సమన్వయం, సమష్టితత్వం అంటే ఇదే..!
కాంగ్రెస్ పార్టీని చూసి, ఆ పార్టీ నాయకులను గమనించి రాజకీయాల్లో ఏదైనా కూడా సులభంగా నేర్చుకోవచ్చునని ఇతరపార్టీల నాయకులు చెబుతుంటారు. దాదాపు 130 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ పార్టీని, నాయకుల తీరును చూసి... ఏ విధంగా ఉండకూడదన్నది కూడా తెలుసుకోవచ్చునంటున్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో అనేక సమస్యలున్నా విడివిడిగా ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా పార్టీ నాయకులు వ్యవహరిస్తుండడం పట్ల సీనియర్లు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానప్రతిపక్షంగా రాణించేందుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నా, ఆ మేరకు అధికారపక్షం తన నిర్ణయాలతో అవకాశం కల్పిస్తున్నా ఏ మాత్రం పుంజుకోలేకపోతున్నారని పెదవి విరుస్తున్నారు. సొంత ఇమేజీని పెంచుకునేందుకు, మీడియాలో సొంత ప్రచారాన్ని పొందేందుకే నేతలు మొగ్గుచూపడం పార్టీని దెబ్బతీస్తోందంటున్నారు. అంతేకాకుండా ఒకరికి పేరు రాకుండా మరొకరు ప్రయత్నించడం, సీనియర్లు, జూనియర్లు గ్రూపులుగా విడిపోవడం సమష్టితత్వం కొరవడిందంటున్నారు. చీప్‌లిక్కర్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ తాజా ప్రకటనపై రాష్ట్రవ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని లేవదీయాల్సింది పోయి ఒకటి, రెండు జిల్లాల్లో చిన్న, చిన్న ఆందోళనలు,నిరసనలకు పరిమితం కావడాన్ని ఉదహరిస్తున్నారు.
అంతేకాకుండా సీఎం సొంతజిల్లాలో దళితుల భూమి ఆక్రమణపై మెదక్ జిల్లా నాయకులకు సంబంధం లే కుండా మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రస్తావించడం, విడిగా మీడియాతో మాట్లాడడాన్ని గుర్తుచేస్తున్నారు. ఇవన్నీ కూడా వ్యక్తిగత మైలేజీ కోసం తప్ప పార్టీ ఇమేజీని, సమష్టితత్వాన్ని, సమన్వయాన్ని పెంచేందుకు ఉపయోగపడవని, తమ పార్టీనాయకులను చూసి రాజకీయాల్లో ఏ విధంగా వ్యవహరించకూడదనేది నేర్చుకోవచ్చునని చెబుతున్నారు.