ముందుగానే అభ్యర్థుల వెల్లడి: రాహుల్ గాంధీ
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల చేదు జ్ఞాపకాల ఫలి తమో, ‘ఆమ్ ఆద్మీ’ నేర్పిన పాఠమో కానీ రానున్న లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ వినూత్నంగా సిద్ధమవుతోంది. ఎప్పుడూ లేని రీతిలో ఒకింత ముందుగానే అభ్యర్థిత్వాలపై కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థులను ముందుగానే ప్రకటిస్తామని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించారు. పార్టీ అభ్యర్థిత్వాల పరిశీలన కోసం 10 స్క్రీనింగ్ కమిటీలను కాంగ్రెస్ గురువారం నియమించడం తెలిసిం దే.
అభ్యర్థుల ఎంపిక విధి విధానాలపై వాటి చైర్మన్లతో రాహుల్ శుక్రవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అంతకుముందు మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థుల జాబితా ముందస్తుగానే వెలువడుతుందని చెప్పారు. ‘‘టికెట్ల కేటాయింపులో ఈసారి కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నాం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తుది ప్రక్రియ జాతీయ స్థాయిలో జరుగుతుంది.
ఎంపికలో ప్రజాభిప్రాయం ప్రతిఫలిస్తుంది. పార్టీ కార్యకర్తలు, నేతలు, సంస్థాపరమైన కమిటీలు, జిల్లాస్థాయి కమిటీలతో సంప్రదింపుల తరువాతే ఎంపిక ఉంటుంది. ఇలా ఎన్నికలకు చాలాముందుగా ఈ కసరత్తు పూర్తవనుండటం ఇదే తొలిసారి’’ అని వివరించారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా కొత్తగా, సామాన్యుడి అభిప్రాయాలను ప్రతిబింబించేదిగా ఉండాలని చైర్మన్ల భేటీలో నేతలకు రాహుల్ నిర్దేశించారు. ‘‘నేరాలను, అవినీతిని ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అలాంటి చరిత్ర ఉన్నవారికి ఎంపిక ప్రక్రియలో చోటు దక్కకూడదు. ఓటు బ్యాంకుపై ఆధారపడొద్దు. యువతరం ఆశలు ఎంపిక ప్రక్రియలో ప్రతిబింబించాలి. ఎంపిక ప్రక్రియలోనే ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలిగితే విజయం వరిస్తుంది’’ అని వారికి సూచించారు.
వారంలో ప్రక్రియ షురూ: ఈనెల 17న ఏఐసీసీ సమావేశం అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రారంభం కానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. నెలాఖరుకల్లా కనీసం 100 సీట్లకు ఎంపిక పూర్తి చేయాలని రాహుల్ పట్టుదలతో ఉన్నట్టు వివరించాయి.