500 కె.జిల పూలతో రాహుల్ గాంధీకి స్వాగతం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్ లోని అమేథీలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాహుల్ గాంధీకి ఘనస్వాగతం చెప్పేందుకు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు అయిదు వందల టన్నుల పూలను ఇప్పటికే సిద్ధం చేశారు. రాహుల్ వచ్చే దారి మొత్తం పూల బాటగా మార్చేస్తామని కాంగ్రెస్ కార్యకర్తలు చెబుతున్నారు.
గత లోకసభ ఎన్నికల్లో 3.75 లక్షల మంది ఓట్ల మెజారిటీతో రాహుల్ గెలుపొందారు. ఈ సారి ఆ అంకెను దాటేయాలని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుదలతో ఉన్నారు. మరో వైపు సుప్రసిద్ధ కవి కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున, టీవీ నటి స్మృతి ఇరానీ బిజెపి తరఫున రాహుల్ ను సవాలు చేస్తున్నారు. వారు అమేథీ నియోజకవర్గ అభివృద్ధి విషయంలో రాహుల్ గాంధీని బహిరంగ చర్చకు సవాలు చేశారు. కానీ రాహుల్ మాత్రం ఇప్పటి వరకూ దీనిపై స్పందించలేదు.
రాహుల్ కు మద్దతుగా ప్రచారం చేసేందుకు సోదరి ప్రియాంకా వాద్రా రంగంలోకి దిగనున్నారు. ఆమె ఈ సారి తల్లి, తమ్ముడికి మాత్రమే ప్రచారం చేస్తానని ప్రకటించారు. ప్రియాంక ప్రచారం చేస్తే కాంగ్రెస్ కు చాలా ఉపయోగంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు.