న్యూఢిల్లీ: న్యూయార్క్–న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో 70 ఏళ్ల సహ ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన శంకర్ మిశ్రాకు ఢిల్లీలోని పటియాలా కోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అతడు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు శుక్రవారం బెంగళూరులో అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరుపర్చగా నిందితుడిని 14 రోజులపాటు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ న్యాయమూర్తి ఆదేశాలిచ్చారు. తనను చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారని శంకర్ మిశ్రా ఆరోపించాడు. తనకు గతంలో ఎలాంటి నేర చరిత్ర లేదని, సాక్ష్యులను ప్రభావితం చేసే స్థాయిలో లేనని, అందుకే బెయిల్ ఇవ్వాలని కోరాడు.
అయితే.. కేసు ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు శంకర్ మిశ్రాకు బెయిల్ ఇవ్వడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. పైగా ఓ మహిళ పట్ల నిందితుడు వ్యవహరించిన తీరు ఏమాత్రం సహించరానిదని తెలిపింది. అంతకు ముందు శంకర్ మిశ్రా తరపు న్యాయవాది వాదిస్తూ.. శంకర్ మిశ్రా లైంగిక కోరికలతోనో లేదంటే ఆమె పట్ల దౌర్జన్యంగా వ్యవహరించాలనో అలా ప్రవర్తించలేదని వాదించాడు. అయితే.. బాధితురాలి తరపు న్యాయవాది మాత్రం తన క్లయింట్‌ను బెదిరించారనే విషయాన్ని జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. నిందితుడి తండ్రి.. బాధితురాలికి బెదిరింపు సందేశాలు పంపించాడని, చేసినదానికి ఇంతకు ఇంత అనుభవిస్తావు అంటూ మెసేజ్‌లు పెట్టి డిలీట్ చేశాడని, పైగా నిందితుడి కుటుంబ సభ్యులు బాధితురాలి ఇంటికి వెళ్లి బెదిరించే యత్నం కూడా చేశారని తెలిపారు.
దీంతో బెయిల్‌ను నిరాకరించిన మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోమల్ గార్గ్.. శంకర్ మిశ్రాకు బెయిల్ నిరాకరించారు. ఇదిలా ఉంటే ఇంతకు ముందు పోలీసులు శంకర్ మిశ్రాను తమ కస్టడీకి అప్పగించాలని కోరగా.. కోర్టు అందుకు అంగీకరించకుండా జ్యూడీషియల్ కస్టడీ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment