'అమేథీలో రాహుల్ గాంధీకి భారీ ఓటమి...'
రానున్న లోకసభ ఎన్నికల్లో స్వంత నియోజకవర్గం అమేథీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి భారీ తేడాతో ఓటమి తప్పదని ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుమార్ విశ్వాస్ హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్ లకు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని కుమార్ విశ్వాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లతో మాట్లాడిన తర్వాత రాహుల్ గాంధీకి భారీ ఓటమి తప్పదని ఆయన అన్నారు. అమేథీ ఎన్నికల్లో తనకు విజయంపై కుమార్ విశ్వాస్ ధీమా వ్యక్తం చేశారు.
అమేథి నియోజకవర్గంలో అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని కుమార్ విశ్వాస్ తెలిపారు. అమేథి నియోజకవర్గంలోని శంకర్ గంజ్ గ్రామంలో ఓ బ్రిడ్జి నిర్మాణం గత ఏడేళ్లలో సగమే పూర్తయిందన్నారు. 1980 నుంచి గాంధీ కుటుంబమే అమేథి నియోజకవర్గంలో గెలిచారని ఆయన అన్నారు. సంజయ్ గాంధీ (1980), రాహుల్ గాంధీ (1984, 1989), సోనియా గాంధీ (1999), రాహుల్ గాంధీ (2004, 2009) గెలిచినా.. అమేథిలో అభివృద్ధి శూన్యమని కుమార్ విశ్వాస్ తెలిపారు. అమేథీ నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కుమార్ విశ్వాస్ బరిలో నిలిచారు.