
స్మృతి ఇరానీని వేధించేందుకే: కోర్టు
న్యూఢిల్లీ: నకిలీ డిగ్రీ కేసు వివాదంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో స్మృతి తన విద్యార్హతల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను మంగళవారం పాటియాల కోర్టు కొట్టివేసింది. ఆమెకు సమన్లు జారీ చేసేందుకు కోర్టు నిరాకరించింది. కేంద్ర మంత్రి కావడం వల్లే ఆమెను వేధించేందుకు కేసు వేశారని కోర్టు అభిప్రాయపడింది.
గత లోక్సభ ఎన్నికల సందర్భంగా స్మృతి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో బీఏ చదివినట్టు పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్శిటీ నుంచి 1996లో డిగ్రీ పట్టా అందుకున్నట్టు వెల్లడించారు. అయితే ఆమె ఢిల్లీ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకోలేదని ఫ్రీలాన్స్ రచయిత కేసు వేయడంతో వివాదం ఏర్పడింది.