట్టిన ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి ఓపీ సైనీకి ఈ మేరకు సీబీఐ స్పష్టం చేసింది. చిదంబరంను ఈ వ్యవహారంలో ప్రాసిక్యూట్ చేసేందుకు దర్యాప్తు ఏజెన్సీ అనుమతించిన పత్రాలను సీబీఐ, ఈడీల తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితుల్లో ఆరుగురికి ప్రాసిక్యూషన్ అనుమతులు అవసరమని మెహతా తెలిపారు. మిగిలిన ఐదుగురు నిందితుల ప్రాసిక్యూషన్ కోసం అనుమతులు పొందే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్ట్ నుంచి ఉపశమనం ఇస్తూ చిదంబరం, ఆయన కుమారుడు కార్తీ చిదంబరంలకు డిసెంబర్ 18 వరకూ కోర్టు మధ్యంతర ఊరట కల్పించింది. కాగా, తనను కుట్రపూరితంగా అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని తనపై ఆరోపణలన్నీ కట్టుకథలుగా చిదంబరం కోర్టుకు నివేదించారు. -
దలేర్ మెహందీని దోషిగా తేల్చిన కోర్టు
-
దలేర్ మెహందీని దోషిగా తేల్చిన కోర్టు
ప్రముఖ బాంగ్రా పాప్ గాయకుడు దలేర్ మెహందీని మనుషుల అక్రమ రవాణా కేసులో పాటియాలా కోర్టు దోషిగా తేల్చింది. తన మ్యూజికల్ ట్రూప్ విదేశాల్లో చేసే కార్యక్రమాల్లో భాగంగా అక్కడి వెళ్లే వారితో పాటు.. కొంత మందిని అక్రమంగా విదేశాలకు తీసుకెళ్లినట్టుగా 2003లో దలేర్ మెహందీ, అతని సోదరుడు షంషేర్ సింగ్‌లపై కేసు నమోదైంది. యూఎస్, యూకే, కెనడా లతో పాటు మరికొన్ని దేశాలకు దలేర్ మనుషులను తీసుకెళ్లినట్టుగా ఆరోపణలు వచ్చాయి. దలేర్‌కు వ్యతిరేకంగా 31 కేసులు నమోదు కావటంతో గతంలో పాటియాలా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. తరువాత బెయిల్ పై విడుదలైన దలేర్ ఇన్నేళ్లుగా విచారణను ఎదుర్కొంటున్నారు. తాజాగా దలేర్ మెహందీని దోషిగా తేల్చిన పాటియాలా కోర్ట్ ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విదిస్తూ తీర్పు నిచ్చింది. ప్రస్తుతం దలేర్‌తో పాటు ఆయన సోదరుడు షంషేర్ సింగ్ పాటియాలా కోర్ట్ కస్టడీలో ఉన్నారు. -
పటియాల కోర్టులో కార్తీ చిదంబరం
-
ఏమీ లేదు.. స్కామే లేదు
న్యూఢిల్లీ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 1.76 లక్షల కోట్ల స్కాం! స్వతంత్ర భారతదేశంలో ఇంతపెద్ద కుంభకోణమే లేదు.. ఇది అవినీతి విశ్వరూపం.. 2జీ స్కాంపై ఇన్నేళ్లుగా వినిపించిన ఆరోపణలివీ! ఈ కేసు ఓ సంచలనం.. గత ఎన్నికల్లో అధికారపక్షాన్ని కడిగేసేందుకు ప్రతిపక్షాలకు దొరికిన ప్రధాన అస్త్రం!! కానీ ఆ స్కామ్ అంతా ఉత్తిదే అని తేలిపోయింది. ఏమీ లేని చోట ‘స్కామ్’ను సృష్టించినట్లు స్పష్టమైంది. ఏడేళ్లపాటు ఈ కేసును సుదీర్ఘంగా విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ‘‘కొందరు కొన్ని వివరాలను తెలివిగా అటూఇటూ మార్చి ఏమీ లేని చోట స్కామ్ సృష్టించారు’’ అని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ ఉద్ఘాటించారు. 2జీకి సంబంధించి నమోదైన మూడు కేసుల్లో నిందితులపై ఒక్క అభియోగాన్ని కూడా ప్రాసిక్యూషన్ నిరూపించలేకపోయిందని, సరైన ఆధారం ఒక్కటి కూడా తమ ముందు ఉంచలేదని ఆయన స్పష్టంచేశారు. సీబీఐ నమోదు చేసిన ప్రధాన కేసులో టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా మొత్తం 17 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులపై నేరారోపణలను రుజువు చేయడంలో ప్రాసిక్యూషన్ దారుణంగా విఫలమైందని న్యాయమూర్తి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సుల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలతో ఖజానాకు రూ.1.76 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందంటూ 2010లో కాగ్ నివేదిక ఇవ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. 2008లో యూపీఏ ప్రభుత్వం ‘ముందొచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన 8 కంపెనీలకు 122 2జీ స్పెక్ట్రమ్ లైసెన్సులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ విధానంతో ఖజానాకు పెద్దమొత్తంలో నష్టం వాటిల్లిందని, లైసెన్సులు పొందినవారికి అనుచిత లబ్ధి చేకూరిందని కాగ్ నివేదిక ఇవ్వడంతో దేశంలో పెద్ద దుమారం రేగింది. మంత్రి పదవికి ఎ.రాజా రాజీనామా చేశారు. 2011లో ఆయన్ను సీబీఐ ఆరెస్ట్ చేసింది. 15 నెలలపాలు జైల్లో ఉన్నారు. ఇదే కేసులో డీఎంకే అధినేత కరుణానిధి తనయ కనిమొళికి కూడా ఆరు నెలలపాటు జైల్లో ఉన్నారు. 2012లో సుప్రీంకోర్టు సైతం 122 2జీ లైసెన్సులను రద్దు చేసింది. ఒక్క ఆధారం చూపలేదు.. ‘‘నిందితుల్లో ఒక్కరిపై కూడా ప్రాసిక్యూషన్ అభియోగాన్ని నిరూపించలేకపోయింది. ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. నేను దాదాపు ఏడేళ్ల నుంచి వేసవి సెలవులతోపాటు అన్ని పనిదినాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఓపిగ్గా వాదనలు విన్నా. ప్రాసిక్యూషన్ నుంచి ఒక్కరైనా చట్టం ముందు నిలిచే ఆధారాలు పట్టుకొస్తారని ఎదురుచూశా. కానీ ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది..’’ అని తన 2,183 పేజీల తీర్పులో న్యాయమూర్తి ఓపీ సైనీ వ్యాఖ్యానించారు. కోర్టుకు సమర్పించిన వివరాల్లో కూడా అనేక తప్పులున్నాయని చెప్పారు. కొందరు కొంత సమాచారాన్ని అటూఇటూ మార్చేసి లేని చోట కుంభకోణాన్ని సృష్టించారన్నారు. ‘‘చార్జిషీట్లో పేర్కొన్న అనేక వివరాలు కూడా చివరికి అవాస్తవాలని తేలాయి. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎంట్రీ ఫీజును మార్చాలని సిఫారసు చేశారని, ఎల్వోఐ(లెటర్ ఆఫ్ ఇంటెంట్)లో ఓ క్లాజ్‌ను రాజా తొలగించారని చెప్పారు. కానీ విచారణలో అదంతా అవాస్తవమని తేలింది’’ అని వివరించారు. 3 కేసులు.. 35 మంది నిందితులు సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం 2జీకి సంబంధించి మూడు కేసుల్లో తీర్పు చెప్పింది. ఇందులో పలు కంపెనీలు సహా మొత్తం 35 మంది నిందితులున్నారు. ఈ మూడింట్లో సీబీఐ దాఖలు చేసిన కేసు (17 మంది నిందితులు) ప్రధానమైనది. ఇందులో రాజా, కనిమొళితోపాటు టెలికం మాజీ కార్యదర్శి సిద్ధార్థ్ బెహురా, రాజా మాజీ వ్యక్తిగత కార్యదర్శి ఆర్కే చందోలియా, స్వాన్ టెలికం ప్రమోటర్లు షాహిద్ ఉస్మాన్ బల్వా, వినోద్ గొయాంక, యునిటెక్ కంపెనీ ఎండీ సంజయ్ చంద్ర, రిలయెన్స్ అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్(ఆర్‌ఏడీఏజీ)కు చెందిన ముగ్గురు ఉన్నత ఉద్యోగులు గౌతమ్ దోషి, సురేంద్ర పిపరా, హరి నాయర్లను న్యాయస్థానం నిర్దోషులుగా ప్రకటించింది. ఇక రెండో కేసు ఈడీ నమోదు చేసినది. రూ.200 కోట్ల మనీలాండరింగ్ జరిగిందంటూ రాజా, కనిమొళిపై ఈడీ ఈ కేసు పెట్టింది. స్వాన్ టెలికం కంపెనీ ప్రమోటర్లు డీఎంకేకు చెందిన కలైంజర్ టీవీ చానల్‌కు ఈ మొత్తాన్ని లంచంగా ముట్టజెప్పినట్టు అభియోగం మోపింది. చార్జిషీట్లో డీఎంకే అధినేత కరుణానిధి సతీమణి దయాళు అమ్మాళ్ పేరును కూడా చేర్చింది. ఇందులో రాజా, కనిమొళి సహా కుసేగావ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కంపెనీకి చెందిన రాజీవ్ అగర్వాల్, చిత్ర నిర్మాత కరీం మొరానీ, కలైంజర్ టీవీ డైరెక్టర్ శరద్ కుమార్, పి.అమృతం తదితరులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. ప్రధాన కేసు దర్యాప్తు క్రమంలో సీబీఐ మూడో కేసు నమోదు చేసింది. ఇందులో ఎస్సార్ ప్రమోటర్లు రవికాంత్ రుయా, అన్షుమన్ రుయా సహా మరో ఆరుగురిని నిందితులుగా చేర్చినా.. కోర్టు వారని కూడా నిర్దోషులుగా తేల్చింది. రాజకీయ చిటపటలు తీర్పు వెలువడగానే రాజా, కనిమొళి హర్షం వ్యక్తంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ వాగ్బాణాలు సంధించుకున్నాయి. ఎట్టకేలకు న్యాయం నెగ్గిందని డీఎంకే పేర్కొనగా.. తీర్పుపై ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేయాలని ఈ కేసులో మొదట్నుంచీ న్యాయపోరాటం చేస్తున్న బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. ఇక 2జీపై నివేదిక ఇచ్చిన మాజీ కాగ్ వినోద్ రాయ్‌పై కాంగ్రెస్ నిప్పులు చెరిగింది. ఆయన తక్షణమే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు ప్రధాని మోదీ, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, బీజేపీ నేతలు జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టు తీర్పును గౌరవించాలని, తమ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలతో బురద చల్లినట్టు తేలిందని మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ అన్నారు. ఈ తీర్పే అంతిమం కాదని, దీన్ని తమ నిజాయతీకి చిహ్నంగా కాంగ్రెస్ వాడుకోవద్దంటూ బీజేపీ దుయ్యబట్టింది. అప్పీలు చేస్తాం: సీబీఐ, ఈడీ తమకు ఇంకా తీర్పు పూర్తి పాఠం అందలేదని, అది చేతికి రాగానే అధ్యయనం చేసి ఢిల్లీ హైకోర్టులో అప్పీలు చేస్తామని సీబీఐ, ఈడీ వెల్లడించాయి. -
సీబీఐ ఇప్పుడేం చెబుతుంది?
మన టెలికాం పరిశ్రమ 5జీ స్పెక్ట్రమ్‌కు చేరుకుంటున్న తరుణంలో దాదాపు దశాబ్దకాలం నాటి 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో పటియాలా సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు, కేంద్ర టెలి కాం శాఖ మాజీ మంత్రి అండిముత్తు రాజా, డీఎంకే ఎంపీ కనిమొళితోపాటు మరో 15మంది నిందితులు కూడా నిర్దోషులని ప్రకటించింది. వీరిలో టెలికాం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఆరోపణలొచ్చిన టెలికాం సంస్థలు సైతం కేసు నుంచి విముక్తమయ్యాయి. సీబీఐ కేసుల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట రేట్(ఈడీ) దాఖలుచేసిన మనీలాండరింగ్ ఆరోపణల కేసు కూడా వీగిపోయింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో ఏడేళ్లపాటు కొనసాగిన ఈ కేసు మన దేశంలో కేసుల తీరు, దర్యాప్తు ప్రక్రియ ఎలా ఉంటాయో నిరూపించింది. కుంభకోణం పర్యవసానంగా ప్రభుత్వ ఖజానా రూ. 1,76,000 కోట్ల మేర నష్టపోయిందని సాక్షాత్తూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) మదింపు వేసిన కేసు ఫలితమే ఇలా ఉన్నదంటే అది సీబీఐ పనితీరుకు అద్దం పడుతుంది. ప్రత్యేక న్యాయస్థానం ఇప్పుడిచ్చిన తీర్పు తుది తీర్పేమీ కాదు. దీనిపై తాము అప్పీల్‌కు వెళ్తామని సీబీఐ ప్రకటించింది. ఆ సంగతలా ఉంచి ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఓపీ సైనీ తీర్పు వెలువరిస్తూ చేసిన వ్యాఖ్యలు గమనించదగినవి. ‘ఈ ఏడేళ్లూ నేను అన్ని పని దినాల్లోనూ న్యాయస్థానా నికి హాజరయ్యాను. ఆఖరికి వేసవి సెలవులను కూడా వదులుకున్నాను. ఈ రోజు లన్నిటా ఉదయం 10 గంటలు మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకూ న్యాయస్థానంలో కేసును విచారించాను. కానీ పరిగణనలోకి తీసుకోదగిన ఒక్క సాక్ష్యాధారాన్ని కూడా సీబీఐ ప్రవేశపెట్టలేకపోయింది’ అని చెప్పారు. తీర్పు వెలువడ్డాక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ‘మా ప్రభుత్వానికి వ్యతి రేకంగా తీవ్ర స్థాయిలో చేసిన దుష్ప్రచారమంతా నిరాధారమని తేలిపోయింది’ అన్నారు. అయితే ఈ వ్యవహారం ఇంతవరకూ రావడానికి ఆయన నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వం ధోరణి కూడా కారణమని చెప్పకతప్పదు. 2007లో 2జీ స్పెక్ట్రమ్ లైసెన్స్‌లకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమై 2008 జనవరి 10న అప్పటి టెలికాం మంత్రి రాజా 122 లైసెన్స్‌లు జారీ చేసిన కొన్ని నెలలకే ఆ విషయంలో ఫిర్యాదులు రావడం మొదలైంది. మొదట్లో వివిధ రంగాల్లో పనిచేసిన ప్రముఖులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇదొక పెద్ద కుంభకోణమని, దర్యాప్తు చేయడం అవసరమని టెలికాం వ్యవహారాలపై నిఘా ఉంచే ఓ స్వచ్ఛంద సంస్థ 2009 మే 4న సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కి ఫిర్యాదు చేసింది. ఈలోగా ఎస్–టెల్ సంస్థ లైసెన్స్‌ల కేటాయింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2010 నవంబర్‌లో కాగ్ నివేదిక 2జీ స్పెక్ట్రమ్ కేటా యింపుల్లో భారీయెత్తున నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ పరిణామాలు వెల్లడైన ప్పుడు వెనువెంటనే రంగంలోకి దిగాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. మొత్తం వ్యవహారంలో ఏమైందో తెలుసుకుని దాన్ని ప్రజల ముందుంచడం, లోపా లను సరిచేయడం... ఏమీ లేదనుకుంటే ఆ సంగతే తేటతెల్లం చేయడం జరగాలి. కానీ విపక్షాల ఒత్తిడి తర్వాత రాజాతో మంత్రి పదవికి రాజీనామా చేయించడం మినహా ప్రభుత్వం ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. ఈ తీరు అనేక అనుమానాలకు ఆస్కారమిచ్చింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సీబీఐ విచారణకు ఆదేశించి, తానే స్వయంగా పర్యవేక్షిస్తానని చెప్పింది. ఈ 122 లైసెన్స్‌లనూ రద్దు చేసింది. మరోపక్క కాగ్ నివేదిక వెలువడ్డాక దానిపై దర్యాప్తునకు జాయింట్ పార్లమెంటరీ సంఘం(జేపీసీ) నియమించాలని ఆనాడు విపక్షంలో ఉన్న బీజేపీ, మరికొన్ని పార్టీలు పట్టుబడితే పెడచెవిన పెట్టింది. బీజేపీ నాయకుడు మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలోని ప్రజా పద్దుల సంఘం(పీఏసీ) ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తున్నది గనుక కొత్తగా జేపీసీ అవసరం లేదన్న తర్కానికి దిగింది. ఈ వివాదం పర్య వసానంగా పార్లమెంటు శీతాకాల సమావేశాలు తుడిచిపెట్టుకు పోయాయి. కానీ బడ్జెట్ సమావేశాల నాటికల్లా ప్రభుత్వం దిగొచ్చింది. జేపీసీ నియామకానికి అంగీ కరించింది. ఈసారి మరో కొత్త తర్కాన్ని తెరమీదకు తెచ్చింది. పీఏసీ నివేదిక రాబోతున్న తరుణంలో... జేపీసీ పరిశీలిస్తుంది గనుక ఇక పీఏసీ అవసరం లేదని వాదించింది. ఇలా మర్కట తర్కాన్ని మరపిస్తూ చేసిన వాదనలన్నీ ప్రభుత్వం ‘ఏదో’ దాచడానికి ప్రయత్నిస్తున్నదన్న అభిప్రాయాన్ని కలగజేశాయి. అటు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక్కసారంటే ఒక్కసారి కూడా ఈ వ్యవహారం గురించి మాట్లాడలేదు. ట్రాయ్ చైర్మన్‌గా పనిచేసిన ప్రదీప్ బైజాల్ 2జీ స్పెక్ట్రమ్ స్కాంపై 2015లో పుస్తకం వెలువరించినప్పుడు మాత్రం ‘నేను గానీ, నా కుటుంబం లేదా మిత్రులుగానీ ప్రధాని పదవిని అడ్డుపెట్టుకుని సంపద పోగేయాలనుకోలేద’ని ఆయన చెప్పారు. ఈ కేసులో దాఖలు చేసిన చార్జిషీటు... లిఖితపూర్వకంగా, మౌఖికంగా ప్రాసిక్యూషన్ తన ముందుంచిన వాదనలు, ప్రాసిక్యూటర్ల వ్యవహారశైలి వగైరా లపై తన 1,552 పేజీల తీర్పులో న్యాయమూర్తి చేసిన తీవ్ర వ్యాఖ్యలు తీవ్రమైనవి. టెలికమ్యూనికేషన్ల విభాగం తీసుకున్న, తీసుకోని చర్యలు సృష్టించిన అయో మయం క్రమేపీ పెరిగి పెద్దదై ఏమీ లేనిచోట ఏదో పెద్ద కుంభకోణం జరిగిందన్న అభిప్రాయం ప్రతివారిలోనూ ఏర్పడేలా చేసిందని తీర్పు అభిప్రాయపడింది. నింది తులు పాల్పడ్డారంటున్న చర్యల్లోని అపరాధాన్ని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాలు ఈ కేసులో లేవని తేల్చింది. కోర్టుకు దాఖలు చేసిన పత్రాలపై సంతకాలు చేయడానికి కూడా ముందుకురాని ప్రాసిక్యూటర్ల తీరుపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. ఎవరెన్ని చెప్పినా, ఆరోపణలు చేసినా న్యాయస్థానాలకు అంతిమంగా కావలసింది సంశయాతీతమైన సాక్ష్యాధారాలు. ఇంత సుదీర్ఘ సమయం తీసుకుని కూడా వాటిని అందజేయలేక సీబీఐ చతికిలబడింది. ఖజానాకు భారీ నష్టం వాటి ల్లిందని ఆరోపణలొచ్చిన ఈ కేసులో తన వ్యవహారశైలిపై న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలకు ఆ సంస్థ సంజాయిషీ ఇచ్చుకోకతప్పదు. -
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో సంచలన తీర్పు
-
2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం : సంచలన తీర్పు
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో నిందితులు రాజా, కనిమొళిలు సహా అందరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ పటియాలా కోర్టు తీర్పు వెలువరించింది. పటియాలా కోర్టు తీర్పుతో డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. మరోవైపు నిందితులకు శిక్ష విధించడంలో న్యాయవ్యవస్థ విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ఈ రెండుసార్లూ మిత్రపక్షమైన డీఎంకేకు కేంద్ర మంత్రివర్గంలో ప్రత్యేక ప్రాధాన్యతే లభించింది. తమ పార్టీ నేతల వ్యాపార అవసరాలకు అనుగుణమైన మంత్రిత్వ శాఖలనే కరుణానిధి పట్టుపట్టి కేంద్రం నుంచి సాధించుకున్నారు. ఇందులో భాగంగానే డీఎంకేకి చెందిన రాజా టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సమయంలో 2జీ స్పెక్ట్రం కేటాయింపుల్లో భారీ అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2జీ స్పెక్ట్రం అక్రమ కేటాయింపుల వల్ల రూ.1.76 లక్షల కోట్లు నష్టం ఏర్పడినట్లు కేంద్ర ప్రభుత్వానికి కాగ్ ఒక నివేదిక సమర్పించింది. భారీ మొత్తంలో కుంభకోణం కావడంతో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రెండు కేసులు పెట్టింది. అలాగే ఎన్ఫోర్సుమెంటు డైరక్టరేట్ (ఈడీ) మరో కేసు నమోదు చేసింది. సీబీఐ పెట్టిన రెండు కేసుల్లో రాజా, డీఎంకే అధినేత కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి తదితరులు చిక్కుకున్నారు. వీరితోపాటు టెలికమ్యూనికేషన్స్ మాజీ కార్యదర్శి సిద్దార్థ్ బెహురా, రాజా మాజీ ప్రయివేటు కార్యదర్శి ఆర్కే సంతాలియా తదితర 14 మందిపై చార్జిషీటు దాఖలైంది. పదేళ్ల క్రితం నాటి 2జీ స్పెక్ట్రం కుంభకోణం అప్రతిష్టపాలు చేసిన ఫలితంగా యూపీఏ ప్రభుత్వం గడిచిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. -
నేషనల్ హెరాల్డ్ కేసు.. చిన్న బ్రేక్!
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు మరోసారి తాత్కాలిక ఊరట లభించింది. నేషనల్ హెరాల్డ్ కేసు తిరిగి విచారణ ప్రారంభించిన పటియాలా కోర్టు తదుపరి వాదనలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. శనివారం కేసు విచారణకు బెంచ్ ముందుకు రాగా, నంబర్ 18వ తేదీకి వాయిదాస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి, మరికొందరు 2012లో దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా నేషనల్ హెరాల్డ్ స్కాం వెలుగులోకి వచ్చింది. సంచలనం రేపిన ఈ స్కాంలో సోనియా, రాహల్‌తోపాటు మరో నలుగురు కాంగ్రెస్ కీలక నేతలపై కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు జూలై 1న నిందితులను వివరణ కోరగా.. 22న సోనియా, రాహుల్‌లు సమాధానం ఇచ్చిన విషయం తెలిసిందే. యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి అధికార పక్షం దాదాపు 90 కోట్ల రుణాన్ని ది నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ యాజమాన్య సంస్థ అసోషియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు అప్పనంగా కట్టబెట్టిందంటూ సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ వస్తున్నారు. నిందితులుగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ కోశాధికారి మోతీలాల్ వోరా, పార్టీ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దూబె, శామ్ పిట్రోడాల పేర్లను స్వామి పేర్కొన్నారు. -
స్మృతి ఇరానీని వేధించేందుకే: కోర్టు
-
స్మృతి ఇరానీని వేధించేందుకే: కోర్టు
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ కేసు వివాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో స్మృతి తన విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను మంగళవారం పాటియాల కోర్టు కొట్టివేసింది. ఆమెకు సమన్లు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. కేంద్ర మంత్రి కావడం వల్లే ఆమెను వేధించేందుకు కేసు వేశారని కోర్టు అభిప్రాయపడింది. గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా స్మృతి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో బీఏ చదివినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి 1996లో డిగ్రీ పట్టా అందుకున్నట్టు వెల్లడించారు. అయితే ఆమె ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకోలేదని ఫ్రీలాన్స్ రచయిత కేసు వేయడంతో వివాదం ఏర్పడింది. -
గిలానీకి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
న్యూఢిల్లీ: దేశద్రోహం కేసు ఎదుర్కొంటున్న ఢిల్లీ వర్సిటీ మాజీ లెక్చరర్ గిలానీకి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ గురువారం ఉత్తర్వులిచ్చారు. పటియాలా కోర్టుకు తెస్తే ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందని, అందువల్ల అక్కడికి 7 కి.మీ. దూరంలో ఉన్న చాణక్యపురి పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరపాల్సిందిగా పోలీసులు కోరారు. అందుకు అంగీకరించిన మేజిస్ట్రేట్ ఉదయమే అక్కడికి వెళ్లారు. తర్వాత తీహార్ జైలుకు తరలించారు. -
కోర్టులో లాయర్ల రౌడీయిజం
రణరంగంగా పటియాలా కోర్టు ♦ జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ విచారణ సందర్భంగా విధ్వంసం ♦ విద్యార్థులు, జర్నలిస్టులను వెంటాడి కొట్టిన లాయర్లు ♦ కన్హయ్య కుమార్‌పైనా దాడి ♦ సుప్రీంకోర్టు ప్రతినిధులపైనా దాడి ♦ కన్హయ్యకు మార్చి 2దాకా రిమాండ్ న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టులో లాయర్లు మరోసారి రెచ్చిపోయారు. నల్లకోట్లు ధరించి మరీ గూండాల్లా వ్యవహరించారు. కోర్టు ప్రాంగణంలోనే గుంపులుగా తిరగుతూ జేఎన్‌యూ విద్యార్థులు, లెక్చరర్లు, జర్నలిస్టులు, ప్రత్యర్థి లాయర్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. రాజద్రోహం కేసులో విచారణకు హాజరవుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌పైనా చేయి చేసుకున్నారు. దాంతో, ఆయన ముఖం, కాళ్లపై చిన్న గాయాలయ్యాయి. కోర్టు ఆవరణలో శాంతిభద్రతలు నెలకొల్పాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. బుధవారం పటియాలా కోర్టును రణరంగంగా మార్చారు. సుప్రీం కోర్టు పంపించిన సీనియర్ లాయర్లపై పూల కుండీలు, నీళ్ల సీసాలు విసిరారు. పోలీసులు మళ్లీ ప్రేక్షక పాత్రే పోషించారు. విచారణ అనంతరం కన్హయ్యకుమార్‌ను మార్చి 2 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్లీన్ తీర్పునిచ్చారు. సోమవారం దాడి చేసిన వారే జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు కోర్టు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో విచారణ నిమిత్తం పటియాలా కోర్టులో బుధవారం ఆయనను హాజరు పర్చారు. రెండు రోజుల క్రితం పటియాలా కోర్టులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, కోర్టు ప్రాంగణంలో శాంతి నెలకొనేలా చూడాలంటూ బుధవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దాంతో పెద్ద ఎత్తున కోర్టు వద్ద పోలీసులను మోహరించారు. అయినా, కొందరు లాయర్లు ర్యాలీగా కోర్టు వద్దకు వచ్చి, కోర్టు ప్రాంగణంలోకి చొచ్చుకురాగలిగారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని, వందేమాతరం, జై భారతమాత అని నినాదాలు చేస్తూ.. దాడులకు దిగారు. సోమవారం నాటి దాడుల్లో కీలక పాత్ర పోషించిన లాయర్ విక్రమ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని లాయర్ల బృందం బుధవారం నాటి దాడుల్లో కూడా క్రియాశీలంగా కనిపించింది. కన్హయ్యకు అనుకూలంగా తమతో వాదనకు దిగిన లాయర్లపైనా వీరు దాడి చేశారు. జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ దాడులను చిత్రిస్తున్న మీడియా ప్రతినిధులనూ వదల్లేదు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను లాక్కొని, అందులోని వీడియోలను తొలగించి, ఆ ఫోన్లను నాశనం చేశారు. కెమెరామెన్లపై రాళ్లతో దాడి చేశారు. ఇంతలో, కన్హయ్యకుమార్‌ను తీసుకువస్తున్న పోలీసు వాహనం కోర్టు ప్రాంగణంలోకి రావడంతో, అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న లాయర్ల బృందం కన్హయ్య కుమార్‌పై దాడికి తెగబడింది. కోర్టు ప్రాంగణంలో, కోర్టు హాలు వెలుపల రెండుసార్లు ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్లీన్ సమక్షంలో కన్హయ్యకుమార్పై విచారణ జరి గింది. కోర్టుహాల్లోకి కేవలం ఆరుగురు లాయర్లు, ఒక జేఎన్‌యూ ప్రొఫెసర్, ఐదుగురు జర్నలిస్టులను మాత్రం అనుమతించారు. ఈ సందర్భంగా, తాను నూరుశాతం భారతీయుడినని, రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై తనకు గౌరవముందని కన్హయ్య కోర్టుకు తెలిపాడు. ‘నాపై మీడియా చేస్తున్న విచారణ బాధాకరం. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటే నన్ను జైలుకు పంపండి. లేదంటే, ఈ మీడియా విచారణను ఆపేయండి’ అన్నారు. కోర్టులో తనపై జరిగిన దాడిని కన్హయ్యకుమార్ మెజిస్ట్రేట్‌కు వివరించారు. దాంతో, పటిష్ట భద్రత మధ్య ఆయనను తీహార్ జైలుకు పంపించాలని మెజిస్ట్రేట్ ఆదేశించా రు. వెలుపల లాయర్లు పెద్ద ఎత్తున గుమికూడి ఉండటంతో.. విచారణ తర్వాతమరో 3 గంటల పాటు కన్హయ్యకుమార్ కోర్టుహాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఢిల్లీ పోలీసుల వైఫల్యం పటియాలా కోర్టు ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుంది. దీనికి కేవలం ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీనే వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని కఠినంగా వ్యాఖ్యానించింది. బుధవారం ఉదయమే పటియాలా కోర్టులో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలంటూ సుప్రీం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు సరిగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు పటియాలా కోర్టుకు వెళ్లాలని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. కొద్ది గంటల తరువాత, ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ పటియాలా కోర్టులో చోటు చేసుకున్న దాడులను తమ దృష్టికి తీసుకురాగా వెంటనే కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే తదితర ఆరుగురు సీనియర్ లాయర్ల బృందాన్ని సుప్రీంకోర్టు పటియాలా కోర్టుకు పంపించింది. వారికీ స్థానిక లాయర్లు దూషణలతో స్వాగతం పలికారు. వారిపైకి నీళ్ల సీసాలను, పూల కుండీలను విసిరారు. అనంతరం, ఆ బృందం తమ నివేదికను సుప్రీంకోర్టుకు మౌఖికంగా అందించింది. కోర్టుహాల్లో కూడా ఒక వ్యక్తి కన్హయ్యకుమార్పై దాడి చేశాడని, కన్హయ్య ఆ వ్యక్తిని గుర్తించినప్పటికీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదన్నారు. ఈ వివరాలను గురువారం మధ్యాహ్నం లిఖితపూర్వకంగా అందించాలని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం వారిని కోరింది. ఢిల్లీ పోలీసుల తరఫు వివరణను గురువారం ఉదయం అందించాలని ఢిల్లీ పోలీస్‌లను ఆదేశించింది. కాగా, కన్హయ్యకు అనుకూలంగా జేఎన్‌యూ లోని ముగ్గురు ఏబీవీపీ సభ్యులు సంస్థకు రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ వర్సిటీలో అఫ్జల్ అనుకూల, వ్యతిరేక (ఏబీవీపీ) వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇది వలస పాలన చీకటి యుగానికి నకలు చామ్స్కీ, పాముక్ సహా మేధావుల ఖండన న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ అరెస్ట్‌పై వెల్లువెత్తిన నిరసనతో.. విఖ్యాత మేధావి నోమ్ చామ్స్కీ, నోబెల్ బహుమతి గ్రహీత ఓర్హాన్ పాముక్ సహా ప్రపంచ వ్యాప్తం గా శాస్త్రవేత్తలు, రచయితలు గళం కలిపారు. విదేశాల్లోని ప్రముఖ వర్సిటీలకు చెందిన 86 మంది విద్యావేత్తలు.. ‘భారత్‌లో ప్రస్తుత ప్రభుత్వం సృష్టించిన అధికార దురహంకార సంస్కృతి’ని ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. అధికారంలో ఉన్నవారు అణచివేతపూరిత వలసరాజ్య కాలం నాటి, 70ల మధ్యలోని అత్యవసర పరిస్థితి కాలం నాటి చీకటి యుగానికి నకలును తీసుకొస్తున్నారని తప్పుపట్టారు. ‘భారతదేశ వలస పాలకులు రూపొందించిన దేశద్రోహ చట్టాలను విధించి.. జేఎన్ యూ క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించాలని ఆదేశించి, విద్యార్థి నేతను..హింసను ప్రేరేపించారన్న అభియోగంపై ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన సిగ్గుచేటయిన చర్య గురించి తెలుసుకున్నాం’ అని ధ్వజమెత్తారు. కన్హయ్యపై దాడి జరగలేదు కన్హయ్యకుమార్పై దాడి జరగనేలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. ‘ఆయనపై దాడి జరగలేదు. కాస్త తోపులాట జరిగింది. అంతే. పరిస్థితిని పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. లాయర్లకు వ్యతిరేకంగా బలగాలను మోహరిస్తే పరిస్థితి మరింత దారుణమయ్యేది’అన్నారు. కన్హయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలున్నాయన్నారు. ఆయనకు క్లీన్ చిట్ లభించే ప్రశ్నేలేదన్నారు. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలోకి ఇతరులూ ప్రవేశించారని, మొత్తం ఘటనకు బాధ్యుడిని గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ‘దేవుడా.. నీ ప్రపంచం ఎలా అయిపోయిందో చూడు.. మనిషిఎంతగా మారి పోయాడో చూడు’ అనే కవిత గుర్తొస్తోందని బస్సీ వ్యాఖ్యానించారు. కన్హయ్యకు కోర్టు బెయి ల్ ఇవ్వాలనుకుంటే అభ్యంతరం తెలపబోమన్నారు. కాగా, పటియాలాకోర్టు ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీ పోలీసులను నివేదిక కోరింది. జేఎన్‌యూలో పోలీసు చర్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు, జేఎన్‌యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది. -
మరో రెండు వారాలు కేజ్రీవాల్ జైల్లోనే
లక్నో : ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు వారాలు జైల్లోనే ఉండనున్నారు. పాటియాలా న్యాయస్థానం ఆయనకు జూన్ 6వ తేదీ వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. బీజేపీ నేత నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరు కానందుకు 10 వేల రూపాయల బాండ్ చెల్లించి బెయిల్ పొందాలని కోర్టు ఆదేశించినా... పూచీకత్తు రుసుము చెల్లించడానికి కేజ్రీవాల్ నిరాకరించడంతో జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే ఆయన మరోసారి బెయిల్ కోసం నగదు బాండ్లు సమర్పించకపోవటంతో కోర్టు కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించింది. కాగా కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ కార్యకర్తలు నిరసనలకు దిగుతుండడంతో తీహార్ జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. -
అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్
న్యూఢిల్లీ: నితిన్ గడ్కరీ పరువునష్టం దావా కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. బెయిల్ బాండ్ సమర్పించేందుకు కేజ్రీవాల్ నిరాకరించడంతో ఆయనను అదుపులోకి తీసుకోవాలని పాటియాలా న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కోర్టు ఆదేశంతో కేజ్రీవాల్ ను గట్టి భద్రత నడుమ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 23 వరకు ఆయన జైల్లోనే ఉంటారు. ఆయ నను తీహార్ జైలుకు తరలించారు. శుక్రవారం ఆయనను కోర్టు ముందు హాజరుపరుస్తారు. రూ.10 వేలకు బయిల్ బాండ్ సమర్పిస్తే బెయిల్ మంజూరు చేస్తామని కోర్టు చెప్పినా కేజ్రీవాల్ వినిపించుకోలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ అవినీతిపరుడంటూ కేజ్రీవాల్ గతంలో ఆరోపించారు. దీంతో కేజ్రీవాల్‌పై గడ్కరీ పరువునష్టం దావా వేశారు. -
కేజ్రీవాల్ అరెస్ట్‌కు కోర్టు ఆదేశం