
కాశ్మీర్‌కు బలగాలు పంపవద్దన్న నెహ్రూ: అద్వానీ
తాజాగా బ్లాగులో అద్వానీ కామెంట్లు
న్యూఢిల్లీ: అప్పట్లోప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ.. నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను ‘పచ్చి మతతత్వవాది’ అని అన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ అగ్రనేత అద్వానీ మరో ఆసక్తికర అంశం వెల్లడించారు. 1948లో పాకిస్థాన్ సేనలు కాశ్మీర్ వచ్చేసినప్పటికీ.. వాటిని ప్రతిఘటించేందుకు సైన్యాన్ని పంపడానికి నెహ్రూ విముఖత వ్యక్తంచేశారని తెలిపారు. కానీ నాటి హోం మంత్రి ఆయన్ను ఒప్పించి సైన్యాన్ని పంపారని వెల్లడించారు.
సీనియర్ జర్నలిస్టు ప్రేమ్ శంకర్ ఝాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శ్యామ్ మానెక్‌షా(అప్పట్లో కల్నల్) ఇచ్చిన ఇంటర్వ్యూను ఉటంకిస్తూ అద్వానీ గురువారం తన బ్లాగ్‌లో ఈ విషయం పేర్కొన్నారు. ‘‘పాకిస్థాన్ దళాల తోడ్పాటుతో గిరిజనులు పెద్ద ఎత్తున శ్రీనగర్ దగ్గరకు వచ్చేశారు. అక్కడికి భారత బలగాలను పంపే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే నెహ్రూ మాత్రం దానికి విముఖత వ్యక్తంచేశారు. ఈ అంశాన్ని ఐక్య రాజ్య సమితి దృష్టికి తీసుకుపోదామన్న ఆలోచనలో ఆయన ఉన్నారు’’ అని మానెక్‌షా అన్నట్లు అద్వానీ పేర్కొన్నారు.