మరుగుదొడ్డి కట్టేంతవరకు రాను
మధ్యప్రదేశ్‌లో అత్తింటికి ఓ మహిళ షరతు
బేతుల్: మధ్యప్రదేశ్‌లోని ఓ మహిళ అత్తింటికి షాక్ ఇచ్చింది. మరుగుదొడ్డి నిర్మించే వరకు ఇంట్లో అడుగుపెట్టనంటూ పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త పలుమార్లు వెళ్లి బతిమిలాడినా లాభం లేకపోయింది. పిపారియా పట్టణానికి చెందిన సీమ(20)కి 2012లో షాపూర్‌కు చెందిన మోహన్ పటేల్(23)తో పెళ్లయింది. అయితే పెళ్లయినప్పటి నుంచి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించమని సీమ భర్తను అడుగుతూ వస్తోంది. ఆమె మాటలు పెడచెవిన పెట్టడంతో 19 నెలల క్రితం తల్లిగారింటికి వచ్చి అక్కడే ఉంటోంది.
భర్త పలుమార్లు వెళ్లి అడిగినా తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. మోహన్ కౌన్సెలింగ్ సెంటర్‌ను సంప్రదించారు. కౌన్సెలింగ్ సెంటర్ సభ్యురాలు రజని గైక్వాడ్ సీమ నిర్ణయాన్నే సమర్థించారు. శనివారం రెండు కుటుంబాలను కౌన్సెలింగ్ సెంటర్‌కు పిలిపించిన గైక్వాడ్ ఒక నెలలోపు తన ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించుకోవాలని మోహన్‌కు సూచించారు. గతంలోనూ బేతుల్ జిల్లాకు చెందిన అనితా నర్రే అనే గిరిజన యువతి కూడా ఇదే విధంగా 2011లో అత్తింటికి షరతు పెట్టింది.