కోర్టులో లాయర్ల రౌడీయిజం | Lawyers Rowdy ism in court | Sakshi
Sakshi News home page

కోర్టులో లాయర్ల రౌడీయిజం

Published Thu, Feb 18 2016 12:48 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

కోర్టులో లాయర్ల రౌడీయిజం - Sakshi

కోర్టులో లాయర్ల రౌడీయిజం

రణరంగంగా పటియాలా కోర్టు
♦ జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ విచారణ సందర్భంగా విధ్వంసం
♦ విద్యార్థులు, జర్నలిస్టులను వెంటాడి కొట్టిన లాయర్లు
♦ కన్హయ్య కుమార్‌పైనా దాడి
♦ సుప్రీంకోర్టు ప్రతినిధులపైనా దాడి
♦ కన్హయ్యకు మార్చి 2దాకా రిమాండ్
 
 న్యూఢిల్లీ: పటియాలా హౌజ్ కోర్టులో లాయర్లు మరోసారి రెచ్చిపోయారు. నల్లకోట్లు ధరించి మరీ గూండాల్లా వ్యవహరించారు. కోర్టు ప్రాంగణంలోనే గుంపులుగా తిరగుతూ జేఎన్‌యూ విద్యార్థులు, లెక్చరర్లు, జర్నలిస్టులు, ప్రత్యర్థి లాయర్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. రాజద్రోహం కేసులో విచారణకు హాజరవుతున్న జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్‌పైనా చేయి చేసుకున్నారు. దాంతో, ఆయన ముఖం, కాళ్లపై చిన్న గాయాలయ్యాయి. కోర్టు ఆవరణలో శాంతిభద్రతలు నెలకొల్పాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ.. బుధవారం పటియాలా కోర్టును రణరంగంగా మార్చారు. సుప్రీం కోర్టు పంపించిన సీనియర్ లాయర్లపై పూల కుండీలు, నీళ్ల సీసాలు విసిరారు. పోలీసులు మళ్లీ ప్రేక్షక పాత్రే పోషించారు. విచారణ అనంతరం కన్హయ్యకుమార్‌ను మార్చి 2 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిస్తూ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్లీన్ తీర్పునిచ్చారు.

 సోమవారం దాడి చేసిన వారే
 జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్‌కు కోర్టు విధించిన పోలీస్ కస్టడీ ముగియడంతో విచారణ నిమిత్తం పటియాలా కోర్టులో బుధవారం ఆయనను హాజరు పర్చారు. రెండు రోజుల క్రితం పటియాలా కోర్టులో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, కోర్టు ప్రాంగణంలో శాంతి నెలకొనేలా చూడాలంటూ బుధవారం ఉదయం ఆదేశాలిచ్చింది. దాంతో పెద్ద ఎత్తున కోర్టు వద్ద పోలీసులను మోహరించారు. అయినా, కొందరు లాయర్లు ర్యాలీగా కోర్టు వద్దకు వచ్చి, కోర్టు ప్రాంగణంలోకి చొచ్చుకురాగలిగారు.

త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని, వందేమాతరం, జై భారతమాత అని నినాదాలు చేస్తూ..  దాడులకు దిగారు. సోమవారం నాటి దాడుల్లో కీలక పాత్ర పోషించిన లాయర్ విక్రమ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని లాయర్ల బృందం బుధవారం నాటి దాడుల్లో కూడా క్రియాశీలంగా కనిపించింది. కన్హయ్యకు అనుకూలంగా తమతో వాదనకు దిగిన లాయర్లపైనా వీరు దాడి చేశారు. జేఎన్‌యూ విద్యార్థులు, ఉపాధ్యాయులపై పిడి గుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ దాడులను చిత్రిస్తున్న మీడియా ప్రతినిధులనూ వదల్లేదు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లను లాక్కొని, అందులోని వీడియోలను తొలగించి, ఆ ఫోన్లను నాశనం చేశారు.

కెమెరామెన్‌లపై రాళ్లతో దాడి చేశారు. ఇంతలో, కన్హయ్యకుమార్‌ను తీసుకువస్తున్న పోలీసు వాహనం కోర్టు ప్రాంగణంలోకి రావడంతో, అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న లాయర్ల బృందం కన్హయ్య కుమార్‌పై దాడికి తెగబడింది. కోర్టు ప్రాంగణంలో, కోర్టు హాలు వెలుపల రెండుసార్లు ఆయనపై చేయి చేసుకున్నారు. అనంతరం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లవ్లీన్ సమక్షంలో కన్హయ్యకుమార్‌పై విచారణ జరి గింది. కోర్టుహాల్లోకి కేవలం ఆరుగురు లాయర్లు, ఒక జేఎన్‌యూ ప్రొఫెసర్, ఐదుగురు జర్నలిస్టులను మాత్రం అనుమతించారు. ఈ సందర్భంగా, తాను నూరుశాతం భారతీయుడినని, రాజ్యాంగంపై, న్యాయ వ్యవస్థపై తనకు గౌరవముందని కన్హయ్య కోర్టుకు తెలిపాడు. ‘నాపై మీడియా చేస్తున్న విచారణ బాధాకరం. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం ఉంటే నన్ను జైలుకు పంపండి. లేదంటే, ఈ మీడియా విచారణను ఆపేయండి’ అన్నారు. కోర్టులో తనపై జరిగిన దాడిని కన్హయ్యకుమార్ మెజిస్ట్రేట్‌కు వివరించారు. దాంతో, పటిష్ట భద్రత మధ్య ఆయనను తీహార్ జైలుకు పంపించాలని మెజిస్ట్రేట్ ఆదేశించా రు. వెలుపల లాయర్లు పెద్ద ఎత్తున గుమికూడి ఉండటంతో.. విచారణ తర్వాతమరో 3 గంటల పాటు కన్హయ్యకుమార్ కోర్టుహాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.

 ఢిల్లీ పోలీసుల వైఫల్యం
 పటియాలా కోర్టు ఘటనలను సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకుంది. దీనికి కేవలం ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీనే వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని కఠినంగా వ్యాఖ్యానించింది. బుధవారం ఉదయమే పటియాలా కోర్టులో ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలంటూ సుప్రీం ఆదేశించింది. ఈ ఉత్తర్వులు సరిగా అమలయ్యేలా పర్యవేక్షించేందుకు పటియాలా కోర్టుకు వెళ్లాలని ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. కొద్ది గంటల తరువాత, ఈ ఆదేశాలను ధిక్కరిస్తూ పటియాలా కోర్టులో చోటు చేసుకున్న దాడులను తమ దృష్టికి తీసుకురాగా వెంటనే కపిల్ సిబల్, రాజీవ్ ధావన్, దుష్యంత్ దవే తదితర ఆరుగురు  సీనియర్ లాయర్ల బృందాన్ని సుప్రీంకోర్టు పటియాలా కోర్టుకు పంపించింది. వారికీ స్థానిక లాయర్లు దూషణలతో స్వాగతం పలికారు. వారిపైకి నీళ్ల సీసాలను, పూల కుండీలను విసిరారు.

అనంతరం, ఆ బృందం తమ నివేదికను సుప్రీంకోర్టుకు మౌఖికంగా అందించింది. కోర్టుహాల్లో కూడా ఒక వ్యక్తి కన్హయ్యకుమార్‌పై దాడి చేశాడని, కన్హయ్య ఆ వ్యక్తిని గుర్తించినప్పటికీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయలేదన్నారు. ఈ వివరాలను గురువారం మధ్యాహ్నం లిఖితపూర్వకంగా అందించాలని జస్టిస్ చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం వారిని కోరింది. ఢిల్లీ పోలీసుల తరఫు వివరణను గురువారం ఉదయం అందించాలని ఢిల్లీ పోలీస్‌లను ఆదేశించింది. కాగా, కన్హయ్యకు అనుకూలంగా జేఎన్‌యూ లోని ముగ్గురు ఏబీవీపీ సభ్యులు సంస్థకు రాజీనామా చేశారు. కాగా, ఢిల్లీ వర్సిటీలో అఫ్జల్ అనుకూల, వ్యతిరేక (ఏబీవీపీ) వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.
 
 ఇది వలస పాలన చీకటి యుగానికి నకలు
 చామ్‌స్కీ, పాముక్ సహా మేధావుల ఖండన
 న్యూఢిల్లీ: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యకుమార్ అరెస్ట్‌పై వెల్లువెత్తిన నిరసనతో.. విఖ్యాత మేధావి నోమ్ చామ్‌స్కీ, నోబెల్ బహుమతి గ్రహీత ఓర్హాన్ పాముక్ సహా ప్రపంచ వ్యాప్తం గా శాస్త్రవేత్తలు, రచయితలు గళం కలిపారు. విదేశాల్లోని ప్రముఖ వర్సిటీలకు చెందిన 86 మంది విద్యావేత్తలు.. ‘భారత్‌లో ప్రస్తుత ప్రభుత్వం సృష్టించిన అధికార దురహంకార సంస్కృతి’ని ఖండిస్తూ బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. అధికారంలో ఉన్నవారు అణచివేతపూరిత వలసరాజ్య కాలం నాటి, 70ల మధ్యలోని అత్యవసర పరిస్థితి కాలం నాటి చీకటి యుగానికి నకలును తీసుకొస్తున్నారని తప్పుపట్టారు. ‘భారతదేశ వలస పాలకులు రూపొందించిన దేశద్రోహ చట్టాలను విధించి.. జేఎన్ యూ క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించాలని ఆదేశించి, విద్యార్థి నేతను..హింసను ప్రేరేపించారన్న అభియోగంపై ఎటువంటి ఆధారం లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన సిగ్గుచేటయిన చర్య గురించి తెలుసుకున్నాం’ అని ధ్వజమెత్తారు.
 
 కన్హయ్యపై దాడి జరగలేదు
  కన్హయ్యకుమార్‌పై దాడి జరగనేలేదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ అన్నారు. ‘ఆయనపై దాడి జరగలేదు. కాస్త తోపులాట జరిగింది. అంతే. పరిస్థితిని పోలీసులు సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. లాయర్లకు వ్యతిరేకంగా బలగాలను మోహరిస్తే పరిస్థితి మరింత దారుణమయ్యేది’అన్నారు. కన్హయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలున్నాయన్నారు. ఆయనకు క్లీన్ చిట్ లభించే ప్రశ్నేలేదన్నారు. ఫిబ్రవరి 9న జేఎన్‌యూలోకి ఇతరులూ ప్రవేశించారని, మొత్తం ఘటనకు బాధ్యుడిని గుర్తించామన్నారు. ఈ సందర్భంగా ‘దేవుడా.. నీ ప్రపంచం ఎలా అయిపోయిందో చూడు.. మనిషిఎంతగా మారి పోయాడో చూడు’ అనే కవిత గుర్తొస్తోందని బస్సీ వ్యాఖ్యానించారు. కన్హయ్యకు కోర్టు బెయి ల్ ఇవ్వాలనుకుంటే అభ్యంతరం తెలపబోమన్నారు.  కాగా, పటియాలాకోర్టు ఘటనపై నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. అటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఢిల్లీ పోలీసులను నివేదిక కోరింది. జేఎన్‌యూలో పోలీసు చర్యపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రానికి, ఢిల్లీ ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసులకు, జేఎన్‌యూ అధికారులకు నోటీసులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement