రెడీ.. వన్‌.. టూ.. త్రీ | Coming into effect of the new tax policy | Sakshi
Sakshi News home page

రెడీ.. వన్‌.. టూ.. త్రీ

Published Fri, Jun 30 2017 12:52 AM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM

రెడీ.. వన్‌.. టూ.. త్రీ - Sakshi

రెడీ.. వన్‌.. టూ.. త్రీ

నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తు సేవల పన్ను
స్వాతంత్య్ర భారత చరిత్రలో అతి పెద్ద పన్ను సంస్కరణ
18 రకాల పరోక్ష పన్నుల స్థానంలో ఒకే పన్ను
నాలుగు శ్లాబుల్లో అన్ని రకాల వస్తువులపై పన్నులు
సామాన్య, మధ్య తరగతి వర్గాలకు కొంత ఊరట
పూర్తిగా అమల్లోకి వచ్చాకే లాభనష్టాలపై స్పష్టత 


స్వాతంత్య్ర భారత చరిత్రలో అతిపెద్ద సంస్కరణగా భావిస్తున్న ‘వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ’ శుక్రవారం అర్ధరాత్రి నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తోంది. ఒక దేశం–ఒకే పన్ను నినాదంతో 18 రకాల పరోక్ష పన్నుల స్థానంలో ప్రవేశపెడుతున్న జీఎస్టీ... ఎలాంటి ఫలితాలను అందిస్తుందనేది ఉత్కంఠ కలిగిస్తోంది. ప్రజలు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు.. ఇలా అన్ని వర్గాలపైనా జీఎస్టీ ప్రభావం ఎలా ఉంటుంది!? ఎవరికి ప్రయోజనం కలుగుతుంది!? అనే సందేహాలకు ఇప్పటికీ స్పష్టత లేదు.

కొన్ని వర్గాలకు జీఎస్టీతో లాభం ఉంటుందని చెబుతున్నా.. ఏ మేరకు లాభం ఉంటుంది, ఏ తరహాలో ప్రయోజనం చేకూరుతుంది, అసలు లాభం ఉంటుందా లేదా అన్నదానిపైనా ఎన్నో సందేహాలున్నాయి. దేశంతో పాటు అన్ని రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ, ప్రజా జీవనంతో ముడిపడిన ఈ కొత్త పన్నుల విధానంపై ఎన్నో రకాల అంచనాలు, అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నేటి అర్ధరాత్రి నుంచి కొత్త పన్నుల విధానం అమల్లోకి రానుంది. ఈ విధానం ఎటువంటి ప్రభావం చూపనుందనే అంశంపై వివిధ వర్గాల భయసందేహాలు ఇలా ఉన్నాయి.


చిరు వ్యాపారులు
ఊరట :ఇప్పటివరకు రూ.5 లక్షల కన్నా ఎక్కువ టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు, సంస్థలు పన్ను కట్టాల్సి వచ్చేది. అయితే జీఎస్టీలో రూ.20 లక్షల కన్నా తక్కువ వార్షిక టర్నోవర్‌ ఉంటే పన్ను పరిధిలోకి రారు. వారు తయారుచేసే లేదా విక్రయించే వస్తువులకు ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు.

సందేహాలు: రూ.20 లక్షలలోపు టర్నోవర్‌ ఉందని చూపించేందుకు చిరు వ్యాపారులు ఏం చేయాలన్న దానిపై స్పష్టత లేదు. వ్యాపార లావాదేవీల తనిఖీ, టర్నోవర్‌ అంచనాల పేరుతో ముందు ముందు ఏవైనా ఇబ్బందులు తలెత్తుతాయా?

లాభమా/నష్టమా :జీఎస్టీ అమలుతో చిరు వ్యాపారులకు ఆన్‌లైన్‌ ద్వారా అన్ని లావాదేవీలను నిర్వహించడం కష్టం కానుంది. ముఖ్యంగా ప్రతి ఇన్వాయిస్‌ను అప్‌లోడ్‌ చేయాల్సి రావడం, ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సి రావడం ఇబ్బందికరమే.

పారిశ్రామికవేత్తలు
ఊరట: జీఎస్టీలో అంతర్రాష్ట్ర వ్యాపార లావాదేవీలకు సంబంధించి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ ఉండడం పెద్ద వ్యాపారులకు ఊరట కలిగించనుంది.

సందేహాలు: జీఎస్టీ ప్రకారం.. వస్తువును తయారుచేసిన రాష్ట్రాలకు ఎలాంటి పన్ను అందదు. వాటిని వినియోగించే రాష్ట్రాలకే పన్ను వెళుతుంది. అదే రాష్ట్రంలో తయారుచేసి అక్కడే అమ్ముకుంటే ఆ రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. దీనివల్ల ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే వస్తువుల తయారీ పరిశ్రమలకు సబ్సిడీలు ఇచ్చేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆసక్తి చూపుతాయా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

లాభమా/నష్టమా: జీఎస్టీతో పెద్ద వ్యాపారులు, పారిశ్రామికవేత్తలపై ప్రభావం ఎలా ఉంటుందనేది ఆచరణలోనే అనుభవంలోకి వస్తుంది. అంతిమంగా వినియోగదారుడిపై పన్ను ప్రభావం పడుతుంది కనుక లాభనష్టాల బేరీజు అవసరం లేదు. కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి జీఎస్టీ అమల్లో ఏ మార్పు తీసుకువస్తుందనే దానిని బట్టి పెద్ద వ్యాపారులు/పారిశ్రామికవేత్తల ప్రయోజనం ఆధారపడి ఉంది.

వినియోగదారులు
ఊరట: వస్తువును బట్టి గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే అన్ని రకాల పన్నులు కలిపి 42 శాతం వరకు పన్నుగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు నాలుగు శ్లాబుల్లో గరిష్టంగా 28 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. దీనివల్ల ధరలు తగ్గుతాయనే అంచనాలు ఉన్నాయి.

సందేహాలు: జీఎస్టీతో వాస్తవంగా వినియోగ వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు ఎలా ఉంటాయి? వేటి ధరలు తగ్గుతాయి, ఏవి పెరుగుతాయి.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి? పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోనికి ఎందుకు తీసుకురాలేదు? అలా తెస్తే కచ్చితంగా పెట్రోల్, డీజిల్‌ ధరలు తగ్గేవి కదా? పన్ను సంస్కరణల ప్రభావం పేరుతో వ్యాపారులు తమపై భారం వేస్తారా?

లాభమా/నష్టమా: వినియోగదారులకు జీఎస్టీ ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందన్నది కొద్దిరోజుల తర్వాతగానీ అర్థమయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా ధరల పెరుగుదల, వ్యాపారుల దృక్పథం, జీఎస్టీ కౌన్సిల్‌ విధానాలు వినియోగదారులపై ప్రభావం చూపనున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వాలు
ఊరట: జీఎస్టీ అమలుతో రాష్ట్ర ప్రభుత్వ పన్ను వసూళ్ల రాబడిలో తగ్గుదల కనిపిస్తే ఆ మేరకు కేంద్రమే పరిహారం చెల్లిస్తుంది. అయితే ఇది ఐదేళ్ల పాటు మాత్రమే. ఆలోగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ వనరులను పెంచుకోవాలి.

సందేహాలు:జీఎస్టీ వల్ల రాబడి తగ్గితే నెలవారీ లావాదేవీలకు ఇబ్బందులెదురవుతాయా? తక్షణ అవసరాలను ఎలా సర్దుబాటు చేసుకోవాలి? ఐదేళ్లు ఇచ్చే పరిహారాన్ని ఎప్పుడెప్పుడు ఇస్తారో స్పష్టంగా చెప్పని నేపథ్యంలో.. ఆ నిధులకు ఎదురు చూడాల్సిందేనా? రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఇబ్బందిని ఎలా అధిగమించాలి? ఈ విషయంలో కేంద్రం ఏవైనా మినహాయింపులిస్తుందా?

లాభమా/నష్టమా: దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం వల్ల రాష్ట్రాలు ఏ వస్తువుపైనైనా పన్ను వి«ధించే అధికారాన్ని శాశ్వతంగా కోల్పోనున్నాయి. మళ్లీ పార్లమెంటులో చట్టం చేస్తేనే రాష్ట్రాలకు ఆ అధికారాలు వస్తాయి. ఇక జీఎస్టీ అమలు కోసం సర్దుబాటు చేసుకోవాల్సిన ఉద్యోగాలు రాష్ట్రాలపై అదనపు భారమే.

మూడు పన్నులు.. నాలుగు శ్లాబులు
జీఎస్టీ ప్రకారం మార్కెట్‌లో లభ్యమయ్యే ప్రతి వస్తు వుపై (పెట్రోలియం ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు, మద్యం మినహా) నాలుగు శ్లాబుల్లో మూడు రకాల పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కేంద్ర వస్తు సేవల పన్ను (సీజీఎస్టీ), రాష్ట్ర వస్తుసేవల పన్ను (ఎస్‌జీ ఎస్టీ), సమీకృత వస్తుసేవల పన్ను (ఐజీఎస్టీ)గా పేర్కొనే ఈ మూడు రకాల పన్నులూ కలిపే జీఎస్టీగా వ్యవహరిస్తారు. జీఎస్టీలో నిర్ణయించిన పన్ను శ్లాబుల్లో ఈ మూడు రకాల పన్నులూ కలిసే ఉంటాయి. ఒకే రాష్ట్రంలో తయారుచేసి, వినియోగిస్తే (సీజీఎస్టీ), (ఎస్‌జీఎస్టీ) కలిపి ఉంటాయి. అంతర్రాష్ట్ర లావాదేవీల్లో ఐజీఎస్టీ ఉంటుంది. నేరుగా వినియోగం కోసం విక్రయించే చోట ఈ పన్నులను వసూలు చేస్తారు. ఆయా వస్తుసేవలను వినియోగిం చిన రాష్ట్రాన్ని బట్టి కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్నుల సొమ్ము పంపకం జరుగుతుంది. వస్తుసేవలను నాలుగు రకాలుగా విభజించి 5, 12, 18, 28 శాతాలుగా జీఎస్టీని నిర్ధారించారు. ఆ వస్తుసేవలు ఏ కేటగిరీలో ఉన్నాయనే దానిని బట్టి గరిష్టంగా అంత శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

అంతా ఆన్‌లైన్‌లోనే..
జీఎస్టీ నిబంధనల ప్రకారం.. డీలర్లు, వ్యాపారులు పన్నును ఆన్‌లైన్‌లోనే చెల్లించాల్సి ఉంటుంది. రిజి స్ట్రేషన్, రిటర్నులు, చెల్లింపులూ ఆన్‌లైన్‌లోనే చేయా లి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన అన్ని ఇన్వాయిస్‌లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా జీఎస్టీ కింద ప్రతి నెలా దేశవ్యాప్తంగా 200కోట్లకు పైగా ఇన్వాయిస్‌లు అప్‌లోడ్‌ అవుతా యని అంచనా. అన్ని లావాదేవీలకు సంబంధించిన వివరాలన్నీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఇవి 20 ఏళ్ల పాటు రికార్డుల్లో ఉండేలా పోర్టల్‌ను రూపొందిం చారు. ఈ జీఎస్టీ పోర్టల్‌లోకి డీలర్‌ టిన్‌ నంబర్‌తో నమోదైతే.. ఆ డీలర్‌ జీఎస్టీ నెట్‌వర్క్‌లో చేరినట్టే.

కొన్నాళ్లు ఆగాల్సిందే..!
జీఎస్టీ పన్ను శ్లాబుల్లో చేర్చిన వస్తువులను బట్టి చూస్తే.. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులపై పూర్తిగా పన్ను ఎత్తివేయడంతో నిత్యావసరాల ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అవి మినహా నిత్యం వినియోగించే వస్తువుల ధరలు పెరుగుతాయా, తగ్గుతాయా అన్న దానిపై కొంతకాలం తర్వాతే స్పష్టత రానుంది. అయితే వ్యవసాయ ఉత్పత్తులను జీఎస్టీ నుంచి మినహాయించినా.. ఎరువులపై పన్ను పెంచడంతో ఆ మేరకు రైతాంగంపై భారం పడనుంది.

బొట్టుబిళ్లలు, కుంకుమ, స్టాంపులు, పుస్తకాలు, న్యూస్‌ పేపర్లు, గాజులు, చేనేత, మెట్రోరైళ్లు, లోకల్‌ రైళ్లు, మాంస ఉత్పత్తులు, పండ్లు, కూరగాయలు, పాలు, బ్రెడ్, తేనె లాంటి వస్తువులను జీఎస్టీ నుంచి మినహాయించడం మేలు చేకూర్చనుంది. ఇక రబ్బరు టైర్లు, ప్లాస్టిక్‌ వస్తువులపై గతంలో కన్నా 10 శాతం ఎక్కువ పన్ను పడనుండడం భారమైనట్టే. గతంలో పన్ను లేని ఆటోమొబైల్‌ విడిభాగాలను ఏకంగా 28 శాతం పన్ను శ్లాబు కిందకు తీసుకురావడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇతర రవాణా వాహనాల ధరలు పెరిగే అవకాశాలున్నాయి.

విలాసాలపై మాత్రం మోతే
జీఎస్టీతో విలాస వస్తువులు, సేవలపై మాత్రం పన్ను మోత మోగనుంది. సినిమాలు, హోటళ్లు, గెస్ట్‌హౌస్‌లు, మ్యారేజ్‌ ఫంక్షన్‌ హాళ్లు, ఫైవ్‌స్టార్‌ హోటళ్లు, రేస్‌క్లబ్‌ బెట్టింగ్‌లు, బ్యూటీకేర్‌ వస్తువులు వంటివాటి ధరలు, చార్జీలు బాగా పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ పన్ను విధానం శనివారం నుంచే అమల్లోకి వచ్చినా.. దానిద్వారా వ్యాపార లావాదేవీలు పూర్తిస్థాయిలో జరిపి.. ధరల్లో మార్పులు, చేర్పులు చేసేందుకు పది పదిహేను రోజులు పట్టే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

లాభమెంత? నష్టమెంత?
న్యూఢిల్లీ: జీఎస్‌టీ అమలుతో లాభమెంత? నష్టమెంత.. వర్తకులు, వ్యాపారులు, వినియోగదారులకు ఎంత మేరకు ప్రయోజనం.. ఏ ధరలు తగ్గుతాయి.. ఏవి పెరుగుతాయి అన్న ఆందోళనల మధ్య మరికొద్ది గంటల్లో జీఎస్‌టీ అమల్లోకి రానుంది. వ్యాపారుల రోజువారీ కార్యకలాపాలతో పాటు, వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలపై వస్తు, సేవల పన్ను భారీ ప్రభావం చూపనుందని మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.  అయితే ఏడాది అనంతరం పూర్తి స్థాయి విశ్లేషణ తర్వాతే జీఎస్‌టీ అసలు ప్రభావం తెలుస్తుందని చెపుతున్నారు.

ధర పెరిగేవి..
బ్యాంకింగ్, టెలికం సేవలు..., ఏసీ రెస్టారెంట్లలో భోజనం, మొబైల్‌ బిల్లులు, ట్యూషన్‌ ఫీజులు, సెలూన్‌ ఖర్చులు, రూ. 1000 దాటిన వస్త్రాలపై 6 శాతం పన్నును 12 శాతానికి పెంచారు. రూ. 1000 లోపు వస్త్రాలపై ఒక శాతం తగ్గించారు. ఫ్లాట్, షాపుల కొనుగోలుపై ప్రస్తుతమున్న 6 శాతం పన్నును 12 శాతానికి పెంచారు.

ధర తగ్గేవి..
వంటింట్లో వాడే కత్తులు, స్పూన్‌లు, కెచప్, సాస్, పచ్చళ్ల ధరలు.. బరువు తూచే యంత్రాలు, యూపీఎస్‌లు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, పారిశ్రామిక ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వైండింగ్‌ వైర్లు, వాకీ టాకీలు, పోస్టల్, రెవెన్యూ స్టాంపుల ధరలు తగ్గనున్నాయి. ప్లేయింగ్‌ కార్డులు, చెస్, క్యారమ్‌ బోర్డు, ఇతర బోర్డు గేమ్స్‌పై పన్ను తగ్గించారు. ఉప్పు, చిన్నారుల రంగుల పుస్తకా లు, ఆహార ధాన్యాల్ని జీఎస్‌టీ నుంచి మినహాయి ంచారు.  ఇక 20 లక్షల్లోపు వార్షికాదాయమున్న వర్తకుల్ని జీఎస్‌టీ నుంచి మినహాయించారు. ఇక జీఎస్‌టీ అమలులో ఇబ్బందుల వల్ల 2017–18లో పన్ను ఆదాయం తగ్గవచ్చని ప్రభుత్వం అంచనావేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement