మెట్రో రైలు డబ్బుతో ఉద్యోగి పరారీ
మెట్రో రైల్వే స్టేషన్లలో టికెట్ల అమ్మకం ద్వారా వచ్చిన డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన వ్యక్తి.. ఆ డబ్బు తీసుకుని ఎంచక్కా పరారయ్యాడు. ఢిల్లీ మెట్రోరైలుకు చెందిన రూ. 50 లక్షలతో అతడు చెక్కేశాడు. నీరజ్ అనే ఆ వ్యక్తి మెట్రో స్టేషన్లన్నింటి నుంచి డబ్బు సేకరించి.. దాన్ని భికాజీ కామా ప్లేస్ ప్రాంతంలో ఉన్న బ్యాంకు శాఖలో డిపాజిట్ చేయాలి. ఈనెల 16న అతడు ఏడు స్టేషన్ల నుంచి డబ్బు సేకరించాడు. కానీ దాన్ని బ్యాంకులో జమచేయడానికి బదులు ఉన్నట్టుండి మాయమైపోయాడు. అతడి మొబైల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది.
ఆరోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉద్యోగ్ భవన్ మెట్రోస్టేషన్ నుంచి డబ్బు సేకరించి, హుడా సిటీసెంటర్ వెళ్లే రైలు ఎక్కాడు. అతడు ఎయిమ్స్ స్టేషన్‌కు వెళ్తే, అక్కడ అతడి కోసం ఒక ఎస్కార్టు వాహనం ఉంటుంది. దాంట్లో అతడు బ్యాంకుకు వెళ్లాలి. కానీ అతడు మాలవీయ నగర్ స్టేషన్‌లోనే దిగిపోయి, అక్కడి నుంచి మాయమైపోయాడు.
అప్పటికి అతగాడి వద్ద మూడురోజుల నుంచి సేకరించిన రూ. 50 లక్షల సొమ్ము ఉంది. సాధారణంగా అయితే మూడు రోజులకు రూ. 12 లక్షలు మాత్రమే వస్తుంది. కానీ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా వరుస సెలవులు రావడంతో జనం ఎక్కువ తిరగడం వల్ల టికెట్ల డబ్బులు కూడా బాగా వచ్చాయి. అదిచూసి ఆశపడిన నీరజ్.. ఆ డబ్బుతో ఎంచక్కా చెక్కేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బిహార్‌కు చెందిన అతగాడి కోసం గాలింపు మొదలైంది.