మరో రెండు వారాలు కేజ్రీవాల్ జైల్లోనే
లక్నో : ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు వారాలు జైల్లోనే ఉండనున్నారు. పాటియాలా న్యాయస్థానం ఆయనకు జూన్ 6వ తేదీ వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. బీజేపీ నేత నితిన్ గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
ఇందుకు సంబంధించి ఆయన కోర్టుకు హాజరు కానందుకు 10 వేల రూపాయల బాండ్ చెల్లించి బెయిల్ పొందాలని కోర్టు ఆదేశించినా... పూచీకత్తు రుసుము చెల్లించడానికి కేజ్రీవాల్ నిరాకరించడంతో జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అయితే ఆయన మరోసారి బెయిల్ కోసం నగదు బాండ్లు సమర్పించకపోవటంతో కోర్టు కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించింది. కాగా కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆప్ కార్యకర్తలు నిరసనలకు దిగుతుండడంతో తీహార్ జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు.