
గెలుపు గుర్రాల కోసం అప్పుడే వేట
సినిమా తారలంటే ప్రజలుకు క్రేజ్ ఉండటం సహజం. ఆ క్రేజ్ను క్యాష్ చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా గడువు ఉన్నప్పటికీ పాలక కాంగ్రెస్ పార్టీ అప్పుడే కర్ణాటకలో అభ్యర్థుల వేటలో పడింది. రాష్ట్రంలోని మొత్తం 28 లోక్‌సభ స్థానాలకు గాను 25 స్థానాలను గెలుచుకుని తీరాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్దేశించిన నేపథ్యంలో గెలుపు గుర్రాల కోసం పార్టీ నాయకులు అన్వేషణను ప్రారంభించారు. ఇందులో భాగంగా పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. భారత విశిష్ట గుర్తింపు సంఖ్య అథారిటీ (యూఐడీఏఐ) చైర్మన్ నందన్ నిలేకనిని బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయించాలని పార్టీ యోచిస్తోంది. దాంతో ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.
అయితే ఇది కేవలం ఊహాజనితమని నిలేకని కొట్టి పారేస్తున్నప్పటికీ, ఆయనను పోటీ చేయించే విషయంలో రాహుల్ గాంధీ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నిలేకనిని పోటీ చేయిస్తే, ఆ నియోజక వర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న ఐటీ ఓట్లను సొంతం చేసుకోవచ్చనేది కాంగ్రెస్ వ్యూహంగా చెబుతున్నారు. ఆధార్ సంఖ్యను ఇచ్చే యూఐడీఏఐ అధ్యక్షుడుగా నిలేకని సమర్థంగా వ్యవహరించారని కాంగ్రెస్ భావిస్తోంది. 2009 జూన్‌లో ఇన్ఫోసిస్‌ను వీడి యూఐడీఏఐ అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదాను కల్పించిన విషయం తెలిసిందే.
ఇక బెంగళూరు దక్షిణ లోక్‌సభ నియోజక వర్గం బీజేపీ కంచుకోటగా ఉంది. 1996 నుంచి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనంత కుమార్ అక్కడి నుంచి గెలుస్తూనే ఉన్నారు. ఈసారి ఆయన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని నిర్ణయించుకున్నారని, కనుక పోటీ చేయబోరని వినవస్తోంది. అదే కనుక నిజమైతే మాజీ క్రికెటర్, కేఎస్‌సీఏ అధ్యక్షుడు అనిల్ కుంబ్లేను రంగంలో దించాలని బీజేపీ యోచిస్తోంది. దీనిపై వ్యాఖ్యానించడానికి కుంబ్లే సహాయకులు నిరాకరించారు. కాగా లోక్‌సభ ఎన్నికలకు పలువురి అభ్యర్థుల పేర్లను సూచించడానికి కేపీసీసీ ఇదివరకే ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 20 నియోజక వర్గాలకు ఆ కమిటీ కొందరి పేర్లను ప్రతిపాదించింది.
అలాగే లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులుగా పలువురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో నటుడు సుదీప్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఇటీవల ఆయన నివాసంలో కలుసుకున్నారు. హైదరాబాద్‌లో షూటింగ్ ముగించుకుని వచ్చిన సుదీప్ సీఎంతో సుమారు 30 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రే ఆయనను ఆహ్వానించారని కూడా వినవస్తోంది. శాసన సభ ఎన్నికల సందర్భంగా సిద్ధరామయ్య స్వయంగా సుదీప్ నివాసానికి వెళ్లి పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరారు.
అప్పట్లో అతను ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సుదీప్ ఆసక్తి చూపారా, లేదా అనేది తెలియరాలేదు. ఇప్పటికే కన్నడ నటీ నటులు ...రాజకీయాల్లో వెలుగొందుతున్న సంగతి తెలిసిందే. సినీ నటుడు అంబరీష్ ....తాజాగా రమ్యశ్రీ కాంగ్రెస్ ఎంపీగా లోక్సభకు ఎన్నికయిన విషయం తెలిసిందే.